అధిక సాధారణ వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్ర ఈ మారు తీవ్ర వర్షాభావానికి గురై కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. సెప్టెంబర్‌తో ఖరీఫ్‌ కాలం ముగియగా అప్పటికి శ్రీకాకుళం జిల్లాలో 28 శాతం తక్కువ వర్షం కురిసింది. విజయనగరంలో మైనస్‌ 16 శాతం, విశాఖపట్నంలో నార్మల్‌తో బొటాబొటి వర్షం రికార్డయింది. ఈ గణాంకాలు నైరుతి రుతుపవన కాలం నాలుగు మాసాల సగటు. మండలాలు, గ్రామాల దగ్గరకెళితే వర్షాభావం తీవ్రంగా ఉంది. మిగతా రాష్ట్ర్రంతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో కాస్త ముందుగానే ఖరీఫ్‌ పంటలు వేయడం ఆనవాయితీ. అదనుకు వానల్లేక సాగు స్తంభించింది. అడపాదడపా పడ్డ వర్షాలకు పంటలు సాగు చేసినప్పటికీ అనంతరం వర్షాల్లేక ఎండిపోయాయి. రైతులు రెండు మూడు సార్లు విత్తుకొని ఫలితం లేక పెట్టుబడులు నష్టపోయిన దారుణ పరిస్థితులు దాపురించాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 115 మండలాలుండగా 60 నుంచి 70 మండలాల్లో కరువు తాండవిస్తోంది. ఈ అంచనాలు పైపై పరిశీలనతో వేసినవి. క్షేత్ర స్థాయికెళితే కరువు మండలాల సంఖ్య ఇంకా పెరుగుతాయి. పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఇసుమంతైనా స్పందన కనిపించకపోవడం ఆందోళనకరం. మామూలుగా సెప్టెంబర్‌ ముగిసిన వెంటనే కరువు మండలాల ప్రకటన చేయడం కద్దు. అలాంటిది ఖరీఫ్‌ ముగిసి రబీ సీజన్‌లో నెల రోజులు పూర్తయినప్పటికీ ఖరీఫ్‌ కరువు ప్రకటన, సహాయ చర్యలపై సర్కారు కనీస మాత్రం ఆలోచించకపోవడం అన్యాయం.

ఉత్తరాంధ్ర వెనుకబాటు పాలకుల నిర్లక్ష్యం నుంచి సృష్టించబడిందనేది చారిత్రక వాస్తవం. ఈ ప్రాంతంలో ప్రతి ఏడాదీ 800-1,000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అదనుకు అప్పుడప్పుడు వర్షాలు పడకపోవచ్చు తప్ప రాయలసీమ, ప్రకాశం, పల్నాడు మల్లే 400-500 మిల్లీమీటర్ల తక్కువ సాధారణ వర్షపాతం పడే ప్రాంతమైతే కాదు. ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి దశాబ్దాల పర్యంతం పేరపెట్టడం వలన అందుబాటులో నీరున్నా సాగు, తాగు అవసరాలకు ఉపయోగించుకోలేని దుస్థితి. మూడు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాలకు తాగునీరు, విశాఖలో పరిశ్రమలకు నీరు అందించే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టు ముక్కుతూ మూలుగుతోంది. గోదావరి వరద జలాలు 63 టిఎంసిలు వాడుకునే అవకాశం ఉన్నా అతీగతీ లేదు. ఆ ప్రాజెక్టును పోలవరంతో లింకు పెట్టడంతో కేంద్రం ఆడుతున్న డ్రామాలు, వాటిపై మాట్లాడలేని అధికార, ప్రధాన ప్రతిపక్షాల చేతగానితనం వలన ‘సుజల స్రవంతి’ ప్రమాదంలో పడింది. ఒడిశాతో చిన్న చిన్న వివాదాల పరిష్కారానికి ప్రభుత్వాలకు శ్రద్ధ లేని కారణంగా జంఝావతి, వంశధార ఇత్యాది ప్రాజెక్టులు ఏళ్ల తరబడి తెమలకుండా పడి ఉన్నాయి. ఆ బాధ్యతారాహిత్యాలే ఉత్తరాంధ్రను అన్ని విధాలా కుంగదీస్తున్నాయి.

భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సాగుకు ఉపయోగించుకునే చైతన్యం, ఆర్థిక స్తోమత ఉత్తరాంధ్ర రైతాంగంలో తక్కువగా ఉంది. అది కూడా కరువు నష్టాలకు ఒక కారణం. దశాబ్దంన్నరగా ఉమ్మడి రాష్ట్రంలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అమలవుతున్నప్పటికీ ఆ ప్రయోజనాలను మిగతా ప్రాంతాలకు మల్లే ఉత్తరాంధ్ర రైతులు పొందలేకపోతున్నారని సర్కారీ లెక్కలే చెబుతున్నాయి. ఇప్పటికీ ఇక్కడి ఒక్కో జిల్లాలో 35-40 వేల వ్యవసాయ పంపుసెట్లే ఉన్నాయి. తతిమ్మా జిల్లాల్లో లక్ష, రెండు లక్షలు, ఆ పైన పంపు సెట్లు ఉన్నాయి. కాగా ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే పన్నాగంలో భాగంగా మోటార్లకు మీటర్లు బిగించే ప్రయోగం శ్రీకాకుళం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ చర్య భూగర్భ జాలాల వాడకంపై రైతుల్లో అవగాహన కల్పించేకంటే వాటికి దూరం చేస్తుంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు శాశ్వత పరిష్కారం కావాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఆ పని చేయకుండా అభివృద్ధి, వికేంద్రీకరణ అంటే మోసమే. ఖరీఫ్‌ ముగిశాక, వాయుగుండం వలన కురిసిన వానల లెక్క చూపి కరువును మాయం చేసి నిధులు మిగుల్చుకోవాలన్న దురాలోచనను విడనాడి తక్షణం ప్రభుత్వం కరువు ప్రకటన చేయాలి. పంట నష్టపోయిన రైతులకు బీమా, పరిహారం చెల్లించి ఆదుకోవాలి. రబీ పంటలేసుకునేందుకు పెట్టుబడులు, ఉత్పాదకాలు అందజేయాలి.

Courtesy Prajashakti