• 2003 చట్టంలో 12 ప్రశ్నలే.. తాజాగా వచ్చి చేరినవి మరో 8
  • వీటి చట్టబద్ధత ప్రశ్నార్థకం
  • చట్టంలో స్వచ్ఛందం మాటే లేదు
  • స్వచ్ఛందం పేరిట కొత్త ప్రశ్నల్ని చొప్పించే యత్నం?
  • ఆధార్‌నూ స్వచ్ఛందంగా సేకరించండి
  • ఎన్యూమరేటర్లకు సూచనలు
  • గోప్యతకు భంగమంటూ పిటిషన్‌
  • కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఎన్‌పీఆర్‌ రూల్‌ ఏం చెబుతోంది..?
2003లో వాజ్‌పేయి హయాంలో చట్టానికి చేసిన సవరణ ఎన్‌పీఆర్‌కు చట్టబద్ధ ప్రాతిపదిక ఏర్పరుస్తోంది. ఈ నిబంధనల్లో వివరాలు ఇవ్వడం స్వచ్ఛందం అని లేదు. సరైన వివరాలివ్వని పౌరులకు జరిమానా కూడా విధించే నిబంధన ఉంది. ‘‘ఎన్‌పీఆర్‌ డేటా సేకరణ సమయంలో పేరు, కుటుంబంలోని మిగిలినవారి పేర్లు, ఇతర సరైన వివరాలు ఇవ్వడం ప్రతీ కుటుంబ పెద్ద బాధ్యత..’’ అని చట్టంలో ఉంది.
జాతీయ పౌర పట్టిక కోసం ఇచ్చే సమాచారం స్వచ్ఛందమే కానీ తప్పనిసరి కాదు…. ఎన్‌పీఆర్‌ డేటాను రాష్ట్రాలు సేకరించడం రాజ్యాంగ విధి..’’
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
ఎన్నార్సీకి ఎన్‌పీఆర్‌ తొలి మెట్టు అని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన ఓ లేఖలో లిఖితపూర్వకంగా తెలిపింది. కానీ హోంమంత్రి అమిత్‌ షా మాత్రం రెండింటికీ ఎలాంటి సంబంధమూ లేదంటున్నారు. మరోవైపు కిషన్‌రెడ్డి… ఎన్‌పీఆర్‌లో అన్ని వివరాలూ ఇవ్వడం తప్పనిసరేం కాదు అంటున్నారు. తప్పనిసరి కాదు అంటున్నపుడు అమలు చేయడమెందుకు..? మేం ప్రజలకు ఏం చెప్పాలి? ఇవ్వండనా, ఇవ్వొద్దనా..?
ముఖ్యమంత్రి కేసీఆర్‌

న్యూఢిల్లీ : జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఇరకాటంలో పడ్డ కేంద్రానికి జాతీయ పౌరపట్టిక (ఎన్‌పీఆర్‌) కూడా కొత్త సవాళ్లు విసురుతోంది. ‘మీరిచ్చిందే మేం రాసుకుంటాం. ఏదీ తప్పనిసరి కాదు. స్వచ్ఛందమే..’ అని కిషన్‌రెడ్డి వారం రోజుల కిందట ఎన్‌పీఆర్‌పై ఓ వివరణ ఇచ్చారు. అయితే ఎన్‌పీఆర్‌పై రోజుకో రకం వాదనలు కేంద్రం నుంచి వినిపిస్తున్నాయని రెండ్రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మేం ప్రజలకు ఏం చెప్పాలి, వివరాలు ఇవ్వండనా, ఇవ్వొద్దనా..?’ అని సూటిగా ప్రశ్నించారు. వీటికి తోడు ఇపుడు తాజాగా పైకొచ్చిన అంశం ఏంటంటే… అసలు ఎన్‌పీఆర్‌ సేకరణ నిబంధనలకే చట్టబద్ధత లేదన్నది! 2003లో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేసిన పౌరసత్వ సవరణలో- కేంద్రం ఎన్‌పీఆర్‌ డేటా కోసం కేవలం 12 ప్రశ్నలకు మాత్రమే పౌరుల నుంచి సమాధానాలు తీసుకోవాలి.

అంటే ఈ 12 ప్రశ్నలకే చట్టబద్ధత ఉంది. కానీ ఇపుడు మోదీ ప్రభుత్వం అదనంగా 8 ప్రశ్నలను చేర్చింది. ఇలా చట్టంలో లేని అంశాలను తమకు నచ్చినట్లుగా చేర్చేసి, వాటికి సమాధానాలు చెప్పండని ప్రజలను నిలదీయడం కుదరదని, అలా సేకరించే డేటా చట్టబద్ధం కానే కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీటికి తోడు 2003 నాటి చట్టంలో అసలు ఎక్కడా ‘స్వ చ్ఛందం’ అన్న పదమే లేదు. మరో రెండు నెలల్లో ఎన్‌పీఆర్‌ రూపకల్పన నిమిత్తం సేకర్తలను పంపాల్సిన తరుణంలో నేటికీ అసలు ఏం సేకరించాలి, ఎలా సేకరించాలన్నదానిపై కేంద్రం నుంచి రాష్ట్రాలకు స్పష్టత రాలేదు.

రాష్ట్రాల వ్యతిరేకత
కాగా, ఒక్కో రాష్ట్రమూ ఎన్‌పీఆర్‌కు కూడా వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నాయి. ‘ఎన్‌పీఆర్‌ పనిని ఆపేస్తున్నాం’ అని డిసెంబరు 17న బెంగాల్‌ ప్రభుత్వం తీర్మానించింది. ఆ తరువాత 3 రోజులకు కేరళ అదే బాట పట్టింది. కాంగ్రె్‌స-పాలిత రాష్ట్రాలు ఇంకా నిలిపివేత ప్రకటనలు చేయలేదు గానీ ఆ దిశగా సంకేతాలిచ్చాయి. 14 పైచిలుకు రాష్ట్రాలు కేంద్రానికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నాయి. కేసీఆర్‌ మాటల తీరు ప్రకారం తెలంగాణ సైతం ఈ ప్రక్రియను కేంద్రం చేర్చి న కొత్త ప్రశ్నలతో చేపట్టడాన్ని వ్యతిరేకించవచ్చంటున్నారు.
కొత్త వివాదాస్పద అంశాలేంటి..?
2003నాటి చట్టంలో లేని, చట్టబద్ధం కాని అంశాలను ఎలా చేరుస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాల్లో ముఖ్యంగా తలిదండ్రుల జన్మస్థలం, పుట్టిన తేదీ వివరాలు కోరడం ఖచ్చితంగా ఓ వర్గాన్ని దూరం చేయడానికి ఉద్దేశించినదేనన్న అభిప్రాయాలు బలంగా కలుగుతున్నాయి. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు ఐడీ కార్డు, పాస్‌పోర్టు నెంబరు… మొదలైనవి మిగిలినవి. ఈ వివరాలనే కిషన్‌రెడ్డి ‘ఐచ్ఛికం తప్ప ఖచ్చితంగా ఇవ్వాల్సిన పనిలేదు’ అంటున్నారు. తప్పనిసరి కానపుడు అసలు వీటిని చేర్చడం ఎందుకు, అమలు ఎందుకు, దీని వెనుక ఉన్న మతలబేంటి… అన్నది కేసీఆర్‌ ప్రశ్న.
ఎన్నార్సీకి దారితీస్తుందనే ఆందోళన..!
జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ)కు తొలిమెట్టు ఎన్‌పీఆర్‌ అని కేంద్రం గతంలో ప్రకటించడమే మొత్తం ప్రక్రియపై అనుమానాలు రేగడానికి కారణమని స్పష్టమవుతోంది. 2010లో తొలిసారి ఎన్‌పీఆర్‌ చేపట్టినపుడు అది ఎన్నార్సీ రూపకల్పన కోసమే.. అన్న నిర్ణయం గానీ, ఆ రకమైన సంకేతాలు గానీ ఏవీ లేవు. కానీ 2020 నాటి ఎన్‌పీఆర్‌లో మాత్రం అందుకు సంబంధించిన సూచనలున్నాయి. భారత పౌరసత్వ చట్టం ప్రకారం 1987 జూలై 1 తరువాత జన్మించిన వారందరినీ భారతీయులుగా పేర్కొనాలంటే వారి తలిదండ్రులు విధిగా భారత జాతీయత కలిగి ఉండాలన్నది నిబంధన. అందు నిమిత్తమే ఎన్‌పీఆర్‌ వివరాల్లో కొత్తగా తలిదండ్రుల పుట్టిన తేదీ, జన్మస్థలం చేర్చారన్నది సుస్పష్టం. ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలు, ఇతర అన్ని కొత్త వివరాలూ సేకరించాక ఎన్నార్సీ రూపకల్పన గసులువుగా జరిగిపోతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించి స్థిరపడ్డ వలసదారులందరినీ ఏరిపారెయ్యవచ్చు.
కేంద్రం ప్రకటనలతో గందరగోళం
కేంద్ర మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆధార్‌ నెంబరు ఇవ్వడం ఐచ్ఛికమేనని పీయూశ్‌ గోయెల్‌ డిసెంబరు 24న అన్నారు. అదే రోజు న హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ- ‘ఎన్‌పీఆర్‌ డేటా లో భాగంగా ఎన్యూమరేటర్లు అడిగే ప్రతీ దానికీ పౌరులు స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించాలి’ అని అన్నారు. ఆయన మాటల్లో ధ్వని ఎలా ఉందంటే .. వివరాలన్నీ చెప్పి తీరాల్సిందే అన్నట్లుగా ఉందన్న వ్యాఖ్యానాలొచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై హోంశాఖ అధికారి వెంటనే భిన్నంగా స్పందించారు. ‘ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, ఓటరు ఐడెంటిటీ కార్టుల నెంబర్లు ఇచ్చి తీరాలి’ అన్నారు. ‘తలిదండ్రులు పుట్టిన తేదీ, జన్మస్థలం సహా ఎన్‌పీఆర్‌ డేటా కోసం కోరే అన్ని అంశాలూ ఇవ్వడం ఐచ్ఛికమేనని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఈ వాదనను జావడేకర్‌ సమర్థించారు.
కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఎన్‌పీఆర్‌ పేరిట కేంద్రం సేకరించబోతున్న డేటా వ్యక్తి స్వేచ్ఛను, గోప్యతను అడ్డుకొంటోందని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రజల వివరాలపై నిఘా పెట్టడానికి అవకాశం ఏర్పరుస్తుందని సుప్రీంకోర్టులో ఓ కేసు దాఖలైంది. ఉద్గార్‌ రామ్‌, బిమలేశ్‌ కుమార్‌, సంజయ్‌ సఫీ అనే ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ కేంద్రానికి నోటీసులిచ్చింది. 2003 నాటి పౌరసత్వ సవరణ చట్టం కింద జాతీయ గు ర్తింపు కార్డులివ్వడాన్నీ పిటిషనర్లు సవాల్‌ చేశారు.
మేన్యువల్‌తో అయోమయం
ఈ ప్రకటనలతో చాలదన్నట్లు కేంద్రం ఎన్యూమరేటర్లకు ఇచ్చిన మేన్యువల్‌లో వీటిని పేర్కొన్న విధానం మరింత గందరగోళపరుస్తోంది. ‘‘ప్రతీ పౌరుడి దగ్గర నుంచీ ఆధార్‌ నెంబరును స్వచ్ఛందంగా సేకరిస్తారు’’ అని అందులో ఉంది. కేంద్రం పేర్కొన్న ఎనిమిది కొత్త అంశాల్లో మరే ఇతర అంశం విషయంలోనూ ఈ ‘స్వచ్ఛంద వెల్లడి’’ అన్న ప్రస్తావన లేదు. పౌరులంతా తమ సరైన వివరాలు సేకర్తలకు ఇవ్వడం వారి బాధ్యత అని పేర్కొన్నారు. మొత్తం మీద 2003లో లేని అంశాలను చొప్పించి కేంద్రం ఎన్‌పీఆర్‌ డేటా సేకరణకు సిద్ధమవుతోందన్నది సుస్పష్టం. చట్టవిరుద్ధం కాని అంశాలతో వెళితే కోర్టుల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయన్న ప్రశ్నలు అధికారగణంలో ఉన్నాయి.

(Courtesy Andhrajyothi)