నాలుగు నెలలుగా జీతలు కట్‌
– రూ. 4.33 కోట్ల వేతన బకాయిలు
– ఉద్యోగ భద్రతపై వీడని సందిగ్ధత
– ఆవేదనలో టెక్నికల్‌ మానిటర్లు, అసిస్టెంట్లు
పశుసంవర్థకశాఖలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నెలలుగా, శ్రీకాకుళం జిల్లాలో ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో నానాఅవస్థలు పడుతున్నారు. సుమారు రూ.4.33 కోట్ల మేర వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వేతన బకాయిలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో 2018 నవం బరులో టెక్నికల్‌ మానిటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, జిల్లాస్థాయి సివిల్‌ ఇంజినీర్‌(డిఎల్‌సిఇ)లను రాష్ట్రవ్యాప్తంగా ‘రెడ్డి ఏజెన్సీ’ ద్వారా అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వ్యవసాయశాఖ ఇంజినీరింగ్‌ విభాగంలో నియమించారు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగం కింద జాయింట్‌ డైరెక్టర్‌ ఉత్తర్వుల మేరకు పశుసంవర్థకశాఖలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థక శాఖలో టెక్నికల్‌ మానిటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, జిల్లాస్థాయి సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడు కేటగిరిలో 450 మంది ఉద్యోగాల్లో చేరారు. టెక్నికల్‌ మానిటర్‌కు రూ.25 వేలు, అసిస్టెంట్‌కు రూ.15వేలు, డిఎల్‌సిఇలకు రూ.60 వేలుగా వేతనాలు నిర్ణయించారు.
పశుసంవర్థకశాఖలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌కు సంబం ధించిన పనులను వీరు చేస్తున్నారు. మినీగోకులాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చేయడం, గొర్రెలు, మేకల శాలలకు సంబంధించి స్థల పరిశీలన, వాటి బిల్లులు, నీటి తొట్టెలు, కోళ్ల ఫారాల నిర్మాణాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రతి గ్రామంలో పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు నిర్వహిస్తూ రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
ఏజెన్సీల ద్వారా నియమితులైన టెక్నికల్‌ మానిటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, డిఎల్‌సిఇలకు డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు జీతాలను విడుదల చేశారు. మార్చి నుంచి జీతాలను నిలుపుదల చేశారు. మార్చి నుంచి జూన్‌ వరకు 219 మంది టెక్నికల్‌ మానిటర్లకు సంబంధించి రూ.2.19 కోట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు సంబంధించి రూ.1,09,80,000, డిఎల్‌సిఇకు సంబంధించి రూ.28.80 లక్షల వేతనాలను నిలుపుదల చేశారు. మొత్తం రూ.3,57,60,000 వేతన బకాయిలు రావాల్సి ఉంది. జీతాలు అందకపోవడం, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో జులై నుంచి విధులకు వెళ్లకుండా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేతన బకాయిలు చెల్లించాలని, గ్రామ సచివాలయ పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనబాట పట్టారు. సమస్యను రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా, సచివాలయ ఉద్యోగాల నియామకాల అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారని ఉద్యోగులు చెప్తున్నారు. సచివాలయ పోస్టుల భర్తీ నేపథ్యంలో తమ ఉద్యోగం ఉంటుందో, లేదోనన్న అభద్రతాభావంలో ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి
శ్రీకాకుళం జిల్లాలో 2018 డిసెంబరులో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా 48 మంది చేరారు. ఐదుగురు రెడ్డి ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారు. ఈ 53 మందిలో ఏజెన్సీ ద్వారా నియమతులైన ఐదుగురికి ఫిబ్రవరి నెల వరకు జీతాలు విడుదల చేశారు. అక్కడ్నుంచి జీతాలు విడుదల చేయలేదు. పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ద్వారా నియమితులైన 48 మందికి ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏడు నెలల పాటు జీతాలు మంజూరు చేయలేదు.

మానసికంగా కుంగిపోతున్నాం
నాలుగు నెలలుగా జీతాలు విడుదల కాక, ఉద్యోగ భద్రత లేక మానసికంగా కుంగిపోతున్నాం. విధుల్లో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో పనులు చేసి రైతులకు చేదోడువాదోడుగా ఉన్నాం. వైసిపి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల నియామకం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తోంది. కనీసం సచివాలయ పరీక్షల్లో 10 శాతం వెయిటేజీ కూడా ఇవ్వలేదు. మా జీతాలు విడుదల చేసి, తిరిగి విధుల్లో కొనసాగించాలని కోరుతూ విశాఖపట్నంలో సిఎం వైఎస్‌ జగన్‌ను కలిశాం. ఆయన కూడా త్వరలోనే చెప్తామన్నారు.

– సునీల్‌ చౌదరి,
రాష్ట్ర పశుసంవర్థకశాఖ ఇంజనీరింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘ కార్యదర్శి, విజయవాడ.

Courtesy Prajasakti…