– ఎన్‌. వేణుగోపాల్‌

ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ఆర్థిక మాంద్యం దేశంలో కూడ విస్తరిస్తున్నదని, అనేక గణాంక సూచికలు ఆ వాస్తవాన్ని తేటతెల్లం చేస్తున్నాయని స్వతంత్ర ఆర్థిక వేత్తలు, పరిశీలకులు, చివరికి ద్రవ్య, ఆర్థిక సంస్థల నిర్వాహకులు చెపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు దాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం లేదని, ఉన్న సమస్యలను ఆ పేరుతో పిలవలేమని, గణనీయమైన వృద్ధి సాధిస్తున్నామని నోటికి ఏ అబద్ధం వస్తే ఆ అబద్ధం ఆడుతున్నారు. ఈ స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థలో అవిభాజ్య భాగమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం పరిస్థితి, దానికి పాలకుల ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉన్నాయి.

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ప్రవేశించిందని ప్రభుత్వం నాలుగు నెలల కింద బహిరంగంగానే అంగీకరించింది. అంతకు ఆరు నెలల ముందు, మార్చిలో ప్రవేశపెట్టిన రూ.1.82 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ స్థానంలో, సెప్టెంబర్‌లో రూ.36 వేల కోట్లు తగ్గించి, రూ.1.46 లక్షల కోట్ల పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెడుతూ, స్వయంగా ముఖ్యమంత్రే ఈ కోతకు కారణాలు జాతీయ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మందకొడితనం, రాష్ట్రాదాయంలో విపరీతమైన తరుగుదల అని ప్రకటించారు. పన్నువసూలు వృద్ధిరేటు, పన్నేతర ఆదాయ వృద్ధిరేటు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు వంటి అన్ని సూచికలూ గణనీయమైన తరుగుదలను సూచించాయని అన్నారు. ఈ తరుగుదలను మందకొడితనం అనాలా, మాంద్యం అనాలా అనే అర్థశాస్త్ర చర్చ అవసరం లేదు గాని గుర్తించవలసిన విషయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా భారత ఆర్థిక వ్యవస్థతో పాటు, ఆ మాటకొస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు పతనదిశగా, సంక్షోభం దిశగా వడివడిగా జారిపోతున్నదని అర్థం. దాన్ని ఏ పేరుతో పిలిచినా ఈ మాంద్యం ప్రజల నిత్యజీవితంలో అనేక రూపాలలో అనుభవంలోకి వస్తున్నది. ధరల పెరుగుదల, ఉత్పత్తిలో కోత, పెరుగుతున్న నిరుద్యోగం, తరుగుతున్న ఉద్యోగకల్పన, ప్రభుత్వాదాయంలో కోత, అభివృద్ధి, సంక్షేమ వ్యయాలలో కోత వంటి అనేక పరిణామాల విషవలయం ఆర్థిక వ్యవస్థను చుట్టుముడుతున్నది.

అయితే ఆశ్చర్యకరంగా, బడ్జెట్‌లో కోతకు మాంద్యాన్ని కారణంగా చూపిన పాలకులే, అందుకు నెపాన్ని జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పెట్టిన పాలకులే, రాష్ట్రంలోకి వచ్చేసరికి మాంద్యం లేదని, మాంద్యాన్ని అధిగమించగల సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒకవైపు ప్రజాజీవనానికి అత్యవసర మైన పద్దుల వ్యయాలపై ఆర్థిక కొరత కారణం చూపుతూ కోతలు విధిస్తూనే మరొకవైపు ఆర్థిక మాంద్యం ప్రభావమే లేదన్నట్టుగా వృథా వ్యయాలు, ఆడంబరపు వ్యయాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఉన్నట్టా లేనట్టా అనే సందేహం కలుగక మానదు. లేదా పాలకులు తమ అవసరానికి అనుగుణంగా, అవకాశ వాదంతో, ఏకకాలంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్టూ, లేనట్టూ కూడా ప్రవర్తిస్తు న్నారని అనుకోవలసి వస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి గెలిచి అధికారం చేపట్టి గడిచిన పదమూడు నెలల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో జరిగిన పరిణామాలు, వాటిని ఒక్కోసారి ఒక్కో విధంగా ఆర్థిక మాంద్యానికి ముడిపెట్టిన తీరు చూస్తే ప్రభుత్వానికి ఆర్థిక మాంద్యం అనే మాటను అవకాశంగా, సాకుగా, నెపంగా వాడుకునే ఉద్దేశమే తప్ప వాస్తవంగా దాన్ని అర్థం చేసుకుని వ్యవహరించే జాగ్రత్త లేదని అర్థమవుతుంది. మొదటి పాలన నాలుగున్నరేండ్లలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో అనుసరించిన అపసవ్య పద్ధతులనే రెండో పాలనలో కూడ యథాతథంగా అనుసరించనున్నారని అర్థమవుతుంది. మొదటి పాలనాకాలంలో సెంటిమెంటు, అనుభవరాహిత్యం, ఆర్థిక వ్యవస్థలో ఊపు వంటి కారణాలు ఆ అపసవ్యతనుంచి కూడ ప్రభుత్వాన్ని కాపాడాయి గాని, రెండో పాలనాకాలంలో ఆ సమర్థక కారణాలు లేవు సరిగదా కమ్ముకొస్తున్న ఆర్థిక మాంద్యపు ప్రమాదం ఉంది.

అధికారానికి వచ్చేనాటికి రూ.38,000 కోట్ల వ్యయ అంచనాతో ఉన్న నీటిపారుదల పథకానికి పేరు మార్చి, కొన్ని అనవసరమైన మార్పులు చేసి, మొత్తంగా ఆయకట్టు విస్తీర్ణాన్ని మార్చకుండానే వ్యయ అంచనాలను రూ.80,000 కోట్లకు పెంచి కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన ప్రతిఫలంగా పాలకపార్టీకో, పాలక కుటుంబానికో ముడుపులు రాబట్టిన వ్యూహం మొదటి పాలనాకాలానిది. కాగా, రెండో పాలనా కాలంలో ఒక వైపు మాంద్యం గురించి మాట్లాడుతూనే, నీటి పారుదల కేటాయింపులను మూడో వంతుకు తగ్గిస్తూనే, హఠాత్తుగా మొత్తం అంచనా వ్యయాన్ని రూ.25 వేల కోట్లు పెంచారు. ఆ ప్రాజెక్టు వ్యయం మీద, అసలు ప్రాజెక్టు మొదటి రూపం మీద ప్రశ్నలు, అనుమానాలు సాగుతుండ గానే, మాంద్యం భయం కమ్ముకొస్తుండగానే, హఠాత్తుగా రూ.25,000 కోట్ల అంచనాలు పెంచడం ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో సక్రమ పద్ధతి కాదు. అసలు ప్రాజెక్టు అవసరాన్ని, దాని అంచనా వ్యయాన్ని, ఆ ప్రాజెక్టు పూర్తయితే ఒనగూరే ప్రయోజనాలను వాస్తవికంగా, సమగ్రంగా మదింపు వేసి, అవసరమైతే మార్పులూ చేర్పులూ చేయవలసి ఉండగా, మాంద్యం వల్ల ప్రతి రూపాయినీ పొదుపుగా, జాగ్రత్తగా కేటాయించవలసి, ఖర్చు పెట్టవలసి ఉండగా, అటువంటి పనికి పూనుకోకుండా ఒక భారీ అంకె ప్రకటించడం, ప్రజాధనం మీద అంత పెద్దఎత్తున భారం మోపడం, అందుకోసం అవసరమైతే రుణాలకైనా వెళతామని అనడం ప్రజావ్యతిరేక ఆర్థిక నిర్వహణా పద్ధతే.
అలాగే మరొక నీటి పారుదల పథకానికి అవసరమైన పంపుల కొనుగోళ్లలో నేరుగా ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ నుంచి కొనుగోలు చేస్తే రూ.3000 కోట్లకు రాగలిగిన పంపులను ఒక మధ్యవర్తి కాంట్రాక్టు కంపెనీ ద్వారా కొనుగోలు చేయించి, ఆ మధ్యవర్తి కంపెనీకి రూ.8,000 కోట్లు కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. తమ అధికారంతో, ప్రాబల్యంతో, ఇతరేతర మార్గాలలో ఆ విమర్శ నుంచి తప్పించుకోవచ్చు గాని, అవకతవకలు జరిగాయనే వాస్తవం మారదు. వేలకోట్ల, లక్షల కోట్ల ప్రజాధనం వ్యర్థమైపోతున్నప్పుడు ఈ చిన్న మొత్తం గురించి అంత రభస ఎందుకు అని కూడ అనిపించవచ్చు గాని ఆర్థిక మాంద్యం ప్రతి రూపాయినీ జాగ్రత్తగా, పొదుపుగా, వృథా కాకుండా ఖర్చుపెట్టాలని ఆదేశిస్తున్నది. ఆ ఆర్థిక మాంద్యపు హెచ్చరిక వినకుండా, ఆశ్రితుల బొక్కసాలు నింపితే చాలు, ఆ బొక్కసాల నుంచి తిరిగి వచ్చే ముడుపులు యథావిధిగా వస్తే చాలు అనుకుంటే ఆర్థిక మాంద్యం ప్రజా జీవితాన్ని మాత్రమే కాదు, ఆ దొంగ దళారీ మధ్యవర్తి కంపెనీలను, పాలకులను కూడ సహేంద్ర తక్షకాయస్వాహా అన్నట్టుగా మింగేస్తుంది.

ఇక అంత పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల్లో కాకపోయినా, వందల కోట్ల ఖర్చుల విషయంలో కూడా ప్రభుత్వం ఆ ఖర్చులు అవసరమైనవేనా, మాంద్యం సమయంలో ఉచితమైనవేనా అని ఆలోచించడం లేదు. ఉదాహరణకు మొదటి పాలనా కాలపు చివరి రోజుల్లో ప్రభుత్వం సెక్రటేరియట్‌ మార్చాలని, కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి రూ.300-400 కోట్లు ఖర్చవుతుందని ప్రస్తుత అంచనా. ఈ పథకం పూర్తయ్యేనాటికి అది రెట్టింపు అవుతుందో, మూడురెట్లే అవుతుందో, అందువల్ల ఏ భవన నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలు, ఏ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు లాభపడతాయో, ఆ లాభాల్లో ఎంత వాటా ఎవరికి అందుతుందో ఊహించవలసిందే. ఈ కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణ సమస్య ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. ఈ విచారణలో భాగంగా, జనవరి 2న న్యాయమూర్తులు కూడా ఆర్థిక మాంద్యం సమస్యను ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్ముకొస్తున్న, రాష్ట్రం మీద కూడా ప్రభావం వేస్తున్న మాంద్యం నేపథ్యంలో ఈ కొత్త సెక్రటేరియట్‌ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను ఎక్కడి నుంచి సేకరించగలుగుతారని, మాంద్యం సమయంలో కూడా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా అని న్యాయమూర్తులు అడిగారు. ఆర్థికంగా గడ్డు స్థితి ఉందనీ, డబ్బు జాగ్రత్తగా, అత్యవసరమైన చోట్ల మాత్రమే పొదుపుగా ఖర్చుపెట్టాలనీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకూ ఆదేశాలు ఇస్తున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ మాంద్యం ఒకపక్కనా, వాస్తు మూఢ నమ్మకాలు, ఆశ్రిత రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణ కంపెనీల ప్రయోజనాలు, వాటిలో భాగమైన తమ ముడుపులు ఒకపక్కనా ఉన్న తక్కెడ రెండో వైపే మొగ్గు చూపుతున్నట్టున్నది.

పరిమాణం రీత్యా అంత భారీ ఖర్చు కాకపోవచ్చు గానీ మాంద్యం సమయంలో కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎంతగా దుర్వినియోగం వైపు, వృథా వ్యయం వైపు ఉన్నాయో చూపడానికి యాదాద్రిలో వీవీఐపీ విల్లాల నిర్మాణపు నిర్ణయాన్ని చూడవచ్చు. యాదగిరి గుట్ట, లేదా ముఖ్యమంత్రి పెంపుడు పుణ్యక్షేత్రం యాదాద్రి, ఆస్తికులకు చాల ముఖ్యమైనదే కావచ్చు. అక్కడికి చాల మంది రాజకీయ, సామాజిక, వ్యాపార రంగాల కీలక వ్యక్తులు వస్తుండవచ్చు. ఆ మహా మహా ముఖ్య వ్యక్తుల కోసం అక్కడ ఐదేసి పడకగదుల, నాలుగేసి పడకగదుల విల్లాలు పదిహేను మొత్తం మీద వంద కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి అది హైదరాబాద్‌ నుంచి అరవై కిమీ దూరంలో, అంటే గంట ప్రయాణ దూరంలో ఉంది. ఆ వీవీఐపీలు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వెళ్లి తమ పూజాదికాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ రావడానికి ఎటువంటి అభ్యంతరం ఉండనక్కరలేదు. వారు అక్కడికి వెళ్లేది పూజావ్యవహారాల కోసమే గాని ఐదేసి పడక గదులను, నాలుగేసి పడక గదులను వినియోగించడానికి కాదు. ఈ వంద కోట్ల ఖర్చు పథకం కేవలం ఆడంబరం చూపుకోవడానికీ, గొప్పలు చెప్పుకోవడానికీ మాత్రమే తప్ప అవసరమూ కాదు, ఉచితమూ కాదు, మాంద్యం సమయంలో ఎంతమాత్రం ఆలోచించదగినదీ కాదు. సరిగ్గా ఈ వందకోట్ల రూపాయల దుర్వినియోగ ఆలోచనను ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడే ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం హైకోర్టులో సాగుతుండగా, కార్మికులకు ఒక నెల జీతాలు ఇవ్వడానికి రూ.47 కోట్లు కావాలంటే తన దగ్గర లేవని ఈ ప్రభుత్వమే నిస్సిగ్గుగా చెప్పింది.
అంటే ఇది నిధుల సమస్యో, మాంద్యం సమస్యో కన్న ఎక్కువగా పాలకుల ప్రాధాన్యతల సమస్య, ప్రజానుకూల ఆలోచనల సమస్య, తమ ఆడంబరాలనూ, ప్రగల్బాలనూ చాటుకోవడం మీదనే శ్రద్ధ చూపుతున్న సమస్య. మహమ్మారిలాగ ముంచుకొస్తున్న మాంద్యం పట్ల బాధ్యతాయుతమైన ప్రభుత్వ వైఖరి అంత నిష్పూచీగా ఉండగా, తెలంగాణలోని నయా మధ్యతరగతి వర్గం, వినియోగానికి తగిన వనరులున్న వర్గం, అక్రమ సంపాదనల వర్గం అంతకన్న నిష్పూచీగా ప్రవర్తిస్తున్నది. మాంద్యం వల్ల ఆర్థిక వ్యవస్థకూ, సమాజానికీ, తమకూ ఎంత గడ్డు పరిస్థితులు రానున్నాయో ఎంత మాత్రం ఆలోచన లేకుండా కనీసం మద్యం, రియల్‌ ఎస్టేట్‌రంగాల్లో వారు పెడుతున్న ఖర్చులు ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారుస్తున్నాయి. నూతన సంవత్సరాది ఒక్కరోజునే రూ.400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రోజుల్లో కన్న ప్రస్తుతం మద్యం అమ్మకాల మీద ఆదాయం 26శాతం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ గొప్పలు చెప్పుకుంటున్నది. అలాగే వాస్తవికమైన గణాంకాలు ఎంత మాత్రం దొరకని, కేవలం ఒకానొక భాగాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఆదాయాల ద్వారా మాత్రమే అంచనా వేయగలిగిన రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడ మాంద్యంతో సంబంధం లేకుండా పెరుగుతున్నదని వార్తలు వస్తున్నాయి. దీనిలో అధికభాగం అక్రమ సంపాదన గనుక, కొంత భాగం మధ్యతరగతి స్థిరాస్తి ఆకాంక్ష గనుక ఇది పెరుగుతుండడంలో ఆశ్చర్యం లేదు. అది మాంద్యం లేదనడానికి సూచిక కూడ కాదు. మొత్తం మీద ‘బంగారు తెలంగాణ’లో మాంద్యంతో సంబంధంలేని ముడుపులు, మద్యం, రియల్‌ ఎస్టేట్‌ ప్రవహిస్తున్నా యన్నమాట.

సెల్‌: 9848577028