– పస్తులుండలేక ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకూ..
– బీహార్‌ నుంచి వలసకార్మికుల తిరుగు ప్రయాణం

ఆకలి… నిస్సహాయత.. కరోనా భయం… నగరాల నుంచి వలస కార్మికులను సొంతూర్ల బాట పట్టించింది. లాక్‌డౌన్‌ సమయంలో నానా అవస్థలూ పడుతూ బడుగు జీవులు పల్లెలకు పయనమయ్యారు. అదే ఆకలి.. నిరుద్యోగం… ఇప్పుడు వారిని తిరిగి నగరాలవైపునకు వెళ్లేలా చేస్తున్నది. కరోనా ó ముప్పునూ పట్టించుకోకుండా బీహార్‌ నుంచి వలసకార్మికులు గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో నిర్మాణ కార్యకలాపాలు షురూ అయ్యాయి. రుతుపవనాల రాకతో వ్యవసాయ పనులూ మొదలయ్యాయి.. ఫ్యాక్టరీల్లోనూ పనులు మొదలవ్వటంతో.. మళ్లీ పొట్ట చేతపట్టుకుని వలసలు ఆయా రాష్ట్రాలకు బయలుదేరుతున్నారు.

న్యూఢిల్లీ: వలస కార్మికులు పొట్టచేతపట్టుకొని తిరుగు ప్రయాణమవుతున్నారు. అహ్మదాబాద్‌, అమత్‌సర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు వంటి ప్రదేశాలకు స్పెషల్‌ ట్రైన్లు నడుస్తుండగా.. వాటి ద్వారా, ఇతర వాహనాల్లో నగరాలకు చేరుకుంటున్నారు. ప్రయాణికులకు వీలుగా రిజర్వేషన్ల స్థితిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నామనీ, రైల్వే రిజర్వేషన్ల వెయిటింగ్‌ లిస్టులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే శాఖ పబ్లిక్‌ రిలేషన్‌ చీఫ్‌ ఆఫీసర్‌ రాజేశ్‌కుమార్‌ తెలిపారు. ఓ వైపు ఆగస్టు 12 వరకు రైళ్లు నడవవని రైల్వేశాఖ ప్రకటించింది. మరోవైపు ప్రయాణికుల అవసరం ఏర్పడితే.. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో మరిన్ని రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు. ఉత్తర బీహార్‌లోని దర్భాంగ జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాల్లో వలసకార్మికులు పని ప్రదేశాలకు బయలుదేరుతున్నారు.

ప్రధాని ఉద్దీపనలు వట్టిమాటలే…
గ్రామీణ జీవనోపాధికి కొత్త ఊపునిచ్చే పేరుతో ప్రధాని మోడీ రూ.50 వేల కోట్లతో ‘గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రకటించారు. కానీ, గ్రామీణుల దరికి చేరలేదు. ఉపాధికి ఇది ఏ మాత్రం ఆసరాగా నిలవలేదు. లాక్‌డౌన్‌ సమయంలో బీహార్‌కు 20 లక్షల మంది వలసకార్మికులు తిరిగి వచ్చారనీ, వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రచారం చేశారు. గ్రామాల్లో పని కల్పిస్తామనీ, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలు తిరిగి వెళ్లొద్దంటున్నారు. కానీ, ఏ గ్రామంలోనూ ఆ హామీ నెరవేరలేదు. పస్తులుండలేక వలసకార్మికులు మూటమూల్లెసర్దుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు.

‘ఉపాధి’ పనీ దొరకలేదు : కార్మికులు
‘ఉపాధి హామీ కింద పనిచేయటానికి నాకు జాబ్‌ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియదు. కరోనా నుంచి కాపాడుకునేం దుకు ఇక్కడే కూర్చుంటే… ఆకలి మమ్మల్ని చంపేసేలా ఉన్నది’ అని ఆనందపూర్‌ గ్రామానికి చెందిన కుషో మండల్‌ అన్నారు. పంజాబ్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి వెళ్ళిన మండల్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూరుకు తిరిగివచ్చాడు. ‘మా యజమాని నుంచి ఫోన్‌ వచ్చింది. ఇప్పుడు పంజాబ్‌కు తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను’ అన్నారు. ఒక ఎకరం పొలంలో వరి మొక్కలు నాటేందుకు గతంలో రూ.3,500 ఇచ్చేవారు. ఇప్పుడు రూ.5000లు ఇస్తానని వాగ్దానం చేశారని తెలిపారు. ‘పంజాబ్‌ నుంచి నేను తిరిగి వచ్చి దాదాపు నెలన్నర దాటింది. పని ఎక్కడా దొరకటంలేదు. ఉపాధి పని కోసం అప్పటి నుంచీ తిరుగుతూనే ఉన్నాను. జాబ్‌కార్డు రాలేదు. కనీసం అది వచ్చినా.. రోజుకు రూ.192 వచ్చేది. కానీ, ఏ పనీ లేదు. అందుకే పంజాబ్‌కు తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను’ అని రత్యారీ గ్రామ వాసి పృథ్వీ ముఖియా చెప్పారు. ఆకలి… సరిహద్దులు తెలియని ఒక వాస్తవికత.. భయంకరమైన కరోనావైరస్‌ను సైతం లెక్కచేయకుండా వేలాది మంది వలసలు బీహార్‌ నుంచి పని ప్రదేశాలకు తిరిగి వెళుతున్నారు.

‘ఉపాధి’తో ఆదుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలనీ, మహాత్మాగాందీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పని కల్పించాలని ప్రజా సంఘాలు, హక్కుల కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. అందరికీ జాబ్‌ కార్డులు ఇచ్చి పని రోజులు, వేతనం పెంచాలని కోరుతున్నారు.

Courtesy Nava Telangana