Image result for TSRTC Workers Support Women's jacసర్కార్‌ బెదిరింపుల వల్లే బలవన్మరణాలు
– పరాకాష్టకు కేసీఆర్‌ నియంతృత్వం
– రౌండ్‌టేబుల్‌లో వక్తలు

సర్కార్‌ బెదిరింపుల వల్లే ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారనీ, ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఫం ( ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు కెఎన్‌. ఆశాలత అన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహిళా ట్రాన్స్‌ జెండర్స్‌, జాక్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ మహిళా కండక్టర్లు, ఉద్యోగులతో రౌండ్‌టేబుల్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మెపై కేసీఆర్‌తో పాటు మంత్రుల బాధ్యతారాహిత్య వ్యాఖ్యల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ నియంతృత్వం పరాకాష్టకు చేరిందని, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. పీవోడబ్ల్యూ నేత సంద్య మాట్లాడుతూ ఆర్టీసీని ప్రయివేటు పరం చేసి, మెఘా కృష్ణారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జూపల్లి రామేశ్వర్‌రావుకు సంస్థను అప్పగించేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఇచ్చిన హమీలనే కార్మికులు అడుగుతున్నారనీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే మరో సకల జనుల సమ్మె తప్పదని తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తున్న 5100 మంది మహిళా కండక్టర్లు, ఉద్యోగులు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారనీ, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ప్రముఖ సామాజిక వేత్త కె. సజయ మాట్లాడుతూ కార్మికులతో ప్రభుత్వం భేషరతుగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. దళిత ప్రజాసంఘాల నాయకురాలు, ప్రొఫెసర్‌ సూరేపల్లి సూజాత మాట్లాడుతూ టీఎస్‌ఆర్టీసీపై ఎవరికి హక్కు లేదని, నిజాం వారసురాలు జొహ్రాబేగం తన సొంత డబ్బులు రూ. 9 కోట్లతో ఏర్పాటు చేసిన సంస్థని వివరించారు.

పీవోడబ్లూ నేత ఝాన్సీ మాట్లాడుతూ మహిళలకు, విద్యార్థులకు భద్రత కల్పించే ఏకైక రవాణా వ్యవస్థ ఒక్క ఆర్టీసీ మాత్రమేనని గుర్తు చేశారు. మహిళా ట్రాన్స్‌ జెండర్స్‌ నాయకురాలు మీరా సంఘమిత్ర మాట్లాడుతూ కార్మికులు హక్కుల కోసం జరిపిన పోరాటాలన్ని చరిత్రలో విజయాన్ని నమోదు చేసుకున్నాయని అన్నారు. భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యత్తమమైన ప్రజారవాణా వ్యవస్థగా పేరొందిన టీఎస్‌ఆర్టీసీని కాపాడుకోడానికి అందరూ కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోహైకోర్టు న్యాయవాది వసుధ, టీఎంయూ మహిళా నాయకురాలు ఉషా, ఆర్టీసీ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

(Courtesy Nava Telangana)