దేశంలో అమాయక గిరిజన మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఒడిశాలో ఓ గిరిజన మహిళ కామపిచాచుల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
మల్కాన్‌గిరి: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో సామూహిక లైంగిక దాడికి గురైన గిరిజన మహిళ చనిపోయింది. మే 7 న తేకాబాడా గ్రామంలో పోలీసు క్యాంటీన్ లోపల గుర్తు తెలియని దుండగులు ఆమెపై దాడి చేసి, అత్యాచారం చేశారు. బాధితురాలి భర్త మాఘారా ఫౌండేషన్ అనే సామాజిక సంస్థ సభ్యులతో కలిసి మే 9న ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే చేతగానితనం, నిర్లక్షం కారణంగానే బాధితురాలు చనిపోయిందని మాఘారా అధ్యక్షుడు రుతుపర్ణ మొహంతి ఆరోపించారు. కేసు దర్యాప్తు చేయడానికి మల్కన్‌గిరి ఎఎస్‌పి నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నైరుతి శ్రేణి డిఐజి షెఫీన్ అహ్మద్ కె. తెలిపారు.

బాధితురాలిని ముందుగా మల్కాన్‌గిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొరాపుట్‌కు తీసుకెళ్లారు. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బెర్హంపూర్‌ ఎంకేసీజీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది. కాగా, ఈ అఘాయిత్యం వెనుక పోలీసుల ప్రమేయం ఉండొచ్చని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీస్‌ క్యాంటీన్‌లోకి బయటకువాళ్లు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి జూన్‌ 9వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేశ్‌ ఖిలారిని ఒడిశా మానవ హక్కుల సంఘం ఆదేశించింది. రోజువారీ కూలీ అయిన బాధితురాలి భర్తకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని హక్కుల కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.