పెళ్లికి అంగీకరించలేదని ఓ ఉన్మాది ఘాతుకం

బౌద్ధనగర్‌/అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ : బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించింది. పెళ్లి చేసుకుందామన్నాడు. తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తనను మరిచిపొమ్మని తెగేసి చెప్పింది. అంతే.. అహం దెబ్బతిన్న అతడు, ఆ అమ్మాయిపై కక్ష పెంచుకున్నాడు. మాట్లాడుకుందామని బాలికను డాబా మీదకు పిలిచి.. తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి కిందికి తోసేశాడు. అంతర్జాతీయ బాలికల దినోత్సవమైన శుక్రవారం సికింద్రాబాద్‌ చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇలా అభంశుభం తెలియని ఓ బాలిక హతమైన ఘటన వెలుగుచూసింది. నార్త్‌జోన్‌ డీసీపీ కలమేశ్వర్‌, అదనపు డీసీపీ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ వారాసిగూడకు చెందిన బాలిక (17) ఇంటర్‌ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన షోయబ్‌ (21) అనే యువకుడు చిన్నప్పటి నుంచి ఆమెతో పాటు చదువుకున్నాడు. ఆమెకన్నా రెండేళ్లు సీనియర్‌ అయిన అతడు, కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. 2018లో బాలిక తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత అతడి వేధింపులు శ్రుతిమించాయి. ఇటీవల బాలికను తనకే ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఇంటికొచ్చి ఆమె తల్లిపై ఒత్తిడి తెస్తున్నాడు. బాలిక తల్లి నిరాకరించడం.. బాలిక కూడా తనతో సరిగా మాట్లాడకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.

ఈనెల 23న బాలిక ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కాపు కాసిన షోయబ్‌, ఆమెను అడ్డుకున్నాడు. మాట్లాడుకుందామంటూ ఆమె ఇంటి రెండో అంతస్తుపైకి తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి పెళ్లి ప్రస్తావన తేవడంతో బాలిక తిరస్కరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన షోయబ్‌, ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కిందపడేయడంతో సంతోష్‌ అనే స్థానికుడు గుర్తించి 100కు ఫోన్‌ చేశాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి, స్థానికులు వ్యక్తం చేసిన అనుమానంతో షోయబ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడిని విచారిస్తున్నామని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని డీసీపీ వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Courtesy Andhrajyothiz