– యూపీ పోలీస్‌ అధికారులను ఆదేశించిన డీజీపి
– బీజేపీ తీరుపై విమర్శలు

లక్నో: అక్రమ వలసదారులను గుర్తించండి అస్సోంలోని జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) పేరిట కేంద్ర ప్రభుత్వం సుమారు 19లక్షల మంది పేద, మైనారిటీ వర్గాల ప్రజలకు తుది జాబితాలో చోటు కల్పించలేదు. దీంతో తమను ఏ క్షణాన దేశం వదిలివెళ్లమంటారోననే భయంతో వారు మానసిక వేధనకు గురవుతూ బతుకుతున్నారు. ఇదే తరహా ప్రక్రియను బీజేపీ పాలిత మరో రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ కూడా చేపట్టనుంది. రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, ఇతర విదేశీయులను గుర్తించాలంటూ ఐజీ, డీఐజీ రేంజ్‌, ఏడీజీ జోన్ల అధికారులకు ఆ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అంతర్గత భద్రతకు ఈ చర్య చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.
దీని కోసం డీజీపీ ప్రధాన కార్యాలయం ఓ ముసాయిదాను తయారు చేసినట్టు వెల్లడించారు. ఈ ముసాయిదా ప్రకారం.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మురికివాడలు, నగరశివార్లు వంటి ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందే బంగ్లాదేశ్‌, ఇతర విదేశీ పౌరులను గుర్తించాలని సూచించారు. ఇందులో భాగంగా వారిని దర్యాప్తు చేసేటప్పుడు వేలి ముద్రలను తీసుకోవాలనీ, వీడియో రికార్డు చేయాలని పేర్కొన్నారు. దర్యాప్తులో వారి చిరునామాను వేరే రాష్ట్రంలో ఉన్నట్టు వెల్లడించినా, అనుమానస్పదంగా కనిపించినా వారి వివరాలను పై అధికారులకు సమర్పించాలని ఆదేశించారు.
బీజేపీ అనుకూలురను గుర్తించే ప్రయత్నంలో భాగమే
ఈ ప్రక్రియపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని మురికివాడల్లో పనిచేసే ఇన్సాని బిర్దారీ సభ్యుడు శ్రీజన్‌ యోగి ఆదియోగ్‌ మాట్లాడుతూ.. యూపీలో బంగ్లాదేశీయులు, ఇతర చొరబాటుదారులను గుర్తించే చర్య కేవలం బీజేపీ అనుకూలురను గుర్తించే ప్రయత్నంలో భాగమేనని అన్నారు. వారు పేదలను, కష్టపడి పనిచేసే కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
బీజేపీ సర్కార్‌ పేదలకే కాకుండా, మానవత్వానికీ వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా పేదలు, నిరాశ్రయులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం యూపీయేననీ, కానీ దీనిని ఎవరూ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నార్సీ విధానాన్ని ప్రశంసించినప్పట్నుంచీ చెత్త ఏరుకునే వారు, పారిశుద్ధ కార్మికులు, రిక్షా లాగేవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్ల గుర్తింపును నిరూపించడం కష్టమైనదని తెలిపారు. లక్నోలోని మురికివాడల్లో పారిశుద్ధ పనులు చేసేవారిలో ఎక్కువమంది బెంగాలీ మాట్లాడే అస్సామీలేననీ, ఇప్పుడు వారందరినీ బంగ్లాదేశీయులుగా ముద్రవేస్తారని వెల్లడించారు.
పేద, మైనారిటీ వర్గాలే లక్ష్యం
అసంఘటిత రంగాల తరఫున పనిచేస్తున్న ‘ఫోరమ్‌ అసంఘటిత్‌ కామ్గర్‌ అధికార్‌ మంచ్‌’ ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ సందీప్‌ ఖరే మాట్లాడుతూ.. లక్నోలో 737కు పైగా మురికి వాడాలున్నాయనీ, వాటిల్లో దాదాపు 12వేల మంది నివసిస్తున్నారనీ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో మురికివాడల్లో నివసించే వారే 45శాతం ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా మున్సిపల్‌ పరిధి పెరుగుతున్నందున అనేక కాలనీలు మురికివాడలుగా మారుతున్నాయని తెలిపారు. దీంతో మురికివాడల్లో నివసించే జనాభా కూడా పెరుగుతున్నదని చెప్పారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో పరిశీలన సాధ్యం కాదనీ, ఇలా చేయడం ద్వారా ప్రజలను భయపెట్టినట్టవుతుందని అన్నారు. గిరి అధ్యాన్‌ వికాస్‌ సంస్థాన్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం.. లక్నో రోడ్లపై రోజుకు 3200మంది నివసిస్తున్నారనీ, అనధికారిక లెక్కల ప్రకారం.. వీరి సంఖ్య 12వేలకు పైనే ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా ఇతర జిల్లాలైన సుల్తాన్‌పూర్‌, సీతాపూర్‌, ఉన్నావో, హార్డోయి నుంచి లక్నో వచ్చి షెల్టర్‌హౌంలలో నివసించేవారు కూడా ఉన్నారని తెలిపారు. వారు తమ గుర్తింపును నిరూపించుకోలేకపోతే, ప్రభుత్వం వారి ఉద్యోగాలు తొలగించి ఇండ్లకు పంపిస్తుందా? అని సందీప్‌ ప్రశ్నించారు. పేద, మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకునే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదనే విషయం అందరికీ తెలుసునని అన్నారు. ధ్రువీకరణల పేరిట ప్రజలను వేధిస్తూ, దోపిడి చేసేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని విమర్శించారు.

Courtesy Navatelangana..