ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్‌ విధానం ఉండదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అలాగే ఈ యూనివర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం కూడా ఉండదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు సవరణ బిల్లును అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి వీలుగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలన్నీ నిబంధనలను పాటించేలా చూస్తున్నామన్నారు. ఫలితంగా ఒకప్పుడు 350 వరకు ఉన్న కాలేజీలు నేడు 180కి తగ్గాయని చెప్పారు. ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు కోసం 2018లో చట్టం తీసుకొచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి 16 సంస్థలు ముందుకొచ్చాయని, మొదటి దశలో 5 (మహీంద్ర, హోస్టన్‌, మల్లారెడ్డి, అనురాగ్‌, ఎస్‌ఆర్‌) వర్సిటీలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఈ వర్సిటీలను రెండు కేటగిరీలుగా విభజించామని, ఇప్పటికే కాలేజీలు, విద్యార్థులు ఉన్న వాటిని బ్రౌన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీలుగా; కొత్తగా ఏర్పాటు చేసే వాటిని గ్రీన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీలుగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్‌ ఫీల్డ్‌ వర్సిటీల్లో రిజర్వేషన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటివి వర్తించవని తెలిపారు.

బ్రౌన్‌ ఫీల్డ్‌ వర్సిటీల్లో మాత్రం గతంలో ఉన్న పద్ధతులే కొనసాగుతాయని వివరించారు. అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల పటిష్ఠానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు కేసుల వల్ల నియామకాల్లో కొంత ఆలస్యమైందని అన్నారు. వీసీల నియామకాన్ని ప్రారంభించామని, ఇప్పటికే సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఏటా సుమారు రూ.700 కోట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ వర్సిటీలను సర్కార్‌ పట్టించుకోవడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఖాళీలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. అనుమతించిన ప్రైవేట్‌ వర్సిటీల్లో కేబినెట్‌లో ఉన్న వారివి ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్‌ వర్సిటీల్లో ఫీజుల నియంత్రణ, రిజర్వేషన్‌ విధానం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు సంజయ్‌, మోజం ఖాన్‌, రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రైవేట్‌ వర్సిటీలు ఉపయోగపడుతాయన్నారు.