న్యూఢిల్లీ : దేశంలో భావి భారతం పోషకాహారలోపంతో బాధపడుతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు బయటపెట్టాయి. కానీ కేంద్ర బడ్జెట్‌లో మాత్రం ఈ సమస్య పరిష్కారానికి సరైన కేటాయింపులు లేవు. ఇందులో కీలకమైన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ దీర్ఘకాలంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్నది. వాస్తవ అవసరాలకు తగిన విధంగా కేటాయించకుండా పోషకాహార పథకాలకు మోడీ సర్కార్‌ కోత పెట్టింది. ఏకంగా 19 శాతం నిధులు తగ్గించటంపై మోడీ సర్కారు నిర్లక్ష్యంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసీడీఎస్‌) లేదా ఐదు ప్రధాన పోషకాహార సంబంధిత పథకాలకు తాజా బడ్జెట్‌లో కేటాయించింది రూ.27,057 కోట్లు. అంగన్‌వాడీ సేవల పథకం, పోషన్‌ అభియాన్‌, రాజీవ్‌గాంధీ నేషనల్‌ క్రెచ్‌ స్కీమ్‌, ప్రధాన్‌ మంత్రి మాతృ వందన యోజన, కౌమార బాలికల కోసం పథకం ఇందులో భాగం. ఈ పథకాలు 0-6 సంవత్సరాల మధ్య పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ-పాలిచ్చే మహిళల్లో ప్రత్యక్ష పోషకాహార సంబంధాన్ని కలిగివున్నాయి. గతేడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే.. ఇది 3.7శాతం పెరిగింది. గత అంచనాలను చూస్తే ఈ కాస్త పెరుగుదల మానవ వనరుల అవసరాలకు ఏ మాత్రం సరిపోవు.

పోషకాహారలోపం బహుముఖ సమస్యలతో ముడిపడివున్నది. ఆహారం, ఆరోగ్యం, సంరక్షణ అనే అనేక అంశాలతో ముడిపడివున్నది. అంటే.. ఆహార భద్రత, ఆరోగ్య సేవలు, పారిశుధ్యం, ఉపాధి వంటి వాటికి తగినంత నిధులు కూడా పెరగాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్న భోజన పథకం, జాతీయ ఆరోగ్య మిషన్‌, ఆహార సబ్సిడీ పథకం, ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ తాగునీటి మిషన్‌ వంటి పథకాలకు కేటాయించిన మొత్తం రూ.2,76,885 కోట్లు. గతేడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇది 19శాతం తక్కువ. జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద మంజూరు చేసిన కీలకమైన ఆహార సబ్సిడీ పథకం ద్వారా దేశ జనాభాలో 67శాతం మందికి ఆహారధాన్యాలను పంపిణీ చేయాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం, పట్టణ ప్రాంతాల్లో 50శాతం. 2019 -20 బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే ఈ పథకానికి కేటాయింపులను రూ.68,650 కోట్లు లేదా 37శాతం తగ్గించారు. ఈ పథక ఫలాలు లబ్దిదారులకు చేరాలంటే.. పటిష్టమైన విధానాలు కావాలని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచించాయి. అంటే ఇందుకు సంబంధించిన కేంద్రీకృత కార్యక్రమాలన్నిటికీ తగిన నిధులు సమకూర్చాలి. కానీ, బడ్జెట్‌లో కేంద్రసర్కార్‌ కోతలు పెట్టింది.

Courtesy Nava Telangana