హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై టెన్షన్‌ తొలగిపోయింది. పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ప్రస్తుత తరుణంలో ఎగ్జామ్స్‌ నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ కానున్నారు.

పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు ఈ భేటీలో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను గురించి ఈ సమావేశంలో చర్చించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పరీక్షలను నిర్వహించబోమని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని భావిస్తోంది. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లు ఉండగా.. అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు మార్చిలో పూర్తయ్యాయి. ఆ సమయంలో కరోనా కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తగు జాగ్రత్తలతో టెన్త్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునిచ్చింది. అయితే రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల మున్ముందు చాలా ఇబ్బందులు వస్తాయన్న ఆలోచనతో ప్రభుత్వం పరీక్షల రద్దుకు మొగ్గుచూపింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే బాగుండేదని కొంత మంది అంటున్నారు. పిల్లల పప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యం కాదని ఇంకొంత మంది అభిప్రాయపడుతున్నారు.