ఎన్‌పీఆర్‌ నిలిపివేయం
4 వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలి: సుప్రీం

న్యూఢిల్లీ, జనవరి : కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 143 పిటిషన్లపై విచారణను జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం బుధవారంనాడు చేపట్టింది.

ఈ పిటిషన్లపై నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల తరువాతే పిటిషనర్లకు ఊరటనిచ్చే ఉత్తర్వు ఇవ్వగలమని, కేంద్రం వాదన వినకుండా ఎక్స్‌పార్టీ ఉత్తర్వు ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేసింది. అసోం, త్రిపురలకు సంబంధించిన కేసులను విడిగా చేపట్టడానికి బెంచ్‌ అంగీకరించింది. ఈ నాలుగు వారాల్లోగా ఏ రాష్ట్రంలోని హైకోర్టూ సీఏఏపై విచారణ సాగించరాదని నియంత్రించింది.

ఈ కేసులో విచారణకు త్వరలో ఐదుగురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పరుస్తామని కూడా సీజే ప్రకటించారు. తదుపరి విచారణను ఆ తరువాతే లిస్ట్‌ చేస్తామని కూడా చెప్పారు. సీఏఏ అమలు నిలిపేయాలని, ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ఎన్‌పీఆర్‌ ప్రక్రియనూ మూడు నెలల పాటు వాయిదా వెయ్యాలని కొందరు పిటిషనర్ల తరఫున వాదించిన కపిల్‌ సిబాల్‌ కోరారు. కానీ బెంచ్‌ దీనికి నిరాకరించింది. ఈ అంశం నిరుడు డిసెంబరు 18న తొలుత విచారణకు వచ్చినపుడు 60 పిటిషన్లు మాత్రమే ఉండేవని, ఇపుడు 140కి పైగా పెరిగాయని, అందరికీ బదులివ్వాలంటే మరికాస్త సమయం కావాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోరారు.

కిక్కిరిసిన కోర్టు
పిటిషనర్లు 140 మంది ఉండడం, వారి తరఫున ఒక్కొక్క లాయరు చొప్పున అనేక మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బంది … ఇలా పెద్ద సంఖ్యలో వ్యక్తులు గుమిగూడడంతో కోర్టు హాలు నంబరు 1, దాని బయటి వరండాలు కిక్కిరిసిపోయాయి. తొలుత వాదనలు వినిపించేందుకు కపిల్‌ సిబాల్‌ నిలబడగానే రణగొణ ధ్వని కోర్టు హాలును ఆవరించింది. బెంచ్‌కూ ఏమీ వినపడని స్థితి. దీంతో సీజే బోబ్డే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్‌ చెప్పేదీ ఎవరికీ వినబడకపోవడంతో నిశ్శబ్దం పాటించాలని సీజే బోబ్డే లాయర్లను, కోర్టు సిబ్బందిని ఆదేశించాల్సి వచ్చింది.

Courtesy Andhrajyothi