లక్నో : సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”చనిపోవాలన్న ఉద్దేశంతో ఎవరైనా వస్తే.. ఆ వ్యక్తి ఎలా బతికుంటారు? అగర్‌ కోయీ మర్‌ నే కే లియే ఆహీ రహా హైతో ఓ జిందా కహాసే హౌ జాయెగా)” అని పౌర నిరసనకా రులను ఉద్దేశిస్తూ అన్నారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏకు నిరసనగా గత డిసెంబరులో జరిగిన అల్లర్లలో సుమారు 20 మంది మతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అల్లర్లలో పోలీసుల తూటాలకు ఎవరూ మరణించలేదన్నారు. ఒకరిని షూట్‌ చేయాలనే ఉద్దేశంతో మరొకరు వీధిలోకి వస్తే.. అతడైనా చావాలి.. లేదా ఆ పోలీసైనా మరణించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏకు వ్యతిరేకంగా దాదాపు రెండునెలలుగా యూపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో, కాన్పూర్‌, ప్రయాగ్‌ రాజ్‌ ప్రాంతాల్లో నిరసనలు ఇప్పటికీ సాగుతున్నాయి. ‘స్వేఛ్చ కోసం వీరంతా నినాదాలు చేస్తున్నారు.. కానీ స్వేఛ్చ అంటే ఏమిటి?

మహమ్మద్‌ అలీ జిన్నా కోసం మనం పని చేస్తున్నామా లేక గాంధీజీ ఆశయ సాధనకోసమా?’ అని యోగి ప్రశ్నించారు. డిసెంబరులో జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్ల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనా జరగలేదనీ, ఇందుకు పోలీసులను అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. ఆందోళనకారులను నేనేమీ అనడం లేదనీ, అయితే హింసను ప్రేరేపించేవారినే టార్గెట్‌ చేస్తున్నానని ఆదిత్యనాథ్‌ అన్నారు. ఇలా ఉండగా.. సీఏఏను వ్యతిరేకిస్తూ బిజ్నూర్‌ జిల్లాలో జరిగిన అల్లరలో తమ కాల్పుల్లో ఒకరు మరణించారని ఆ మధ్య పోలీసులు అంగీకరించిన విషయం గమనార్హం.

Courtesy Nava Telangana