ఇక్కడ కనపడుతున్నట్లు గిరిజనులు, ఆదివాసీలు దుక్కి దున్నరు. అడవుల్లోని వాలు గల ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి పొదలు, మొక్కల్ని నరికి సేద్యానికి అనువుగా మలుచుకుంటారు. గిరిజనుల ముసుగులో సాగుతున్న అక్రమాలకు ఇదే ఉదాహరణ. ఈ చిత్రం మహబూబాబాద్‌ జిల్లాలోనిది.

 

 • గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అక్రమ సాగు 
 • అడవుల్ని నరికి యథేచ్ఛగాఅక్రమ పోడు 
 • హక్కు పత్రాలతో అటవీ భూముల్లో పాగా 
 • బినామీ పేర్లతో ఆక్రమణ.. వ్యవసాయం 
 • కబ్జాలతో కుచించుకుపోతున్న అడవులు 
 • పాఠ్యపుస్తకాలకే పరిమితం కానున్న ‘కాకులు దూరని కారడివి’ 

అడవి.. తనను నమ్ముకున్నోళ్లకు, అమ్ముకుంటున్నోళ్లకు మధ్య నలిగిపోతోంది. ఆక్రమణలు, దౌర్జన్యాల ఆటవిక చేష్టలకు చిక్కిశల్యమైపోతూ ‘అరణ్య‘రోదన చేస్తోంది. పలుకుబడిగల పెద్దలు, రాజకీయ ముసుగులోని స్థానిక నాయకులు, కబ్జాదారులు వనా లను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఆదివాసీ, గిరిజన తెగలకు అడవిపై జన్మతః ఓ ‘హక్కు’ ఉంటుంది. అలా వారికి సంక్రమించిన హక్కుల్లో ‘పోడు వ్యవసాయం’ ఒకటి. ఇప్పుడా హక్కుకు, అడవికి ముప్పొచ్చింది. వనజీవన విధానాన్ని నాశనం చేస్తూ, అడవిబిడ్డలను తరిమేస్తూ, అడవులను నరికేస్తూ, ఆక్రమించేస్తూ రకరకాల ముసుగుల్లో గిరిజనేతరులు పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ‘పోడు’పేరుతో నడుస్తోన్న పాడు దందా.. చోటుచేసుకుంటున్న ఆటవిక దాడులు, అటవీ ఆక్రమణలు ఎందాకా వెళ్తాయనేది అంతుబట్టని విషయంగా మారింది. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26.9 లక్షల హెక్టార్లు (24 శాతం). ప్రభుత్వం దీన్ని 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని
చేపట్టింది. ఓ పక్క ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే.. మరోపక్క అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత వంటి విధ్వంసకర చర్యలతో పర్యావరణం తీవ్రంగా నష్టపోతోంది. అడవుల ఆక్రమణ, నరికివేత వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 10శాతానికే పరిమితమైందనేది ఒక అంచనా. దేశంలోనే వేగంగా అటవీ విస్తీర్ణం తరిగిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ‘కాకులు దూరని కారడవి’అనేది పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకతప్పదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు, ఆదివాసీల పేరుతో గిరిజనేతరులు సాగిస్తున్న సంప్రదాయేతర పోడు సాగు, అడవుల నరికివేత వంటి పరిణామాలు ‘అడవులకు పట్టిన క్యాన్సర్‌’అని వారంటున్నారు.

పోడు’పేరుతో పాడు ఆక్రమణలు 
గిరిజనులు, ఆదివాసీల పోడు వ్యవసాయం ప్రత్యేకమైనది. అడవుల్లోని వాలు గల ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి పొదలు, మొక్కల్ని నరికి సేద్యానికి అనువుగా మలుచుకుంటారు. ఈ విధానంలో దుక్కు దున్నరు. నాగలికి ఎడ్లను కట్టరు. ఒక చిన్నపాటి పుల్ల (దీనిని ‘కచల్‌’అంటారు)తో భూమిని లోతుకు పెళ్లగించి విత్తనాలు విత్తుతారు. వీరు సాగుచేసే పంటలు కూడా రాగులు, సజ్జలు, జొన్నలు ఇతర చిరుధాన్యాలే. ఈ పంటలకు పూర్తిగా పశువుల పెంటనే ఎరువుగా వినియోగిస్తారు. ఒకేచోట రెండు మూడు పంటల కంటే ఎక్కువ సాగు చేయరు. స్థిర వ్యవసాయం కంటే కూడా చాలా సహజ పద్ధతుల్లో సాగే ఈ పోడు వ్యవసాయం విధానాల వల్ల అడవులకు, పర్యావరణానికి కానీ పూచిక పుల్లంత హాని కూడా జరగదు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో పోడు భూముల విస్తీర్ణం భారీగా ఉంది. ఈ భూములపై కన్నేసిన ఆయా జిల్లాల్లోని స్థానిక నాయకులు ఆదివాసీలను మచ్చిక చేసుకుని, వారిని బినామీలుగా మార్చుకుని పోడు భూముల్ని చెరబట్టారు. గిరిజనుల పేరుతో తామే సాగుచేయడం మొదలుపెట్టారు. అసలైన పోడు వ్యవసాయానికి అర్థం మార్చేస్తూ.. అడ్డొచ్చిన మొక్కల్ని, చెట్లను నరికేస్తూ.. అడవులను మైదానాలుగా మార్చేసి సేద్యం చేయడం మొదలుపెట్టారు. అటవీ అధికారులతో పాటు ప్రభుత్వమూ చూసీ చూడనట్టు వదిలేయడంతో అడవులు ఆగమైపోతున్నాయి. పోడు, ఇతర అటవీ భూముల తదాగాలు చెలరేగినా, ఘర్షణలు తలెత్తినా గిరిజనులను ముందుంచి ‘వివాదాస్పదం’చేయడం మొదలైంది. అందుకు తాజా ఉదాహరణలే మొన్న సిర్సాలా, కొత్తగూడెం ఉదంతాలు.

ఎక్కడికక్కడ అడవులు హాంఫట్‌ 
ప్రస్తుతం పోడుతో పాటు అటవీ భూములు ఎంతెంత ఎక్కడ ఆక్రమణకు గురయ్యాయో కూడా అటవీ శాఖ వద్ద సరైన లెక్కలు లేని దుస్థితి. ఎడాపెడా అడవులను ఆక్రమించేస్తున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన వారున్నారు. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26,90,370 హెక్టార్లు కాగా, ఇందులో 2,94,693 హెక్టార్ల భూమి ఆక్రమణల చెరలో ఉంది. ఇది దాదాపు 11 శాతానికి సమానం. మొదట పోడు పట్టాలున్న ఆదివాసీలు, గిరిజనులను ముగ్గులోకి దించుతున్న ఆక్రమణదారులు.. వారిని ముందుంది అడవుల ఆక్రమణకు తెగబడుతున్నారు. ఆపై నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఆక్రమణలను విస్తరించుకుంటూ పోతున్నారు. ఈ ఆక్రమణల పర్వం ప్రస్తుతం చేయి దాటిపోయిన స్థితికి చేరింది.

అడవిపై హక్కెవరిది
2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) కింద పోడు భూముల పట్టాలిచ్చింది కొందరికే. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ మూడు తరాలుగా (కనీసంగా 75 ఏళ్లు) అక్కడ నివాసం కలిగి ఉంటే.. వారికి సహజంగా అటవీ భూములపై హక్కులు కల్పించాల్సి ఉంది. కానీ, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం తదితర జిల్లాల్లో వందేళ్లకు పైబడి అడవుల్లో ఉంటున్న వారికీ పట్టాలు అందని పరిస్థితి ఉంది. అటవీ హక్కుల చట్టం కింద 2017 చివరి వరకు 11 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 దరఖాస్తులు అందాయి. వీటిలో 6,30,714 ఎకరాలకు 1,83,107 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. సామూహిక (కమ్యూనిటీ) కేటగిరీ కింద 4,70,605 ఎకరాలకు 3,427 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వేల మంది ఇప్పటికీ అటవీ హక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే.. రెండు కేటగిరీల కింద 82,572 దరఖాస్తులను తిరస్కరించగా, తమ వద్ద మాత్రం 9,743 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయని అటవీ, ఐటీడీఏ రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, అటవీ శాఖ.. హక్కు పత్రాలున్న తమ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి చూపిస్తున్న ఉత్సాహం గిరిజనేతరుల ఆక్రమణలపై మాత్రం కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి.

పోడు భూముల్లో కార్పొరేట్‌ సాగు 
భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల, కన్నాయిగూడెం, పాత కన్నాయిగూడెం గ్రామాల్లో వందల ఎకరాల పోడు భూములున్నాయి. ఇవన్నీ స్థానిక నాయకుల గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సమీపంలో గల ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దొరమామిడి, పూచికపాడు, కన్నాపురం ప్రాంతాలకు చెందిన బడా గిరిజనేతర రైతులు ఈ పోడు భూముల్లో కార్పొరేట్‌ స్థాయిలో పంటల సాగు చేస్తున్నారు. అలాగే ఈ జిల్లాకు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో గొత్తికోయలు ఇక్కడకు వలస వచ్చి అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారు. ఒకటి రెండు పంటలు వేసిన అనంతరం ఆ భూముల్ని గిరిజనులు, గిరిజనేతరులకు అమ్మేస్తున్న దాఖలాలు ఉన్నాయి. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 90 వేల ఎకరాల అటవీ భూముల్లో అక్రమంగా పోడు వ్యవసాయం సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇక, మహబూబాబాద్‌ జిల్లాలో 4,096.95 హెక్టార్లలో అక్రమంగా పోడు సాగుతోంది. చాలామంది ఆదివాసీలు, గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో తమ అటవీ భూముల్ని భూస్వాములు, స్థానిక నాయకుల చేతుల్లో పెడుతున్నారు. ఇలా లక్షల ఎకరాలు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్తున్నాయి.

ఎక్కడపడితే అక్కడ ‘పోడు’చేస్తున్నారు 

 •  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో దాదాపు 10వేల ఎకరాల్లో అక్రమంగా పోడు సేద్యం సాగుతోంది. ఈ భూమిలో హక్కు పత్రాలున్నదెంత? లేనిదెంత? అనేది అధికారుల వద్దే లెక్కా పత్రం లేదు.
 •  మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి జనగం పాపారావు, పెద్దల్లాపురం గ్రామానికి చెందిన రామారావు వంద ఎకరాల చొప్పున, ఇదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్‌ రామ్‌చందర్‌ 70 ఎకరాల్లోనూ బినామీ పేర్లపై పోడు సాగు చేస్తున్నారు.
 •  ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 30వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఈ డివిజన్‌లోని సార్సాలలో ఇటీవల అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడిన వారిలో పోచం అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన 40 ఎకరాల వరకు అటవీ భూమిని కబ్జా చేసినట్టు తేలింది. గిరిజనుల పేరుతో ఈయనకు డివిజన్‌ వ్యాప్తంగా వందల ఎకరాలను బినామీ పేర్లతో కబ్జా చేసినట్టు ప్రచారం సాగుతోంది.
 •  ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన ఓ ప్రముఖుడు తనతో పాటు తన బంధువులు, తన కింద పని చేసే వారి పేర్లపై నెమళ్లగుట్ట, జబ్బోనిగూడెం అటవీ ప్రాంతంలోని 50 ఎకరాల్లో జామాయిల్‌ తోటలు పెంచుతున్నారు. ఇందులో ఈయన పేరిట 15 ఎకరాల వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, మిగతా భూమి తన పెట్రోలు బంకులో పనిచేసే సిబ్బంది పేర్లపై ఉన్నట్టు సమాచారం.
 •  ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గోగుపల్లి, పప్కాపురం, చిన్నబోయినపల్లి శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు అడవుల్లోని చెట్లను కొట్టించి, కూలీలతో వ్యవసాయం చేయిస్తున్నారు. చిన్నబోయినపల్లిలోని వందల ఎకరాల భూమి గిరిజనేతరుల చేతుల్లోనే ఉండగా.. ఈ వివాదం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

అడవిలో ఆస్పత్రి 
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆస్పత్రి భవనం. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా గట్లమల్లారానికి చెందిన దుస్సా సమ్మయ్య ప్రైవేట్‌ వైద్యుడు,. అధికార పార్టీ నేతగానూ ప్రచారం చేసుకుంటాడు. తప్పుడు ధ్రువపత్రాలతో మొదట 5సెంట్ల భూమి కొనుగోలు చేసిన ఆయన మరో పది సెంట్ల వరకు పక్కనే ఉన్న అటవీ భూమిని ఆక్రమించి రెండంతస్తుల వైద్యశాలను నిర్మించారు. అనుమతుల ప్రక్రియ నిమిత్తం అటవీ అధికారి రూ.3 లక్షలు తీసుకున్న ఇక్కడ బహిరంగంగా చెప్పుకుంటారు. ప్రధాన రహదారి పక్కనే.. 70% అటవీ భూమిలో, 30% ప్రభుత్వ భూమిలో కనిపించే భవనం.. అటవీ భూముల ఆక్రమణకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ‘170 యాక్ట్‌’అమల్లో ఉంది. అంటే, ఇక్కడ పట్టా భూమిలో వెంచర్‌ వేయడానికి కూడా వీల్లేదు. కానీ, రెండంతస్తుల భవనం కళ్లెదుటే కనిపిస్తున్నా.. పట్టించుకునే అటవీ, రెవెన్యూ అధికారులే లేరు.

సర్కారు ఉద్యోగి ‘పాడు’దందా 
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోడు పేరుతో అక్రమంగా సాగు చేస్తున్న భూమి. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడెం మండలానికి చెందిన హాస్టల్‌ వార్డెన్‌ గుస్సా స్వామి.. మండలంలోని వివిధ ప్రాంతాల్లో 55 ఎకరాల్లో అక్రమంగా పోడుసాగు చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కానీ తీగలాగితే.. ఇది 300 ఎకరాలుగా తేలింది. ఈయన భార్య సర్పంచ్‌ కూడా. మొత్తానికి ఈయన పోడు దందాపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన దరిమిలా సస్పెండ్‌ అయ్యారు. తిరిగి విధుల్లో కూడా చేరిపోయాడు. ఈ జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఖాసీం 18 ఎకరాల్లో అక్రమంగా పోడు సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందిన మరుక్షణమే ఈయన కాంగ్రెస్‌ నుంచి అధికార పార్టీలోకి దూకేశారు. కేసు కాకుండా తప్పించుకున్నారు కానీ, పోడు భూమిని మాత్రం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
(ఫొటో20: కొత్తగూడెం మండలంలో గుస్సా స్వామి ఆధీనంలో అక్రమంగా సాగవుతున్న భూమి)

గిరిజనేతరులే కొట్టిస్తున్నారు 
అటవీహక్కుల చట్టం కింద అక్రమంగా పట్టాలు పొందాలనే దురుద్దేశంతో గిరిజనేతరులు.. గొత్తికోయలతో అడవుల్ని కొట్టిస్తున్నారు. చెల్పాక అటవీ ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వందెకరాలకు పైగా అడవిని కొట్టించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అర్హులైన గిరిజనులకు న్యాయం చేయాలి.
తోలెం కిష్టయ్య, ముల్లకట్ట, ఏటూరు నాగారం 

(సాక్షి సౌజన్యంతో)