• 2018,19 సంవత్సరాలకు సాహిత్య పురస్కారాల ప్రకటన
  • పురస్కారం దక్కిన 15వ మహిళ వోల్గా
  • అవార్డునే రద్దు చేయాలన్న పీటర్‌కు బహుమానం

స్టాక్‌హోమ్‌ : రంగురంగుల ప్రపంచం… రంగులు మార్చే మనుషులు… రకరకాల బంధాలను అలతి అలతి పదాలతో కవితాత్మకంగా వివరించే పోలండ్‌ నవలా రచయిత్రి…. వోల్గా టొకార్షుక్‌! అక్షరాలతో తన అన్వేషణ కొనసాగిస్తూ… సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ.. వాటిని పాఠకులు, ప్రేక్షకుల ముందు నిలిపే ఆస్ట్రియా నవలా-నాటక రచయిత పీటర్‌ హాన్‌డ్కే! ఈ ఇద్దరు రచయితలు నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది లైంగిక వేధింపుల వివాదం నేపథ్యంలో వాయిదా వేసిన అవార్డుతోపాటు… ఈ ఏడాది సాహితీ నోబెల్‌ పురస్కారాల విజేతలను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ గురువారం ప్రకటించింది. 2018 సంవత్సరానికి వోల్గా టొకార్షుక్‌, 2019 విజేతగా పీటర్‌ను ఎంపిక చేసింది.

సాహిత్యంలో నోబెల్‌ అందుకుంటున్న 15వ మహిళ వోల్గా. 57 సంవత్సరాల ఆ రచయిత్రి పూర్తి శాకాహారి. మనస్తత్వ శాస్త్రాన్ని అభ్యసించిన ఆమె… కొన్నాళ్లు థెరపిస్టుగా కూడా పనిచేశారు. రాజకీయ కార్యకర్త, విశ్లేషకురాలిగా ప్రభుత్వంపై సూటి విమర్శలు గుప్పించడం ఆమె ప్రత్యేకత. పోలండ్‌లో స్వేచ్ఛ, సహనం భ్రమలా మారిపోయాయని 2015లో వ్యాఖ్యానించారు. దీంతో ‘చంపేస్తాం’ అంటూ ఆమెకు బెదిరింపులు వచ్చాయి. ఆమె రచనలు నాటకాలుగా, సినిమాలుగా మారి ప్రేక్షకులను కూడా అలరించాయి. డజనుకుపైగా పుస్తకాలు రచించిన ఆమె… మన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌, నైకీ లిటరరీ అవార్డు (పోలండ్‌) కూడా అందుకున్నారు.

ఇష్టం లేదన్న రచయితకే..

నోబెల్‌ సాహిత్య బహుమతిని రద్దు చేయాలి’… ఇది ఐదేళ్ల క్రితం పీటర్‌ హాన్‌డ్కే చేసిన డిమాండ్‌. ఇప్పుడు ఆయనకే నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. ‘‘నోబెల్‌తో ఆ రచయితకు వచ్చేదేమిటి? ఒక్కసారిగా అందరి దృష్టి పడుతుంది. ఆ రచయిత ఒక మహానుభావుడనే భ్రాంతిని సృష్టిస్తుంది’’ అని పీటర్‌ 2014లో వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయం లో… 1942 డిసెంబరు 6న పీటర్‌ హాన్‌డ్కే జన్కించారు. తండ్రి జర్మన్‌ సైనికుడుకాగా… తల్లి ఆస్ట్రియా సంతతికి చెందిన స్లొవేనియన్‌. హాన్‌డ్కే ఆస్ట్రియాలోనే పెరిగారు. ప్రస్తుతం జర్మన్‌ మూలాలున్న అతికొద్ది రచయితల్లో హాన్‌డ్కే ఒకరు. ది గోల్‌ కీపర్స్‌ ఫియర్‌ ఆఫ్‌ పెనాల్టీ, వింగ్స్‌ ఆఫ్‌ డిజైర్‌, ఎ జర్నీ టు ది రివర్స్‌: జస్టిస్‌ ఫర్‌ సెర్బియా వంటి రచనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చి పెట్టాయి. బెల్‌గ్రేడ్‌పై నాటో దాడులను నిరసిస్తూ… తనకు దక్కిన ‘బుష్నర్‌ ప్రైజ్‌’ను 1999లో ఆయన తిరిగి ఇచ్చేశారు.

Courtesy Andhra Jyothy