దారిద్య్రరేఖ దిగువకు తీసుకెళ్తున్న ఆరోగ్య సంరక్షణ భారం
ఫలించని మిషన్‌ ఇంద్రధనుష్‌
న్యూఢిల్లీ : దేశంలో దాదాపు సగం మంది పిల్లలకు రోగ నిరోధక టీకాలు అందలేదని ‘జాతీయ ఆరోగ్య నివేదిక’లో వెల్లడైంది. మరీ ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన 47 శాతం మంది పిల్లలకు ఈ టీకాలు అందకపోవడం ఆందోళనకరంగా ఉన్నది. అలాగే ధనిక కుంటుంబాల పిల్లల్లోనూ 30 శాతం మందికి ఈ టీకాలు అందకపోవడం గమనార్హం. సకాలంలో వీటిని అందించడం ద్వారా మీజిల్స్‌, కొరింత దగ్గు, తట్టు, పోలియో వంటి 26 రకాల వ్యాధులు రాకుండా నివారించవచ్చు. అయితే దేశవ్యాప్తంగా 38 శాతం మంది పిల్లలకు పూర్తిగా రోగనిరోధక టీకాలు వేయనేలేదు. ‘జాతీయ కుటుంబ సర్వే-4’ (2015- 16) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారం కుటుంబాలపై పడి ఆర్థిక వెనుకబాటుకు గురిచేస్తున్న ది. కాగా, దీనిని ఆయా కుటుంబాల ఆదాయం, వారుంటున్న ప్రాంతం, తల్లిదండ్రుల అక్షరాస్యత, పిల్లలు పుట్టిన ప్రదేశం వంటి అనేక అంశాలతో పాటు ప్రభుత్వ పనితీరు కూడా రోగనిరోధక టీకాలు అందించడంపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక టీకాలు అందని కారణంగా ప్రతి ఏడాది 3.2 నుంచి 3.9 మిలియన్ల మందిని దారిద్య్రరేఖకు దిగువకు తీసుకెళ్తున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే ప్రభుత్వం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమంలో భాగంగా టీకాల అందచేత పూర్థిస్థాయిలో ఫలితాన్ని రాబట్టాలంటే మరింత కృషి చేయాలని నివేదికలు సూచిస్తున్నాయి.
సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 23 ఏండ్ల వరకూ రోగనిరోధక టీకాలు వేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2010-15 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్‌ మంది ప్రాణాలను రోగనిరోధక టీకాలు వేయడం ద్వారా కాపాడగలిగారు. అలాగే న్యుమోనియా, డయేరియా, హూపింగ్‌ దగ్గు, మీజిల్స్‌, పోలియో వంటి వ్యాధులలో బాధపడుతున్న లక్షలాది మందిని రక్షించగలిగామనీ, వ్యాధులు మరింతగా వ్యాపించకుండా చేయగలిగామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ టీకాలు వేసుకోవడం ద్వారా ఆయా వ్యాధులు సోకితే అయ్యే ఖర్చులు చాలా తక్కువ ఉంటాయని ‘కార్లోస్‌ రిమెల్లో-హెర్ల్‌-2018’ అధ్యయనం వెల్లడించింది. వాటిల్లో మీజిల్స్‌కు వ్యాధికి అయ్యే ఖర్చులో 84 శాతం తగ్గుతుందనీ, అలాగే న్యూమోకాకల్‌ వ్యాధికి 29 శాతం, రోటావైరస్‌ ద్వారా సంక్రమించే వ్యాధుల ఖర్చులు 50 శాతానికి పైగా తగ్గుతాయని ఈ నివేదిక పేర్కొంది.

Courtesy Nava telangana…