– దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ వ్యతిరేక ఆందోళనలు

న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల హౌరు కొనసాగింది. దేశరాజధాని ఢిల్లీ సహా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా నిరసనకారులు ప్రతిపాదిత చట్టాలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ దీక్షలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు.

ఢిల్లీలో నిరసనల హౌరు
సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలతో ఢిల్లీ హౌరెత్తింది. షహీన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ బయట నిరసనకారులు ఆందోళనకు దిగారు. ‘జైల్‌ భరో ఆందోళన్‌’కు పిలుపునిచ్చిన వారంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపాదిత ఎన్నార్సీ, సీఏఏ లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మరోపక్క, ఎముకలు కొరికే చలిలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దాదాపు 250 మంది మహిళలు గత 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలోని యూపీ భవన్‌ బయట యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేశారు. పార్టీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రాపై మహిళా పోలీసుల వైఖరిని వారు నిరసించారు.

పూణేలో భారీ నిరసన ర్యాలీ
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఆందోళనలు ఉధృతంగా సాగాయి. పూణేలో వందలాది మంది నిరసనకారులు ర్యాలీని చేపట్టారు. లెఫ్ట్‌, ముస్లిం సంస్థలు ఏర్పాటు చేసిన ఈ నిరసనర్యాలీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని గోలీబార్‌ మైదానం వద్ద ప్రారంభమై.. డివిజనల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నిరసనకారులు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు.

చట్టాన్ని నిరసిస్తూ ముగ్గులు..
చెన్నైలో 8 మంది అరెస్ట్‌ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ చెన్నైలోని పలువురు ఆందోళనకారులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. రోడ్లపైన, పలువురి ఇంటి ముందు ముగ్గులు వేశారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. దీంతో పోలీసులు నలుగురు మహిళలను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. నిరసన తెలిపేందుకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పారు. అయితే, నిరసన తెలిపేందుకు చెన్నై పోలీసులు అనుమతి ఇవ్వడం లేదనీ, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని ఆందోళనకారులు తెలిపారు. నిరసన తెలిపిన వారికి నటి రిచా చద్దా మద్దతుగా నిలిచారు. ముగ్గు వేయడం కూడా జాతి వ్యతిరేకమా? అని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

బీజేపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు
సీఏఏ నిరసనకారులపై తన మద్దతుదారులను ఉసిగొల్పుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అసోం బీజేపీ ఎమ్మెల్యే మృణాల్‌ సైకియాపై పోలీసులకు సామాజిక సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై దాడులు దిగాలంటూ తన మద్దతుదారులతో ఆయన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మేరకు సామాజిక కార్యకర్తలు ఆయనపై కేసు నమోదు చేశారు.

(Courtesy Nava Telangana)