* కనీస వేతనాలు కూడా కరువు
* కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో అమలు
* సుప్రీంకోర్టు తీర్పు… కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోని కేసీఆర్‌ సర్కార్‌

రాష్ట్రంలో ప్రయివేటు రంగంలో పని చేస్తున్న నర్సులకు కనీసవేతనాల అమలు సుదూరస్వప్నంలాగే మిగిలిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశంతో కనీసవేతనాల అమలు కోసం కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసి మూడేండ్లు గడుస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వీటిని తొలుత కేరళ అమలు చేయగా ఆ క్రమంలో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చి కనీసవేతనాలు ఇచ్చేలా తగిన ఆదేశాలిచ్చాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అక్కడి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వాదనను కొట్టి వేసి ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ప్రయివేటు నర్సులకు కనీస వేతనాలు అమలు చేయాలని మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా నర్సులు పదే పదే కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీస వేతనాల కోసం ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ) న్యాయపోరాటం చేసింది. 2011లో ప్రయివేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హౌంలు, నర్సింగ్‌ కళాశాలలు, స్కూల్స్‌ లలో నర్సులకు కనీసవేతనాలు అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు 2016లో ప్రయివేటులో పని చేస్తున్న నర్సులకు కనీసవేతనాలు అమలు చేయాలని, ఇందుకోసం నిపుణుల కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ కనీస వేతనాల కోసం సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు నర్సులకు 50 బెడ్స్‌ లోపు ప్రయివేటు ఆసుపత్రుల్లో కనీసవేతనం రూ.20,000తో పాటు అలవెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 50 నుంచి 100 బెడ్స్‌ ఆసుపత్రులు రూ.20,850తో పాటు అలవెన్సు, 100 నుంచి 200 బెడ్స్‌ ఉన్న ఆసుపత్రులు జీతభత్యాలు కలిపి 32,500 తగ్గకుండా, 200 బెడ్స్‌ కన్నా ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో రూ.34,000కు తగ్గకుండా ప్రారంభవేతనం చెల్లించాల్సి ఉంది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కేరళ , కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. మన రాష్ట్రంలోనూ ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని నర్సింగ్‌ సంఘాలు చాలా కాలం నుంచి కోరుతున్నాయి. పలుమార్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. తాజాగా నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్‌ రుఢావత్‌ ఈ కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ కు లేఖ రాశారు.

అమలుకు వెనుకడుగు ఎందుకు?
ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిడితోనే మార్గదర్శకాలు అమలు చేయకుండా ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చాలా వరకు 200 బెడ్స్‌ కన్నా ఎక్కువగా ఉన్నవే కావడం, ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ఆ ఆసుపత్రుల్లో ప్రారంభవేతనం రూ.34,000 (ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదే కేడర్‌ లో పని చేసే వారితో సమానంగా) ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్గదర్శకాలను అమలు చేయకుండా ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని నర్సింగ్‌ సంఘాలు అనుమానిస్తున్నాయి. ఇకనైనా తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో మార్గదర్శకాల అమలు కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

                                                                                                  (Courtacy Prajashakti)