– పౌరసత్వ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌
– ఇంపాల్‌లో ఘర్షణలు.. నేడు మణిపూర్‌ బంద్‌కు పిలుపు
గువహతి: ‘పౌరసత్వ (సవరణ) బిల్లు-2019’కు వ్యతి రేకంగా ఈశాన్యరాష్ట్ర విద్యార్థులు చేస్తున్న ఆందోళనలతో ఈశాన్య భారతం దద్దరిల్లింది. 8 ఈశాన్య రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాలు ‘నార్త్‌ ఈస్ట్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌’ (నెసో)గా ఏర్పడి, బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని గళమెత్తారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లకు మెమోరాండం సమర్పించారు. ఇంపాల్‌లో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీనికి నిరసనగా మంగళవారం మణిపూర్‌ బంద్‌కు విద్యార్థులు పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధానికి ‘మేఘాలయ సామాజిక సంస్థల సమాఖ్య’ పిలుపునిచ్చింది. అసోంలోని తొమ్మిది రాజకీయ పార్టీల సభ్యులు కలిసి ‘లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమిగా ఏర్పడి.. బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
1955 పౌరసత్వ చట్టాన్ని సవరించి.. ఇతర దేశాల్లో నుంచి వస్తున్న హిందువులకు భారత పౌరసత్వం కల్పించడమే ధ్యేయంగా సర్కారు బిల్లును ప్రవేశపెడుతున్నదని నెసో ఆరోపించింది. ఈశాన్యంలో పాక్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ నుంచి వచ్చిన శరణార్థుల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ బిల్లును అభివర్ణించింది. దీని కారణంగా ఈశాన్య ప్రజలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదమున్నదని వెల్లడించింది. గువహతిలో నెసో ప్రధాన విభాగమైన ‘ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌’ (ఏఏఎస్‌యూ)రాష్ట్ర రాజ్‌భవన్‌ ముందు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలకు దిగింది. విద్యార్థి సంఘం ముఖ్య సభ్యులు డాక్టర్‌ సముజ్జల్‌ కుమార్‌ భట్టాచార్య, దీపంకానాథ్‌, గోగోరు సహా వందలాది మంది కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, ఖాసీ స్టూడెంట్స్‌ యూనియన్‌, మిజో జిర్లారు పాల్‌, గారో స్టూడెంట్స్‌ యూనియన్‌, నాగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, ట్విప్రా స్టూడెంట్‌ ఫెడరేషన్‌, ఆల్‌ మణిపూర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌లు చేపట్టిన విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఈశాన్య ప్రాంతం దద్దరిల్లింది.
నెసో సభ్యులు డాక్టర్‌ సముజ్జల్‌ కుమార్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘ఇది ఒక మతపరమైన బిల్లు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయుల ఓట్లను బీజేపీ కోరుకుంటున్నది. దీనిలో భాగంగానే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నద’ని ఆరోపించారు. ఈ బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.

Courtesy NavaTelangana..