పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు

దిల్లీ: అయోధ్య భూ వివాదంపై గత నెల 9న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పునఃసమీక్ష పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. విచారణకు స్వీకరించడానికి అవసరమైన ప్రాతిపదిక వీటికి లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టంచేసింది.

ఈ అంశంపై మొత్తం 19 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయమూర్తుల ఛాంబర్‌లో విచారణ జరిగింది. వీటిలో ప్రధాన కక్షిదారులు దాఖలు చేసిన పది పిటిషన్లపై తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. ‘‘కోర్టు గదిలో వీటిని విచారించడానికి వీలుగా లిస్టింగ్‌ చేయాలంటూ దాఖలైన దరఖాస్తులను తిరస్కరిస్తున్నాం. పునఃసమీక్ష పిటిషన్లు, సంబంధిత ఇతర పత్రాలను నిశితంగా పరిశీలించాం. వాటిపై విచారణ చేపట్టడానికి ఎలాంటి ప్రాతిపదిక మాకు కనిపించడంలేదు’’ అని ధర్మాసనం పేర్కొంది. మిగతా 9 పిటిషన్లను ప్రధాన దావాలో కక్షిదారులుగా లేని తృతీయ పక్షాలు దాఖలు చేశాయి. ఈ అంశంలో ముస్లిం పక్షాల తరఫున అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మద్దతుతో 8 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే హిందువుల పక్షాన నిర్మోహి అఖాడా, అఖిల భారత హిందూ మహాసభ వీటిని వేశాయి. తాజా ధర్మాసనంలో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కూడా ఉన్నారు. పునఃసమీక్ష పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో ఇక కక్షిదారులు చివరి అవకాశంగా క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయవచ్చు.

Courtesy Eenadu…