• ఏచూరికి మళ్లీ పార్టీలోనే ఎదురుగాలి
  • రాజ్యసభకు ప్రకాశ్‌ కారత్‌ వర్గం గండి
  • కాంగ్రెస్‌ మద్దతు లభించినా సొంత పార్టీలోనే అసమ్మతి

న్యూఢిల్లీ, మార్చి : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి మళ్లీ భంగపాటు తప్పని పరిస్థితి  కనిపిస్తోంది. మూడోసారి ఆయనను రాజ్యసభకు పంపేందుకు పశ్చిమబెంగాల్‌ యూనిట్‌ సిద్ధమైనప్పటికీ, అక్కడి కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇస్తానన్నప్పటికీ పొలిట్‌ బ్యూరో (పీబీ)లో కొందరు సీనియర్లు ఇందుకు ససేమిరా అంటున్నారు. గత వారం హడావిడిగా ఏర్పాటు చేసిన పీబీ సమావేశానికి 9 మంది హాజరుకాగా వారిలో మెజారిటీ సభ్యులు ఏచూరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. వారిలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌, బృందాకారత్‌, బీవీ రాఘవులుతో పాటు ప్రధానంగా కేరళ వర్గం ఉన్నట్లు సమాచారం. పీబీలో కేరళ వర్గానిదే ఆధిపత్యం. దాన్ని వెనకుండి నడిపిస్తున్న ప్రకాశ్‌ కారత్‌- ఏచూరికి మూడోసారి అవకాశం లభించకుండా యత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రధాన కార్యదర్శిగా ఏచూరి తనదైన ముద్రవేశారు. కాంగ్రె్‌సతో చేతులు కలిపి ఏచూరి రాజ్యసభకు వెళ్లడం సరికాదంటూ కొందరు పీబీ సభ్యులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఇలా ఆయనకు పొలిట్‌బ్యూరో మోకాలడడ్డడం ఇది రెండోసారి.