* అసోంలో ముగ్గురు మృతి
* క్యాబ్‌పై అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రాలు
* ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌
* వీధుల్లోకి వేలాదిమంది
* సిఎం నివాసం, డిజిపి కాన్వారుపై రాళ్లు
* ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

న్యూఢిల్లీ : ఈశాన్యం మరో జమ్ముకాశ్మీర్‌ను తలపిస్తోంది. సైనిక పద ఘట్టనలు, తూటాల మోతలతో భయానక వాతావరణం కనిపిస్తోంది. పోలీసుల తూటాలకు గురువారం ముగ్గురు పౌరులు బలైపోయారు. పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌)ను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలలో కొనసాగుతున్న ఆందోళనలు గురువారం ఉధృతమయ్యాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయాల్లో కర్ఫ్యూను సైతం లెక్క చేయ కుండా ప్రజలు వేలాదిమందిగా వీధుల్లోకి చేరుకొని బిల్లుకు, మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు. గురువారం సాయంత్రం గువహతిలోని లాలున్‌గావ్‌ ప్రాంతంలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకా రులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. పోలీసుల కాల్పుల్లో ఒక బాలుడు సహా ముగ్గురు చనిపోయారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు కాల్పులు జరపడంతో బాలుడు సహా ముగ్గురు చనిపోయారని, అనేక మంది గాయపడ్డారని ఆందోళనకారులు తెలిపారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘మీ హక్కులను ఎవ్వరూ లాక్కోరు’ అంటూ అస్సాం ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్‌ కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి నివాసంపైకి రాళ్లు
గువహతిలోని ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్‌, కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి నివాసాలపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబారీ ప్రాంతంలో.. బిజెపి మిత్రపక్షమైన అసోం గణపరిషత్‌ (ఎజిపి) పార్టీ ప్రధాన కార్యాలయంపైనా నిరసనకారులు దాడి చేశారు. డిజిపి కాన్వారుపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి సొంత పట్టణం దిబ్రుగఢ్‌ చాబ్వాలో.. స్థానిక ఎమ్మెల్యే వినోద్‌ హజారికా ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇటు కామ్‌రూప్‌ జిల్లాలో కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేదు. దుకాణాలు మూతపడ్డాయి. రంగియా పట్టణంలో నిరసనకారులపై పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. పలుచోట్ల లాఠీచార్జి చేశారు. గోలాఘట్‌ జిల్లాలో ఎన్‌హెచ్‌ 39ను ఆందోళనకారులు దిగ్బంధించారు. వారిపైనా పోలీసులు కాల్పులు జరిపి వీరంగం సృష్టించారు. పలు జిల్లాల్లో ఉద్యానవన కార్మికులు తమ పనులను నిలిపివేసి నిరసనలు తెలిపారు. మరోపక్క, ఈశాన్యంతోపాటు అసోం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆర్మీ మోహరించింది. గువహతి, దిబ్రుగఢ్‌, టిన్సుకియా, జోర్హట్‌ జిల్లాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. అసోం నుంచి వచ్చి పోయే పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. కర్ఫ్యూ నేపథ్యంలో వందలాది మంది ప్రయాణికులు గువహతి ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఈశాన్య రాష్ట్రాలకు వచ్చిపోయే ఫ్లైట్‌లను రద్దు చేస్తున్నట్టు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా వంటి పలు విమానయాన సంస్థలు తెలిపాయి. తీవ్రమైన ఆందోళనల నేపథ్యంలో అసోంలో ఈనెల 22 వరకు స్కూళ్లు మూతపడనున్నాయి.

పోలీసుల బదిలీ
ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అసోం ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. గువహతి పోలీస్‌ కమిషనర్‌ దీపక్‌ కుమార్‌ను తొలగించి ఆయన స్థానంలో మున్నా ప్రసాద్‌ గుప్తాను నియమించింది. అదనపు డిజిపి (లా అండ్‌ ఆర్డర్‌) ముఖేశ్‌ అగర్వాల్‌ను సిఐడి అదనపు డిజిపిగా బదిలీ చేసి ఆయన స్థానంలో జిపి సింగ్‌ను నియమించారు.

ఇంటర్నెట్‌ సేవలు బంద్‌
బిజెపి పాలిత రాష్ట్రాలు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలివేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోనూ భారీ ప్రదర్శనలు చేపట్టారు. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. రైల్వే ట్రాక్‌లపైకి చేరుకొని టైర్లను దగ్ధం చేశారు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పలు రైళ్లను ఈశాన్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. విమాన సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది. విద్యాసంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. పోలీసుల దాడిని నిరసిస్తూ చాలా ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు యూనివర్సిటీ, కాలేజీ విద్యార్థుల నిరసనల్లో భాగస్వామ్యమయ్యారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమా లను ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని పలు ప్రయివేటు చానెళ్లకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

నేడు బ్లాక్‌ డే
‘ప్రధాని మోడీ, సిఎం సర్భానంద సోనోవాల్‌లు అసోం ప్రజలను మోసం చేశారు’ అని అస్సాం స్టూడెంట్‌ యూనియన్‌ (ఆసు) సలహాదారు సముజ్జల్‌ భట్టాచార్య ఆరోపించారు. బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ ప్రతి ఏడాదీ డిసెంబర్‌ 12ను తాము ‘బ్లాక్‌ డే’గా పాటిస్తామని ఆసు, ఈశాన్య విద్యార్థి సంఘం (ఎన్‌ఈఎస్‌ఓ) తెలిపాయి.

కేరళలో అమలుచేయం : విజయన్‌
పౌరసత్వ సవరణ బిల్లును కేరళలో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం సాయంత్రం ట్వీట్‌ చేశారు.
ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Courtesy Andhrajyothi…