– ప్రయివేటు ఆస్పత్రుల్లో పరిస్థితులపై పిల్‌
– కేంద్రం, ఢిల్లీ సర్కారు స్పందన కోరిన ఆ రాష్ట్ర హైకోర్టు

న్యూఢిల్లీ : ప్రాణాంతక కోవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించే ప్రొటెక్షన్‌ కిట్లు ప్రయివేటు ఆస్పత్రుల్లోని నర్సులకు సరిగ్గా అందడంలేదని ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. అయితే ఈ పిల్‌పై స్పందించిన న్యాయస్థానం.. కేంద్రంతో పాటు ఢిల్లీ సర్కారు, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌(ఐఎన్‌సీ) నుంచి స్పందనను కోరింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.ఎన్‌ పటేల్‌, న్యాయమూర్తి ప్రతీక్‌ జలాన్‌ లతో కూడిన ధర్మాసనం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు, ఢిల్లీ ప్రభుత్వానికి, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌కు నోటీసులను జారీ చేసింది. పిల్‌పై వైఖరి తెలియజేయాల్సిందిగా ఆదేశించింది. ప్రయివేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో నర్సులకు వాడిన పీపీఈ కిట్లను అందిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ఎన్జీవో ఈ పిల్‌ను వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారితో పోలిస్తే వీరికి అందే సదుపాయాల పట్ల కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం వివక్షతను చూపిస్తోందంటూ ఆరోపించింది. ఈ విషయంపై నర్సులు వ్యక్తిగతంగా, సంఘాలుగా ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎన్జీఓ పేర్కొన్నది. అలాగే అన్ని ప్రయివేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌ల సమాచారాన్ని, కోవిడ్‌-19 బారిన పడిన వైద్యులు, నర్సుల సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా కోరింది.

Courtesy Nava Telangana