అయోమయంలో 39 లక్షల ఖాతాలు
* 388 మంది కౌలు రైతులకే అర్హత
* అటవీ హక్కులకు 598 మందికే
* అర్జీలకు సమీపిస్తున్న గడువు
రైతు భరోసాకు ప్రభుత్వం విధించిన షరతులు అన్నదాతలకు గుదిబండగా మారాయి. భూమి లేని కౌలు రైతులకు, అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఎఫ్‌వొఆర్‌) కింద గుర్తించిన గిరిజన రైతులకు ప్రభుత్వ భరోసా నామమాత్రంగానే దక్కింది. గిరిజనులకు ఒక్క శాతం లోపు మందికే భరోసా సొమ్ము జమకాగా కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇదిలా ఉండగా కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో కలిపి సొంత భూమి కలిగిన రైతులకు సైతం భరోసా ఒక పట్టాన అందట్లేదు. కేంద్ర నిబంధనలు, సాంకేతిక కారణాలతో లక్షలాది మంది రైతుల భరోసా అయోమయంలో పడింది. దరఖాస్తులకు తుది గడువు ఈ నెల 15 కాగా ఆ లోపు అర్హులైన వారందరికీ భరోసా అనుమానంగా ఉంది. అర్హులైన ఒక్క రైతు కూడా భరోసా వెలుపల ఉండకూడదని, వివిధ స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేశామని, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారని సర్కారు చెబుతున్నప్పటికీ ఆశించిన మేరకు పురోగతి లేదు. రైతులు భరోసా కోసం వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంక్‌, గ్రామ సచివాలయాలు, ఇ-సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారి సమస్యలు పరిష్కారం కావట్లేదు. భరోసాను అక్టోబర్‌ 15న ప్రారంభిస్తామని చాలా ముందుగానే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ యంత్రాంగాన్ని అందుకుతగ్గట్టు సిద్ధం చేయలేదన్న విమర్శలొస్తున్నాయి. భరోసా రాని వారు అర్జీలు పెట్టుకునేందుకు ఇంకా తొమ్మిది రోజులే సమయం ఉండటంతో రైతుల్లో ఆందోళన అధికమైంది.

తేలని లక్షల ఖాతాలు
సొంత భూమి కలిగిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్టుబడి సాయం కింద రూ.13,500 ఏడాదిలో మూడు కిస్తుల్లో ఇస్తున్నాయి. పిఎం కిసాన్‌ నిబంధనలే భరోసాకు వర్తింపజేశారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా సొంత భూమి కలిగిన వారందరూ అర్హులు. రైతులు తమ భూమికి సంబంధించిన ఏదొక హక్కు పత్రం చూపించాలి. ప్రధానంగా వెబ్‌ల్యాండ్‌ ఖాతా, ప్రజాసాధికార సర్వేలను కొలబద్దలుగా తీసుకున్నారు. ఈ రెండింటితో సొంత భూమి కలిగిన రైతులను కుటుంబాల వారీగా వర్గీకరించారు. వెబ్‌లాండ్‌ ఖాతాకు ఆధార్‌, మొబైల్‌ అనుసంధానం కాకపోయినా, ఏదేని తప్పులు దొర్లినా తిరస్కారానికి గురవుతున్నాయి. ఎలాగొలా అక్కడ బయటపడినా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌, మొబైల్‌ అనుసంధానం కాకపోయినా తిరస్కారమే! మొబైల్‌కు సొమ్ము జమ అయిందనే ‘ఎస్‌ఎంఎస్‌’ రాని రైతులకు జవాబు చెప్పే అధికారుల్లేరు. ఫిర్యాదు పరిష్కార కేంద్రాల్లో అర్జీలు తీసుకున్నా త్వరగా పరిష్కరించట్లేదు. వివిధ శాఖలతో ముడిపడి ఉండటంతో రైతుల పరిస్థితి ఎక్కే గడప దిగే గడపలా తయారైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నవంబర్‌ 1 నాటికి ఇంకా 39 లక్షల రైతు ఖాతాలు వివిధ దశల్లో పెండింగ్‌లోనో, తిరస్కారానికి గురయ్యో ఉన్నాయి. మొత్తం 79.61 లక్షల ఖాతాల్లో వ్యవసాయశాఖ 53.72 లక్షలను క్లియర్‌ చేసింది. తదుపరి నిర్వహించిన తనిఖీల అనంతరం 42.25 లక్షల ఖాతాలను బ్యాంకులకు పంపగా 39.36 లక్షల ఖాతాల్లో సొమ్ము జమ అయింది.

కౌలు రైతులకు ఘోరం
కౌలు రైతులకు కేంద్రం పెట్టుబడిసాయం నిరాకరించినప్పటికీ రాష్ట్ర సర్కారు ఇస్తానంది. తొలుత 15.36 లక్షల కౌల్దార్లకు రూ.13,500 తానే ఇస్తానన్న ప్రభుత్వం అనంతరం మార్గదర్శకాల సందర్భంగా 3 లక్షలకు లక్ష్యాన్ని తగ్గించింది. కౌలు రైతులకు రాష్ట్రం పలు షరతులు విధించింది. కొత్త కౌలు చట్టం ప్రకారం పంట సాగు హక్కు పత్రం (సిసిఆర్‌సి) ఉండాలి. సిసిసిఆర్‌సి పొందిన వారిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకే భరోసా వర్తిస్తుంది. ఆహార పంటలైతే కనీసం ఎకరం, హార్టికల్చర్‌ పంటలు, కూరగాయలైతే అర ఎకరం, తమలపాకు పంట పది సెంట్లు కౌలు రైతు సాగు చేయాలి. సిసిఆర్‌సి పొందడానికి భూమి యజమాని సంతకం తప్పనిసరి కావడంతో కార్డుల జారీ నామమాత్రంగా ఉంది. గతంలో ఎల్‌ఇసి, సివొసిలను 11 లక్షల మంది కౌలు రైతులు పొందారు. భూమి లేని కౌలు రైతులు ఏడు లక్షల వరకు ఉంటారన్నది సర్కారు అంచనా. అక్టోబర్‌ 2 నుంచి సిసిఆర్‌సిల జారీ ప్రారంభించగా ఇప్పటి వరకు 1.83 లక్షల మందికే సిసిఆర్‌సిలు ఇచ్చారు. వీటిలో భరోసా కోసం వ్యవసాయశాఖ పరిశీలనకు 21,707 రాగా కేవలం 388 మంది అర్హత పొందారు. మిగతావారంతా పెండింగ్‌లోనే!

గిరిజనులనూ వదలని నిబంధనలు
అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఎఫ్‌వొఆర్‌) కింద గుర్తించిన గిరిజన రైతుల భరోసా సైతం ఘోరంగా ఉంది. వ్యవసాయశాఖ గణాంకాల మేరకే ఆర్‌ఎఫ్‌వొఆర్‌ ఖాతాలు 64,196 కాగా వాటిలో 598 మాత్రమే భరోసాకు అర్హత పొందాయి. ఆర్‌వొఎఫ్‌ఆర్‌ కింద గుర్తింపు పొందడమంటే భూమిపై గిరిజనులకు హక్కు ఉన్నట్టు నిర్ధారణ. అయినా భరోసాను ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పే నాథుడే లేడ.

Courtesy Prajasakthi…