బస్సు సౌకర్యం లేని గ్రామాలు 840
పెండింగ్‌లోనే 2000 దరఖాస్తులు
నాలుగేళ్లుగా నిలిచిన రూట్‌ సర్వేలు
డిపో అడ్వయిజరీ కమిటీలు ఏవీ?
పరిగి నుంచి కడుమూరు, తాళ్లపల్లి మీదుగా హైదరాబాద్‌కు బస్సు నడపాలని కడుమూరు, తాళ్లపల్లి గ్రామాల ప్రజలు ఏటా కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సిఫారసు లేఖలు ఇచ్చారు. అయినా… ఆర్టీసీ కొత్త బస్సు వేయట్లేదు. షాద్‌నగర్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపూర్‌కు, 25 కిలోమీటర్ల దూరంలోని చేవూరుకు బస్సుల కోసం స్థానికులు కోరుతూ వస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఉంటుందని, ప్రైవేటు వాహనాలు నవడకుండా చూస్తామని కూడా వారు చెబుతున్నారు. కానీ.. కొత్త బస్సులు లేవని, ఉన్న బస్సులు సరిపోవడం లేదని అధికారులు దాటవేస్తున్నారు. నిర్మల్‌ నుంచి స్వర్ణ వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడిచేది. ఇప్పుడు రోజంతా ఐదు ట్రిప్పులకు మించి నడవట్లేదు. నిజంగా నిర్మల్‌ డిపోకు ఇది పెద్దమొత్తంలో ఆదాయం తెచ్చే రూటు. కానీ ప్రైవేటు ఆపరేటర్ల కారణంగా బస్సుల సంఖ్యను దారుణంగా తగ్గించారు. ఆర్టీసీ బస్సులను నడిపితే… ప్రైవేటు వాహనాలను ఆశ్రయించబోమని చెబుతున్నా ఆర్టీసీ ట్రిప్పులను మాత్రం పెంచట్లేదు.
 ..ఇదీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎ్‌సఆర్టీసీ) తీరు! ‘మా గ్రామాలకు బస్సులు వేయండి మహాప్రభో’ అని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోవట్లేదు. కొత్త బస్సులు లేవని, ఉన్న బస్సులను దారి మళ్లించలేమని చేతులెత్తేస్తోంది. తమ గ్రామాలకు బస్సులు వేయాలంటూ రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోలలో 60కి పైగా గ్రామీణ ప్రాంత డిపోలకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 2000 దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క గ్రామానికి కొత్తగా బస్సు వేయలేదు. పాత రూట్లలో బంద్‌ చేసిన బస్సులను పునరుద్ధరించలేదు. కొన్ని రూట్లలో ట్రిప్పులను తగ్గిస్తున్నారు. అదేమంటే… తమ వద్ద బస్సులు లేవని అధికారులు చెబుతున్నారు.
అసలేం చేయాలి..?
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. టీఎ్‌సఆర్టీసీ తెలంగాణలోని పల్లె పల్లెకూ బస్సును నడపాలని సంకల్పించింది. బస్సు సౌకర్యం లేని గ్రామాలపై సర్వే చేసింది. రాష్ట్రంలో ఎలాంటి బస్సు సౌకర్యం లేని(అన్‌-కనెక్టెడ్‌) గ్రామాలు 910 ఉన్నట్లు తేల్చింది. వీటికి బస్సులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతూనే ఉన్నారు. వీటితో పాటు ఇదివరకు బస్సులు నడిచి రద్దయిన రూట్లలోనూ బస్సులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. అయినా ఆర్టీసీ పట్టించుకోవట్లేదు. అష్టకష్టాలు పడి 2015లో మాత్రం 70 కొత్త రూట్లలో బస్సులను ప్రారంభించింది. మిగతా 840 రూట్లలో ఒక్క రూటులోనూ నాలుగేళ్లుగా బస్సు సర్వీసును ప్రారంభించలేదు.
కమిటీలు ఏవీ?
బస్సులను నడపడానికి కొత్త రూట్లను ఎంపిక చేయడం, పాత రూట్లలో బస్సుల పునరుద్ధరణ, ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు బస్సుల పొడిగింపు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, నివేదికలు ఇవ్వడానికి ప్రతి డిపో స్థాయిలో ‘డిపో అడ్వయిజరీ కమిటీ’లు ఉండాలి. డిపో మేనేజర్‌ ఆధ్వర్యంలో ఉండే ఈ కమిటీల్లో డిపోలోని ఒక సూపర్‌వైజర్‌, గుర్తింపు కార్మిక యూనియన్‌ నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కానీ… ఏ డిపోలో కూడా ఈ కమిటీలు ఉనికిలో లేవు. రూట్‌ సర్వేల మాట లేదు. కొత్త రూట్ల ఊసే లేకపోవడంతో… కమిటీలను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా కొత్త రూట్ల అధ్యయనం అటకెక్కినట్లయింది.