డాక్టర్‌ అజయ్ గుడవర్తి

జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) వలన ముస్లింలకు ఏ విధంగా ముప్పు అదేవిధంగా హిందువులకూ హాని ఉంది. ఎందుకంటే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ఒకరి మతాన్ని రుజువు చేసుకొమ్మని చెప్పే నైతిక విపత్తు. దీని ద్వారా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలవచ్చు. ఎందుకంటే భారతీయులు హిందూత్వ జాతీయ వాద అంశాన్ని అర్థం చేసుకోవడంలో మార్పు సంభవిస్తుంది.

ఎన్‌ఆర్‌సీ అనేది మోడీ-షా నాయకత్వ పాలనలో, కొంత కాలం వరకు రాజకీయ ప్రాతినిథ్యాన్ని తామే శాసించగలం అని చెప్పే ఒక జూదం. ఎన్‌ఆర్‌సీ గూర్చి ఇంకోమాటలో చెప్పా లంటే, హిందువులను, ముస్లింలను రాజకీ యంగా విభజించడంలో విజయవంతం అయిన ‘గుజరాత్‌ మోడల్‌’ యొక్క విస్తరణ. దీని ద్వారా గుజరాత్‌లో బీజేపీ తన ఎన్నికల డివిడెండ్ల (ఫలాలు)ను వరుసగా నాలుగు పర్యాయాలు పొందింది. ‘గుజరాత్‌ మోడల్‌’ ‘హింస, విద్వేషం, సాంస్కతిక పరాయికరణతో కూడి ఉన్న సామాజిక రాజకీయ విభజనను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంలో ఎన్‌ఆర్‌సీ అనేది ప్రజల మధ్య రాజకీయ విభజనను సంస్థాగతం చేసే చట్టపర మైన విధాన పనిముట్టు. దీని ద్వారా పౌరసత్వ జాబితా నుంచి ముస్లింలను తీసివేస్తా రని, హిందువులను కలుపుకుంటారని భావిస్తున్నారు.

మెజారిటీ సమాజం యొక్క ప్రతీకార సాధికారత యొక్క విధానం మునుపటి సందర్భాలలో పనిచేసినట్టు అనిపిస్తుంది. కానీ గత కొన్నిరోజులుగా జరుగుతున్న సామూహిక నిరసనలు అంతకుముందు చేసినట్టుగా ఇది ఎందుకు బయటపడకపోవచ్చు అనేదానికి మరింత విశ్లేషణ అవసరం. ఈ నిరసనలలో ఎక్కువభాగం ముస్లిమేతరులు అధిక సంఖ్యలో నాయకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అశాంతి నెలకొంది. ఇలా జరగడానికి గల కారణాలను మనం విశ్లేషించాలి.

మొదట అస్సాంతో సహా ఈశాన్య రాష్టాలు సీఏఏని, హిందువులైనా, ముస్లింలయినా, బయటివారు అనే పేరుతో మతాలకు అతీతంగా వ్యతిరేకించాయి. ఇది ఒక విధంగా భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో నిరసనలకు దారితీసింది. అసోంలో ఎన్‌ఆర్‌సీకి లభిస్తున్న మద్దతు అస్సామీల భాషా, సాంస్కతిక పరిరక్షణకు సంబంధించినది మాత్రమేగాని, మత జాతీయత గురించి కాదని స్పష్టంగా తెలుస్తోంది. మొదటి దిశలోనే మత, రాజకీయ విభజనలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలో విఫలమైంది. హిందూ సెంటిమెంట్‌ కనుమరుగయ్యింది. గట్టి ప్రతిఘటన ఉన్నప్పటికీ సీఏఏని ముందుకు తేవడం వలన హిందూ సెంటిమెంట్‌ కనుమరుగై, హిందూ అనుకూల వాదనలను మరింతగా బలహీనపరిచింది.
రెండవది, ఎన్‌ఆర్‌సీ హిందువులలో సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని పేదలు, నిరక్షరాస్యులు పట్ల అనిశ్చితి కలిగి ఉంది. అస్సాంలో రూపొందించిన ఎన్‌ఆర్‌సీలో ముస్లింల కన్నా ఎక్కువగా హిందువులు ధ్రువీకరణ పత్రాలు లేక అక్రమ వలసదారులుగా గుర్తించబడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం హిందువులలో భయాందోళనలు పోగొట్టి, వారివద్ద ధ్రువీకరణ పత్రాలు ఉన్నా, లేకపోయినా భారతదేశం వారి జన్మభూమి కాబట్టి వారికి పౌరసత్వ హామీ ఇచ్చేట్టు చట్టం రూపొందించబడింది. ఈ భయాందోళనల వలన సీఏఏకి మద్దతు లభించినట్టు అనిపిస్తుంది. ఈ ప్రక్రియలో బయటి వ్యక్తులకు పౌరసత్వం కల్పించిన తర్వాత వారు ఎక్కడ స్థిరపడతారు వంటి ప్రశ్నలు కనుమరుగయ్యాయి.

ఏది ఏమైనప్పటికి, ఎన్‌ఆర్‌సీ వలన ఒకరు కచ్చితంగా హిందువు అని నిరూపించుకోవాల్సిన విషయం సమస్యాత్మకమే. ప్రస్తుత ప్రభుత్వ సంస్థలు, అధికారుల పని తీరుపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిన తరుణంలో ఒకరు తన యొక్క హిందూ మత ధ్రువీకరణ పొందడంలో లోపాలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది. ఇదే కనుక జరిగితే ఈ ప్రక్రియ ఒక కఠినమైన పనిగా ముగుస్తుంది.

ఒకరు ఈ భూభాగంలోనే జన్మించారని రుజువు చేసుకునే క్రమంలో తలెత్తే ఇబ్బందుల విషయం లోనూ, నైతిక ఇబ్బందుల విషయంలోనూ ఎన్‌ఆర్‌సీ ముస్లింలకు ఎంత ప్రమాదంగా మారిందో హిందువులకు కూడా అంతే ప్రమాదంగా మారింది. వర్గాలను విభజించడానికి బదులుగా ఎన్‌ఆర్‌సీ, మతాలను ఒకచోట చేర్చి, పౌరుల వాదనలు, హక్కులకు వ్యతి రకంగా అధికారాన్ని వేరుచేసే సూక్ష్మ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిపాలన అధికారాలను కేంద్రీ కృతం చేస్తూ, దేశం మొత్తం క్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ దేశ భద్రత పేరుతో ప్రభుత్వం ఏకపక్ష అధికారాలను వినియో గించుకొంటోంది. ఇక్కడ హిందూ బాధితులను ఇతర వర్గాల నుంచి వేరు చేయలేం. ఇక్కడ భయం, అనిశ్చితి ప్రధాన సమస్యగా మారింది.

మూడవది, శత్రుత్వం, ప్రాదేశిక విభజన పెంపొందించడంలో గుజరాత్‌ మోడల్‌ విజయవంతమైంది. మిగతా భారతదేశంలో ఇది జరగలేదు. ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి, వివిధ ఆర్థిక సామాజిక సమస్యల కారణంగా రోజువారీ జరిగే సంఘర్షణల గురించి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ముస్లింలను, ఇస్లాంను ఒక మతంగా భయపెట్టే ఇస్లామోఫోబియాగా కాకుండా కఠినమైన మతతత్వ ఆకృతిని తీసుకుంది. నిజానికి దేశంలోని అనేక భాగాలలో హిందువులు ముస్లింలతో పాటూ కలిసి నివసిస్తున్నారు. మతతత్వం, ఇస్లామోఫోబియా, పౌరులను పౌరులుగా ఉండకుండా వారి మధ్య అగాథాన్ని సృష్టిస్తుంది. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వర్గాల మధ్య, మత సమాజాల మధ్య శాశ్వత సంఘర్షణ పరిస్థితులను అలాగే ఉంచుతాయని స్పష్టంగా తెలుస్తోంది.

నాల్గవది, ప్రస్తుతం రాజ్యం యొక్క స్వభావం క్రూరత్వంగాను అది మునుపటి కంటే ఎక్కువగా ఉన్నట్టు బహిర్గతం అయింది. అది మతపరమైన గుర్తింపులకు మించి, విద్యార్ధులపై హింసకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఈ రాజ్యహింస మధ్య తరగతి, సామాజిక సంఘాలను, బాలీవుడ్‌, ఇతరు లతో సహా అనేక రకాల సామాజిక సమూహాలను హింసకు వ్యతిరేకంగా వీధుల్లోకి తీసుకొచ్చింది.
హింస యొక్క స్వభావం చాలా క్రూరమైనది. నిరాయుధులు, నిరసనలో భాగం కానివారు, లైబ్రరీలో అధ్యయనాలు చేస్తున్న వారు కూడా హింసకు బాధితులుగా మారారు. హింస అనేది మతాల్ని వర్గాలుగా విభజించడం కన్నా ఎక్కువ ప్రభావవంతమైనది. విద్యార్థులపై జరిగే దాడులలో విద్యాసంస్థలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఈ నష్టాన్ని తిరిగి పొందలేం. ఇది విద్యార్థుల భవిష్యత్‌ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

గాయపడిన వారిలో హిందూ విద్యార్థులు ఉన్నారు, ముస్లిం విద్యార్థులు ఉన్నారు. వారంతా మొదట విద్యార్థులు, తరువాతే హిందువులు, ముస్లింలు. చివరి నిమిషంలో చేసిన నష్ట నియంత్రణ విద్యార్థులను దూరాక్రమణదారులుగా, విధ్వంసకారులుగా, అర్బన్‌ నక్సల్స్‌గా చూపించడం వలన జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయారు.

ప్రస్తుతం మన దేశ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న హిందూత్వ జాతీయవాదాన్ని, ఎన్‌ఆర్‌సీ తిప్పికొట్టే అవకాశం ఉంది. మెజారిటీ సమాజానికి వ్యతిరేకంగా, మెజారిటీ వాదానికి ప్రతికూలతలు, సమస్యలు మొదటిసారిగా స్పష్టమయ్యాయి. ఇది ఏక మత గుర్తింపుకు మించి ఆలోచించాల్సిన అవసరాన్ని చెబుతోంది. జన సమీకరణకు, ఏక మత గుర్తింపుని ముందుకి తీసుకురావడం మత పార్టీలు అనుసరించే ప్రధాన వ్యూహం, కాబట్టి దీనిని ఒక ముఖ్యమైన మలుపుగా మనం గమనించాల్సి ఉంది.

రచయిత జేఎన్‌యూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌,
ది వైర్‌ వారి సౌజన్యంతో
అనువాదం : ఎర్రం నవీన్‌, మోహిత్‌ జి (హెచ్‌సీయూ)