– గ్రేటర్‌ ఖజానా ఖాళీ..!
– ఉద్యోగులకు వేతనాలివ్వని బల్దియా
– చరిత్రలో తొలిసారంటున్న అధికారులు
– ప్రతినెలా ఆస్తి పన్నుపైనే ఆధారం
– సోమవారం భారీగా వసూలు
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) గల్లా పెట్టె ఖాళీ అయింది. ప్రతి నెలా వందల కోట్ల రూపాయల జమా ఖర్చులను నిర్వహించే బల్దియా.. కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. బల్దియాలో నిధుల కొరత లేదని స్వయాన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమారే వెల్లడించారు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలందేవి. కానీ, అక్టోబర్‌ వేతనాలు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. అయితే, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించలేని పరిస్థితి బల్దియా చరిత్రలో మొదటిసారి అంటూ పలువురు ఉద్యోగులు అన్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే భారీగా పన్ను వసూలు చేశారు. ఆ మొత్తంతో కొన్ని విభాగాల ఉద్యోగులకు వేతనాలు వేశారు.
ఆదాయానికి మించి ఖర్చు..
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో 2018-19 ఏడాదికి సుమారు రూ.3,900 కోట్లు వ్యయం చేశారు. ఆదాయం మాత్రం రూ.3వేల కోట్లకు మించడం లేదని అధికారులే చెబుతున్నారు. అప్పులకే ప్రతినెలా రూ.10 కోట్ల చొప్పున ఏడాదికి రూ.120 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సుమారు రూ.900 కోట్లతో పాటు శానిటేషన్‌ విభాగానికి సుమారు రూ.800 కోట్లు, రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షన్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ తదితర మొత్తం రూ.130 కోట్లు, జోనల్‌ కార్యాలయాల నుంచి వచ్చే బిల్లులు చెల్లింపులు, ఇతర నిర్వహణకు సుమారు రూ.70కోట్లకుపైగా వ్యయం కానున్నట్టు అంచనా. వాస్తవానికి ప్రతి ఏడాదీ జీహెచ్‌ఎంసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.500 కోట్టు ఖర్చు చేస్తుండగా, 2018-19 ఏడాదికి మాత్రం రూ.400 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేస్తే.. ఏమైనా బాగున్నాయా అంటే అదీలేదు. గట్టిగా ఒక్క వర్షం వస్తే నగరంలోని రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
బల్దియా చరిత్రలో తొలిసారి..
జీహెచ్‌ఎంసీకి నేరుగా వచ్చే ఆదాయంలో ఆస్తి పన్ను వసూలే అత్యంత కీలకం. ఈ మొత్తం ప్రతినెలా సుమారు రూ.70-80 కోట్లు వసూలవుతోంది. అయితే, ఉద్యోగులకు చెల్లించే వేతనాల కోసం సెప్టెంబర్‌ 29వ తేదీ నాటికీ జీహెచ్‌ఎంసీ వద్ద డబ్బులు లేవు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ నెలలో మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్‌ రూ.68 కోట్లు వసూలు కాగా, ఒక్క సోమవారమే రూ.28.50 కోట్లు వసూలు చేశారు. ఇప్పటి వరకు పెన్షనర్లకు, శానిటేషన్‌ సిబ్బందికి వేతనాలు చెల్లించగా, ఒకట్రెండు రోజుల్లో వసూలయ్యే ప్రాపర్టీ ట్యాక్స్‌ మొత్తంతో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే ఆలోచనలో బల్దియా ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Courtesy Navatelangana..