నిర్మల్‌: ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు అయిన రవాణా ఖర్చు కూడా రాకపోతే.. ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుంది! ఇది తెలియాలంటే.. నిర్మల్‌ జిల్లా భైంసా టమాటా మార్కెట్టుకి వెళ్లాలి. తాను కష్టపడి పండించిన టమాట పంటను మార్కెట్‌లోనే పశువులకు మేతగా పడేసిన రైతు వ్యధ.. చూపరులతో కంటతడి పెట్టించింది. ఇలాంటి కన్నీటి ఘటనలు భైంసా టమాటా మార్కెట్లో నిత్యకృత్యమయ్యాయి.

భైంసాతో పాటు పరిసర ప్రాంతాల రైతులు కూడా తాము పండించిన టమాటాలను విక్రయించేందుకు బైంసా మార్కెట్‌కు తీసుకొస్తారు. శుక్రవారం కూడా ఇలాగే తీసుకొచ్చిన రైతులు.. ధర విని తెల్ల ముఖం వేశారు. 28 కిలోల టమాట పెట్టె ధర 30 రూపాయలే పలికింది. దీంతో అవాక్కవడం రైతుల వంతైంది. కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నించిన రైతులకు సమాధానం కరువైంది. ఈ ధరకు అమ్మితే.. రవాణా ఖర్చులు కూడా రావని ఆందోళన వ్యక్తం చేసిన వారు.. చేసేదేమీలేక మార్కెట్‌ ఆవరణలోనే టమాటాలను పశువులకు మేతగా పడేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు.

Courtesy Andhrajyothi