ఇవేం ఎన్‌వోసీలు?..
ఆఫీసుల్లో కూర్చుని ఇచ్చే వాటికి విలువేంటి?
నుమాయిష్‌ కన్నా ప్రజల భద్రతే ముఖ్యం
వారి ప్రాణాలను పణంగా పెట్టి అనుమతి ఇవ్వం
అనుకోని ఘటన జరిగితే పూచీ ఎవరిది?
జీవోలోని అన్ని నిబంధనలూ పాటించాల్సిందే
పార్కింగ్‌కు 40 శాతం జాగా ఏదీ?
ప్రభుత్వ భవనాలు తీసుకుంటే అనుమతులేవీ?
ఎమర్జెన్సీలో తప్పించుకునే మార్గాలుండాలి
ఎన్‌వోసీలు, పార్కింగ్‌లపై హైకోర్టు అసంతృప్తి
అఫిడవిట్‌ వేయాలని సీపీకి హైకోర్టు ఆదేశం

‘‘నుమాయిష్‌ నిర్వహణ ఒక జోక్‌లా తీసుకోకూడదు. ఒక్క అగ్గిపుల్లతో లండన్‌ నగరంలో సగ భాగాన్ని దహనం చేయవచ్చు. చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదు’’

-హైకోర్టు

హైదరాబాద్‌: నుమాయి్‌షకు వివిధ శాఖలు ఇచ్చిన ఎన్‌వోసీలపై హైకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, విద్యుత్తు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌, వైద్య, ఆరోగ్యశాఖ, టౌన్‌ ప్లానింగ్‌ తదితర శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్‌ ఎగ్జిబిషన్‌ జరిగే ప్రదేశాన్ని సందర్శించి సంతృప్తి చెందిన తర్వాతే ఎన్‌వోసీలు ఇచ్చారా? అని ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా కార్యాలయాల్లోనే కూర్చుని ఇచ్చే ఎన్‌వోసీలకు ఎలాంటి విలువ ఉండదని వ్యాఖ్యానించింది. ‘

‘ఎగ్జిబిషన్‌ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం. వారి ప్రాణాలను పణంగా పెట్టి నుమాయిష్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించింది. ‘‘అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చూడాలి. ఒక వేళ జరిగితే ప్రాణనష్టం జరగకుండా తప్పించుకునేందుకు విశాలమైన మార్గాలు ఉండాలని’’ స్పష్టం చేసింది. నుమాయిష్‌ వద్ద ఎన్ని అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి? ఎన్ని అగ్నిమాపక వాహనాలు ఉన్నాయి? ఎన్ని అంబులెన్సులు ఉన్నాయో వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. నుమాయి్‌షలో ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీవోలోని అన్ని మార్గదర్శకాలూ పాటించారా..? అని ప్రశ్నించింది. ఎగ్జిబిషన్‌ స్థలంలో నిబంధనల ప్రకారం 40శాతం జాగాను వాహనాల పార్కింగ్‌ కోసం కేటాయించారా అని నిలదీసీంది.

వాహనాల పార్కింగ్‌ కోసం చుట్టుపక్కల ప్రభుత్వ శాఖల భవనాలకు అనుబంధంగా ఉన్న స్థలాలను కేటాయించినట్లు కమిషనర్‌ ఇచ్చిన అఫిడవిట్లో తెలిపారు. అయితే ఆయా శాఖల నుంచి అనుమతి పత్రాలు చూపించాల్సిందిగా ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో ఎంతకాలమైనా వాదనలు వింటామని, నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకోకపోతే నుమాయి్‌షను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.

అన్ని చర్యలూ తీసుకున్నాం: ఎస్‌జీపీ
గత 80 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే అగ్ని ప్రమాదం జరిగిందని, కోర్టు ఆదేశాల ప్రకారం ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ వివరణ ఇచ్చారు. 1.5లక్షల లీటర్ల సామర్థ్యంగల రెండు భూగర్భ నీటి ట్యాంకులు సిద్ధం చేశామని, 15 మీటర్ల దూరం వరకు నీటిని వెదజల్లే స్ర్పింటర్లను ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు. ప్రమాదం సంభవిస్తే సందర్శకులు సురక్షితంగా బయటపడేందుకు ఏర్పాట్లు చేశామని స్పెషల్‌ జీపీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పక్కనున్న ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

‘‘అనుకోని ప్రమాదం సంభవించి 200 మంది ప్రజలు చనిపోయారనుకుందాం..?ఎవరు బాధ్యత వహిస్తారు? మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ఎన్‌వోసీలు ఇచ్చిన అధికారులు ఇస్తారా? ప్రమాదంలో క్షతగాత్రుల సంగతేంటి? నుమాయిష్‌ నిర్వహణ ఒక జోక్‌లా తీసుకోకూడదు. ఒక్క అగ్గిపుల్లతో లండన్‌ నగరంలో సగ భాగాన్ని దహనం చేయవచ్చు. చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదు’’ అని ధర్మాసనం హెచ్చరించింది. ‘‘గత ఆరునెలల్లోనే హైకోర్టులో రెండుసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల పొగలు వచ్చాయి. సకాలంలో గుర్తించడం వల్ల ఎవరికీ తెలియలేదు, రాజస్థాన్‌ హైకోర్టు జైపూర్‌ బెంచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

అక్కడ అగ్నిమాపక పరికరాలు లేకపోయి ఉంటే ఈ హైకోర్టులో జరిగిన ప్రమాదం కంటే పెద్దదై ఉండేది. అక్కడ కోర్టే ఉండేది కాదని’’ గుర్తుచేసింది. కోర్టు ఆదేశాలు, జీవోలోని మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. సమగ్ర వివరాలతో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ మంగళవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు ఇప్పటికిప్పుడు తొలగించడం శిరోభారమేనని, దీనివల్ల వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతాయని స్పెషల్‌ జీపీ శరత్‌ కుమార్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.

అలా అయితే… నుమాయిష్‌ను వాయిదా వేసుకొమ్మని ఎగ్జిబిషన్‌ సొసైటీకి చెప్పాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నుమాయి్‌షలో సందర్శకుల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదంటూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది.

(Courtesy Andhrajyothi)