భారత దేశంలో సంచార, అర్ధ సంచార, విముక్తజాతుల సమస్య పూర్వాపరాలు

ఈ జాతుల సమస్య చాలా సంక్లిష్టమైనది, వేల సంవత్సరాలుగా పడిన అనేక చిక్కుముడులను విప్పకుండా ‘బైరాగి చిట్కాలతో’ పరిష్కరించబడదు. సమస్య మూలాలు, ఋగ్వేద కాలానికి ముందు నుంచి, అశ్వమేధ యాగం పేరుతొ చేసిన ‘దాసుల’ ‘దస్యుల’ జీవనాధారం అయిన భూమి పైన, భూ గర్భంలో ఉన్న సహజవనరుల దురాక్రమణలో ఉన్నాయి. ఈ దేశ మూలనివాసుల ప్రక్రుతి వనరులతో ముడిపడిన ఆత్యాద్మికతను ధ్వంసం చేసి, వైదిక హిందూ మతాన్ని వాళ్ల నెత్తిన రుద్ది, తర తరాలుగా హీన మనస్తత్వాన్ని పెంచి పోషించి, బానిసలుగా వాడుకున్న ఆర్యులదుర్మార్గంలో, వారి సైన్యాధ్యక్షులుగా పని చేసి వందల, వేల, ఎకరాల మూలనివాసుల

Indian Denotified and Nomadic Tirbes
Indian Denotified and Nomadic Tirbes

భూముల్ని జీతంగా పొందిన కమ్మ, రెడ్డి, వెలమ, కాపు భూస్వాముల అహంకారంలో ఉన్నాయి.  వైదిక మత ప్రచారకులైన బ్రాహ్మణులను హత్య చేసిన కాపాలికులు, కాలముఖుల వారసులు, ఆదిమ శైవ, శక్తి, నాధ సంప్రదాయ అవలంబీకులైన, సంచార జాతులను వైష్ణవ మత ప్రచారకులుగా, మాల, మాదిగ, సూద్ర దాసరులుగా మలిచిన రామానుజాచార్యుడి ‘క్రిమినల్’ మేధలో ఉన్నాయి. తూర్పు పశ్చిమకనుమల్లో ఉన్న ఆదివాసుల పూజాస్థలాలను బందిపోటుదొంగల్లా భాగాలేసుకుని శైవ, వైష్ణవ బ్రాహ్మణులు పంచుకుంటుండగా, వీర శైవులుగా, వైష్ణవ దాసరులుగా చీలి పరస్పరం దాడులతో, హత్యలదాకా కొనసాగిన సంచారజాతుల అమాయకత్వంలో ఉన్నాయి.

ఆర్యులు వాళ్ళ తర్వాత వచ్చిన పాలకులందరు వాళ్లతో బాటు తెచ్చిన మతాలను నయానో భయానో ఈ దేశ మూల నివాసులపైన రుద్దడమే కాదు, యుద్ధం పేరుతో తరతరాలుగా నివసిస్తున్న వారి జనావాసాలను ధ్వంసం చేసి, కొంతమందిని దుర్గమారణ్యాల్లోకి తరిమి, మరికొంతమందిని   శాశ్వత నిర్వాసితులుగా మార్చి, స్థిర నివాసంలేని సంచారజాతులుగా మిగిల్చారు. మనువు నిర్దేశించిన అనులోమ,విలోమ సెక్స్ సంభందాలనుంచి పుట్టిన వారిని చండాలురుగా మార్చి, స్మశానంలో శవాలు కాల్చే వారిగా, వీధులూడ్చే పాకీ పనివారిగా మార్చి, దళిత-సంచార జాతులుగా ఉంచారు. దిక్కులేనివారిగా, దేశ దిమ్మరులుగా తిరుగుతున్న సంచారజాతులు రాజుల కాల్బలాల్లోకి చేరి యుద్ధాల్లో చావకుండా బతికిన వాళ్ళు, రాజ్యాలు కూలిపోవడంతో మరికొందరు సైనికులను కలుపుకొని సంచారజాతుల్లో కలిసిపోయారు. హిందూ, క్రైస్తవ,ముస్లిం మతాలు ఆదివాసులను కబళించగా, బ్రతుకు తెరువుకోసం ఆదివాసీ పూజారులు, కథలు చెప్పేవారిగా, వినోదం పంచె వారుగా, గాయకులుగా సంచార జాతుల గుంపుల్లోనే చేరిపోయారు. కొంతమంది సంచార జాతుల వారు, గ్రామ దేవతల పూజారులుగా మనుగడ సాగించే వారు. ఎండోమెంట్ చట్టాల కింద, పైసలొచ్చే గ్రామ దేవతల దేవాలయాలను బ్రాహ్మణ పూజారులు ఆక్రమించారు. పైసలు సంపాదించించిన దళిత, ఆదివాసీ, సంచార జాతులు బ్రాహ్మణ పూజారులచేత శుభ, అశుభ కార్యాలు నిర్వహిస్తుండగా, క్రైస్తవ,ముస్లిం మతం లోకి మారిన వారికి ఫాదరీలు, ముల్లాలు- పెళ్లిళ్లు, చావులు క్రతువులు నిర్వహించడం వల్ల కూడా, దళిత, ఆదివాసీ, సంచార జాతుల పూజారులు వీధుల్లో పడి బిచ్చగాళ్లుగా మారారు.

రక, రకాల అటవీ, వన్య మృగ చట్టాలతో అడవులను, భూమిని, నీటిని ఆదివాసులకు దూరం చేసి, వాళ్ళ అడవుల్లోనే వాళ్ళను పరాయివారిగా చేసి దిక్కులేని వారిగా అటవీ సంచార జాతులుగా చేసారు.

గణ రాజ్యాల దురాక్రమణ కు ఎదురు తిరిగిన వారందర్ని క్షత్రియ, బ్రాహ్మణ పాలకులు దొంగలుగా ముద్రవేసిన వారసత్వాన్ని కొనసాగిస్తూ, జల్, జంగల్, జమీన్ పైన హక్కుల కోసం కొట్లాడిన ఆదివాసులను, వారితో కలిసిన సంచారజాతులను క్రిమినల్ ట్రైబ్స్ గా మార్చి, దాదాపు వంద సంవత్సరాలు వాళ్ళ ఉసురుపోసుకున్న స్వదేశీ, విదేశీ పాలకులు, వాళ్లతో కుమ్మక్కైన పరిపాలన యంత్రాంగం లోని అగ్ర వర్ణాలు, భూస్వాములు. అప్పటినుంచి ఇప్పటి దాకా దొంగ కేసులు బనాయించి చిత్రహింసల పాల్జేస్తున్న పోలీసులు. సంచార విముక్త జాతుల బతుకులు తగలబడి పోతుంటే, స్థిరపడిన సమాజం నిర్లిప్తంగా చూస్తుండిపోయింది. కొంతమంది ఆ మంటలతో చలికాచుకొనగా, గుప్పెడుమంది కమ్యూనిస్టులు, సర్వోదయ వారు, కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్న వి. రాఘవయ్య గారిలాంటి అభ్యుదయ వాదులైన బ్రాహ్మణులు వారి విముక్తికొరకు పనిచేశారు.

పశువులు సంచరించే మార్గాలను, పచ్చిక బయళ్లను, పసుపాలక సంచారజాతులు స్వేచ్ఛగా తిరుగాడిన భూములు కబ్జాచేసి, చివరకు పశుపోషక సంచారులను అటవీ వాసులుగా గాని, లేదా గిరిజనులుగా గాని గుర్తించని ఈ ప్రభుత్వం, చట్టాలు.

సకల పీడిత ప్రజల ఆశాజ్యోతిగా నివాళులందుకుంటున్న ఒక మహాత్ముడు 1932 లోనే అప్పటివరకు డిప్రెస్డ్ క్లాస్స్ జాబితాలో ఉన్న క్రిమినల్ ట్రైబ్స్ ను నిర్దాక్షిన్యంగా బయటకు నెట్టి, ఆ జాబితాను ‘అంటరానివారికే’ పరిమితం చేసాడు. పూనా ఒడంబడికలో భాగంగా  డిప్రెస్డ్ క్లాస్స్ లో ఉన్న వారికే విద్య, ఉద్యోగ, రాజకీయ రిజెర్వేషన్లు అన్నాడు. అందరు కలిసి రాజ్యాంగంలో ఎక్కడా సంచార విముక్త జాతుల ప్రస్తావనే లేకుండా డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్న వాళ్లతో కుమ్మక్కై రాజ్యాంగం రాసుకున్నారు. కాకా కాలేకర్ చేతులెత్తేస్తే, రాష్ట్రాల్లో తయారైన బీసీ జాబితాల్లోకి సంచార విముక్త జాతుల ను నెట్టి చేతులు దులుపుకున్నారు. 102 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినా ఇప్పటికి ఈ దేశ పౌరులుగా సంచార విముక్త జాతులు గుర్తింపుకు నోచుకోకపోవడం ఈ జాతుల పాలిటి విషాదం.

సంచార విముక్త జాతుల స్థితిగతులు

ఈ దేశంలో బిసి, యస్సి, ఎస్టీ, మైనారిటీల్లో సంచార, విముక్త జాతులున్నాయి. ఒక జాతి,ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు క్యాటగరీల్లో ఉంది. సమస్యలు రూపంలో వేర్వేరుగా కన్పిస్తున్నా సారంలో ఒక్కటే. ప్రధాన సమస్య ఐడెంటిటీ లేకపోవడం. దేశం లో ఉన్న ఇరవై కోట్ల మంది సంచార జాతులు ఒక వేదిక మీదికి రావడం అసాధ్యం కాకపోవచ్చు గాని, అంత సులభమైన వ్యవహారం కాబోదు. వివిధ క్యాటగిరీల్లోకి వారి ప్రమేయం గాని, ఇష్టాఅయిష్టాలతో నిమిత్తం గాని లేకుండా నెట్టబడటం వల్ల, ఇదాతే కమిషన్ మధ్యంతర నివేదికలో చెప్పినట్టు ” చాల రాష్ట్రాల్లో ప్రజలకు యన్టీ, డియన్టీ అంటే ఏమిటో ఇంకా తెలియదు” తాము ప్రస్తుతం ఉన్న క్యాటగేరిలోని ఆధిపత్య కులాలు, (తమ) తలల లెక్కలు చూపించి ప్రభుత్వాలను డిమాండ్ చేసి లబ్ది పొందుతున్నాయని మెజారిటీకి తెలియదు. తెలిసిన అతి కొద్దిమందికి ప్రశ్నించే దమ్ము లేదు.

 

Indian Denotified and Nomadic Tirbes
Indian Denotified and Nomadic Tirbes

ఈ యన్టీ, డియన్టీ ప్రజలకు ఉమ్మడిగా వర్తించే ఒక ఐడెంటిటీ లేదా బ్రాండ్ నేమ్ లేకుండా పోవడం వల్ల వీళ్ళను కూడగట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. ఒకే ప్రాంతంలో తరతరాలుగా సంచరిస్తున్నా, ఒకే రకమైన జీవన విధానాన్ని అవలంబిస్తున్నా, సమాజం నుంచి ఒకే విధమైన వివక్షతను, అవమానాల్ని ఎదుర్కొంటున్నా, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, “మన అందరి సమస్య ఒకటే, మనం అందరం ఒకటే” అనే చైతన్యం లేకపోవడానికి కారణం ఐడెంటిటీ లేకపోవడమే. పలానా మనిషి, పలానా సంచార ‘గుంపు’ కు చెందిన వాడు, ఫలానా ప్రదేశంలో ఆ గుంపు ఉంటుంది అని తెలుసు, అంతే తప్ప, అంతకు మించి ఒక గుంపు జీవితంలో, కష్ట సుఖాల్లో ఇంకో గుంపు జోక్యం చేసుకోలేదు.  ఇదే పరిస్థితి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తర తరాలుగా జీర్ణించుకుపోయిన ఈ ‘ఘెట్టో’ మనస్తత్వం వల్ల యస్సి లో ఉన్న సంచారజాతి వాడు ఎస్టీ  వాడ్ని పట్టించుకోడు. బి సి లోని రెండు సంచార జాతులకు ఒకరి గురించి ఇంకొకరికి తెలియదు. మైనారిటీలను ఇతరులు పట్టించుకోరు, అదే విధంగా మైనారిటీల్లోని (ముస్లిం, సిఖ్) రెండు జాతులకు ఒకరిగురించి ఇంకొకరికి పట్టదు. అంతే కాదు, ఒకరిపట్ల, ఇంకొకరికి అనేక భయాలు, అభద్రతా భావనలు, ముందుగా ఊహించుకున్న కొన్ని దురభిప్రాయాలు ఉండటమే కాదు, ఎవరికీ వారు తమదే గొప్ప వంశమని, మిగిలిన సంచార విముక్త జాతుల వారంతా తమకన్నా తక్కువ అని బలంగా నమ్ముతారు. ఫలితంగా, ఒక సంఘం లోని ఇంకో జాతివాడు పిలిస్తే, తమ జాతి నుంచి ఎవరు పోరు, వేరే వాళ్ళను పోనివ్వరు. ఒక సామాజిక వేత్త (మాల్కం ఎక్స్  అనుకుంట) చెప్పినట్లు ” ప్రజలలో  ఒకరి పట్ల ఇంకొకరికి ఉన్న, అనుమానం, అపనమ్మకం, భయం అన్ని -ఇరువర్గాలు ముఖాముఖీ కలవడంతో, కలిసి మాట్లాడుకోవడంతో సమసి పోతాయి” కానీ ఆ ప్రక్రియ ఈ జనసమూహాల్లోని వివిధ జాతుల్లో  చొరవ తీసుకొనే, సామర్ధ్యం లేనందువల్ల, ఆత్మవిశ్వాసం లోపించడంవల్ల ఇంకా మొదలవ్వలేదు.

ప్రస్తుత సంచార విముక్త జాతులు ఉద్యమం తీరు తెన్నులు

ఏ జాతి వాళ్ళు ఆ జాతికి ఒక సంఘం పెట్టి ( ఉద్యమం పెరిగిన తరువాత వీధికి నాలుగు సంఘాలు పెడుతున్నారు) ఒక వినతి పత్రం తయారు చేసి, ఎవడో ఒక అనామత్తు ప్రజా ప్రతినిధి తోకపట్టుకొని సి ఎం కు అందించాలనుకొనే వాళ్ళు కొందరు. మిగిలిన జాతులతో సంభందం లేకుండా, తమ  జాతికి చెందిన ఎం ల్ ఏ చేత పైరవీ చేయించి తాము మాత్రమే  ఎస్టీ జాబితా అనే భూతల స్వర్గంలోకి దొడ్డి దారిన  అడుగు పెట్టి, అక్కడే శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చోవాలనుకునే వాళ్ళు ఇంకొందరు. మీటింగ్ పైన మీటింగ్  (కొంతమంది సమ్వత్సరానికి ఒకటో రెండో) పెడుతూ,

వీలైతే స్థానిక న్యూస్ పేపర్లో ఒక పక్క వేసిన అంగుళం సైజు వార్త లో  పేరుచూస్కొని, లేదా పేస్బుక్ లో ఫోటో ఉంచుకొని మురిసిపొయ్యేవారు కొందరు. ఈ ఛోటా, మోటా నాయకులు సమాజంలో కొంచం స్థిమితంగా బతుకుతూ తెల్ల చొక్కాలు వేసుకుని తిరగ్గలిగిన, దిగువ మధ్యతరగతి జీవులు. అసలైన సంచార విముక్తజాతుల ప్రజలకు, వీళ్ళు ఉన్నారని కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు అట్టడుగు ప్రజల సమస్యలు పట్టించుకోరు, డిమాండ్లు మధ్యతరగతి నుంచి కిందకు దిగవు. ప్రజలు జీవనానికి, జీవనోపాధికి సంభందించిన సమస్యలెదుర్కుంటున్నా, అణిచివేతకు, అన్యాయానికి గురౌతున్నా, హక్కులు కోల్పోతున్నా ఎక్కడ కనిపించరు, వినిపించరు. కాకపొతే ప్రెస్ లో డిమాండ్లు పెడుతూ కాలం గడుపుతుంటారు. ఇంకొంత మంది నాయకులు, పైసాలున్న వాళ్ళు, పదవిలో ఉన్న వాళ్ళు, అధికారానికి దగ్గరగా ఉన్నవాళ్లు మాత్రమే నాయకులని, కనీసం ఒక కారు,మెడలో ఒక బంగారు పలుపు ఉంటే తప్ప నాయకుడు కాదని బలంగా నమ్ముతూ, బస్సుల్లో తిరిగే నాయకులను పురుగులకన్నా హీనంగా చూస్తారు.

సంచార,విముక్త జాతుల్లోని అతి తక్కువ మంది, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన ధనవంతులు తన జాతి తలల లెక్కలు చూపించి, వాళ్లందరికీ తానె నాయకుడినని చెప్పి, తన దగ్గరున్న పైసల దన్నుతో ఎం ల్ ఏ, ఎం ల్ సి కొట్టేద్దామనుకొనే అతితెలివిపరులు. వీళ్ళలో కొందరు ప్రభుత్వం నుంచి వచ్చే లైసెన్సులు, కాంట్రాక్టులు, లోన్ల కోసం సంఘాలు పెడుతున్నారు.

స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి సమాజం లోని అట్టడుగు వర్గాలందరికి తామే ప్రతినిధులమని చెప్పుకున్న  అగ్రకులాల్లోని ‘ప్రగతిశీలక శక్తులు’ ఎక్కువగా గాంధేయ వాదులు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలనుంచి కొన్ని రాయితీలు పొందటానికి, తమకున్న వ్యక్తిగత ‘సంభందాలు’ ఉపయోగించి, వారికి కొన్ని ఎంగిలి మెతుకులు సంపాదించి పెట్టారు. బడులు, హాస్టళ్లు, ఉపాధికేంద్రాలు, బాలసదనాలు, సంస్కరణ కేంద్రాల పేరుతొ, వందల ఎకరాల భూములు, కోట్ల రూపాయల నిధులు పొందారు. ఇప్పటికి, ఆదివాసులు, సంచార   జాతుల కొరకు స్థాపించించిన వ్యవస్థలు బ్రాహ్మణుల, అగ్రకులాల యజమాన్యంచేతుల్లోనే  ఉన్నాయి.  వాళ్ళ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సంచార జాతులతో ఏ సంభందం లేని అగ్ర కులాల వారు, డీ యన్ టీ ల ‘ఉద్ధరణ’ కోసం సంస్థలు నిర్వహిస్తున్నారు, పాలక వర్గాలతో, కార్పొరేటు కంపెనీలతో, విదేశీ సంస్థలతో అంటకాగుతూ, ఆయా జాతుల జీవితాలను గురించి దయనీయమైన గాధలు విన్పిస్తారు. రేషన్ కార్డులు, గుర్తింపుకార్డులు ఇప్పించటమే సంచార జాతుల జీవితాలను మార్చేస్తుందని చెప్తారు. మౌలిక సమస్యలు, పరిష్కారాల గురించి మాట్లాడరు,ఉద్యమాల్లోకి రారు. సంచారజాతుల గురించి ఆర్తితో రాసిన ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి హేన్రి ష్వార్జ్ కి ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూ లో  ” నేను సంచార, విముక్తజాతులను ఉద్యమాల్లోకి కూడగట్టను, వాళ్ళంతట వాళ్ళు ఉద్యమాలు నిర్మించుకొంటే అడ్డపడను” అంటారు

ఇప్పటి వరకు శాస్త్రీయ సంచార జాతుల ‘ఉద్యమం’ ఈ దేశం లో ఇంకా మొదలవ్వలేదు. ఈ రోజు సంచార జాతుల నాయకులుగా, ఉద్ధారకులుగా తమను తాము ప్రకటించుకున్న వారిలో మెజారిటీ, ఏ విధమైన ఉద్యమ నేపథ్యం లేని వారు. వీరిలో ఎక్కువ మంది తమ చుట్టూ ఉన్న అగ్రకులాల రాజకీయాలను అనుకరిస్తుండగా, వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగిన మరికొంతమంది అంబెడ్కర్, ఫూలే, మార్క్స్ ను కలగలిపి ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు, ఇంకొంతమంది బీ సి నాయకులుగా లేదా రాష్ట్ర స్థాయిలో మేధావులుగా గుర్తింపు పొందాలనుకుంటున్నారు తప్ప సంచార, విముక్త జాతులలో ఒక జాతికి చెందిన వ్యక్తిగా, లేదా నాయకుడిగా బహిరంగంగా గుర్తింపబడటానికి వెనుకాడుతున్నారు.

ఏ జాతి ప్రజల బ్రతుకులు బాగుపడాలన్నా ఉద్యమం ఒక్కటే మార్గం. సంచార జాతులు ఇందుకు అతీతం కాదు. ఎందుకంటే, ‘మా డిమాండ్లు నెరవేరిస్తే తప్ప- రాబోయే ఎన్నికల్లో నీ పార్టీకి మా జాతులనుంచి ఒక్క ఓటుకూడా పడదు’ అని ఒక వ్యక్తి కాదు, ఒక జాతి కాదు, ఒక సంఘం కాదు- లక్షలాది మంది ముక్త కంఠం తో చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే అధికారంలో ఉన్నవాడు, మన పట్ల వాడికున్న చులకన భావం వదిలించుకునే దిశగా ఒక్కడుగు వేస్తాడు. మనతో చర్చలు జరుపుతాడు, శాశ్వత పరిష్కారాల వైపు మొగ్గు చూపుతాడు. లేని పక్షంలో, ఇంకొక వంద కమిషన్లు వేసినా ఒక్క సిఫారసు కూడా అమలుకాదు.

Indian Denotified and Nomadic Tirbes
Indian Denotified and Nomadic Tirbes

ఒకే లక్ష్యం వైపు, తమ బ్రతుకులు బాగు పడతాయనే నమ్మకంతో లక్షలమందిని ఏక తాటిపైన నడిపించేది ఉద్యమమే. ఏ ఉద్యమానికైనా ఒక సిద్ధాంతం కావాలి. సిద్ధాంతం, చరిత్ర మూలాలను శోధించి, ఈనాటి దయనీయమైన స్థితికి మూల కారణాలను వెతికి పట్టుకొని, పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకొని, ఈ పరిస్థితికి కారకులైన శక్తుల ఫై యుద్ధం ప్రకటించాలి.

నిరంతరం అట్టడుగు ప్రజలను కలవడం వల్ల వారితో పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళ సమస్యలు అర్ధమౌతాయి, చురుకైన నాయకులు పరిచయమౌతారు. దైనందిన సమస్యలను, ఉమ్మడి కార్యాచరణ ద్వారా పరిష్కారించుకోవడంతో ఉద్యమ పయనం మొదలవుతుంది. సమస్యలకు మూలకారణాలను జల్లెడ పడితే, దీర్ఘ కాలిక, శాశ్వత పరిష్కారాలు అర్ధమౌతాయి. ఈ ప్రక్రియలోనుంచి ‘రాజకీయ’ డిమాండ్లు పుడతాయి. ఈ డిమాండ్ల సాధనకోసం ప్రజలు సమాయత్తమౌతారు.

ఇంత పని ఏ ఒక్క వ్యక్తి, సంఘం లేదా సంస్థ వల్ల సాధ్యం కాదు. ఏ జాతికి ఆ జాతి తనను తాను సంఘటితం చేసుకోవాలి. మిగిలిన సంచార జాతులతో ఫ్రంట్ కట్టాలి. అదే విధంగా కలిసొచ్చే, ఇతర పీడిత ప్రజల సంఘాలతో అలయన్స్ పెట్టుకుని పనిచేయాలి.

గ్రామస్థాయి నాయకత్వాన్ని గుర్తించి, ప్రోత్సహించి శిక్షణ ఇవ్వాలి. వివిధ స్థాయిల్లో కార్యాచరణ కమిటీలు వెయ్యాలి. రాష్ట్ర, జాతీయ నాయకులుగా భుజ కీర్తులు తగిలించుకుని ఊరేగుతున్న వాళ్ళు ఒక సంవత్సరంపాటు గ్రామాలు తిరిగి ఈ పని చేస్తే, ఆ తర్వాత ఒక ఫోన్ తో కొన్ని గంటల వ్యవధిలో లక్షల మంది వీధుల్లోకి వస్తారు. ఏ ఉద్యమంలోకయినా మొదట్లో నూటికి ఇరవై శాతం మంది మాత్రమే వస్తారని గుర్తుంచుకోవాలి. వారి సమయం లేదా విరాళం రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే తప్ప ఉద్యమం ముందుకు పోదు అనే విషయం వారికి స్పష్టన్గా చెప్పాలి. ప్రజల మధ్య పనిచేసివాడే నాయకుడు, మిగిలిన వాళ్ళు మద్దతుదారులు, సిద్ధాంత కర్తలు, వ్యూహ నిపుణులు- ఉద్యమానికి అందరి అవసరం ఉంటుంది.

_____________________________________________________________________

మల్లి సుబ్బారావు, కన్వీనర్,సంచార విముక్త జాతుల ఉద్యమాల జాతీయ వేదిక. ncnthr@gmail.com, 8985415543.