– చిక్కుకుపోయిన మెజారిటీ వలసకార్మికుల పరిస్థితి
– ఇప్పటికీ.. సొంతూర్లకు చేరుకోనివారు 67శాతం మంది..!
– స్వాన్‌ నివేదిక

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ ఒకవైపు.. కేంద్రం ప్రణాళిక లేని దశలవారీ లాక్‌డౌన్‌లు మరొకవైపు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి దాదాపు రెండు నెలలు గడిచాయి. వలసకార్మికుల తరలింపునకు తాము పటిష్ట చుర్యలు చేపడుతున్నామనీ, వారికి ఆర్థిక సాయంతో పాటు రేషన్‌ సరుకులను అందిస్తున్నామని కేంద్రం అంటోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఇవేవీ కానరావడం లేదు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేక, రేషన్‌ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘స్ట్రేండెడ్‌ వర్కర్స్‌ యాక్షన్‌ నెట్వర్క్‌(స్వాన్‌)’ ఇటీవల విడుదల చేసిన తన మూడో నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఇప్పటికీ 67శాతం మంది వలసకార్మికులు తాము ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. 33శాతం మంది మాత్రమే తామున్న స్థలాలను విడిచి వెళ్లగలిగారు. చిక్కుకుపోయిన వలసకార్మికులలో 55శాతం మంది తాము తక్షణమే సొంత ఇండ్లకు వెళ్లాలనుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలసకార్మికుల్లో 75శాతం మందికి ప్రస్తుతం ఎలాంటి ఉపాధి కూడా లేదు. ప్రతి లాక్‌డౌన్‌ దశలోనూ వలసకార్మికులు ఎదుర్కొన్న అనేక కష్టాలను స్వాన్‌ తన నివేదికలో వివరించింది. లాక్‌డౌన్‌ మొదటి రెండు దశలలో నిత్యవసరాలను కొనుగోలు చేయడానికి చేతుల్లో డబ్బులు లేక, తిండి దొరకక ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌తో సొంత ఊర్లకు చేరుకునే విషయంలో ప్రయాణ వసతులు లేక వలసకార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనేక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.

రెండోదశ లాక్‌డౌన్‌ దగ్గర పడుతున్న తరుణంలో అంతర్రాష్ట్ర వలసకార్మికుల ప్రయాణాలకు అనుమతినిస్తూ ఏప్రిల్‌ 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకార్మికుల ప్రయాణానికి కేంద్రం అనుమతి తెలిపింది. అయితే ఏప్రిల్‌ 29 నుంచి మొత్తం ఎనిమిది ట్రావెల్‌ ఆర్డర్లను కేంద్రం జారీ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీలకు పంపిన లేఖలు కూడా పబ్లిక్‌ డొమైన్‌లో అంత సులువుగా అందుబాటులో లేవు. దీంతో ఇవన్నీ వలసకార్మికులను గందరగోళానికి గురి చేశాయి. వారి కోసం కేంద్రం తగిన సంఖ్యలో రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతోనూ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. వలసకార్మికులు తమ ప్రయాణాల విషయంలో ఎలాంటి ఖర్చులూ భరించాల్సినవసరం లేదని గతనెల 28న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అప్పటికే సొంత ఊర్లకు చేరుకున్నవారిలో 85శాతం మంది ప్రయాణ ఖర్చులను భరించాల్సిరావడం గమనార్హం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆలస్యంగా స్పందించినట్టు నివేదికలో తేలింది.

అలాగే అధికశాతం మంది వలసకార్మికులు రేషన్‌ అందక తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తున్నారు. గతనెల 15 నుంచి ఈనెల 1 వరకు దేశవ్యాప్తంగా 5911 మంది వలసకార్మికులకు సంబంధించి వచ్చిన 821 అత్యవసర కాల్స్‌ ఆధారంగా 80శాతం మందికి ఇప్పటికీ ప్రభుత్వ రేషన్‌ అందడం లేదని స్వాన్‌ గుర్తించింది. మొదటి దశ లాక్‌డౌన్‌తో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా మంది ఆకలి బాధను అనుభవిస్తుండటం గమనార్హం. కానీ, 1.70 లక్షల కోట్లతో ప్రధాన మంత్రి గరీబ్‌కళ్యాణ్‌ అన్న యోజన, 20 లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించామని కేంద్రం చెప్తున్నప్పటికీ అవి వలసకార్మికుల కష్టాలను, బాధలను తీర్చడంలేదని స్వాన్‌ నివేదిక తేటతెల్లం చేసింది. పీఎం కేర్స్‌ ద్వారా సేకరించే నిధుల పైనా స్పష్టత లేదు. ఒకపక్క వలసకార్మికుల అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కానీ, మోడీ సర్కారు మాత్రం వారిని నిర్లక్ష్యం చేస్తోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Courtesy Nava Telangana