-ఎంఎస్‌ఎంఈలకు రుణాలపై లేని స్పష్టత

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించడానికి ”ఆత్మనిర్భర్‌ భారత్‌” పేరుతో ప్రధాని మోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టు గతనెల 12న తెలిపారు. ఆ మరు సటి రోజు నుంచి కొన్ని రోజుల పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్యాకేజీకి సం బంధించిన వివరా లను వెల్లడించారు. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.3 లక్షల కోట్లను నిర్మల ప్రకటించారు. దీంతో నష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలు గట్టెక్కుతాయని ప్రభుత్వ వర్గాలు ఆశలు రేకెత్తించాయి. అయితే వాస్తవానికి ఎంఎస్‌ఎంఈలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ విషయంలోనే కేంద్రానికి ఎలాంటి స్పష్టతా లేదు. భారాన్నంతా బ్యాంకులపై మోపి మోడీ సర్కారు చేతులు దులుపుకుంటున్నది. గందరగోళంగా ఉన్న ఈ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు రుణాలు కల్పించే విషయంలో బ్యాంకులపై కేంద్రం ఒత్తిడిని పెంచుతోంది. ఒకవైపు రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు కేంద్రం చెబుతోంది. దీంతో అత్యవసర రుణ సదుపాయాలను పొందడం కోసం ప్రమోటర్లు క్యూలో నిలబడుతున్నారు. కానీ, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో స్పష్టత లేకపోవడంతో దాని అమలుతీరు బ్యాంకులకు కష్టంగా మారింది.

కేంద్ర ప్రకటించిన పథకంలో లోపాలు చాలా ఉన్నాయి. నూతన రుణ విధానానికి బ్యాంకు బోర్డు డైరెక్టర్ల ఆమోదం అవసరం. అయితే, ఈ పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం గమనార్హం. పథకానికి సంబంధించి ఏవైనా అనుమానాలు, ప్రశ్నలు ఉంటే వాటి నివృత్తి, పరిష్కారం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఆర్థిక మంత్రిత్వశాఖను సంప్రదించాల్సిందిగా కేంద్రం తెలిపింది. ఈ పథకాన్ని కేంద్రం గతనెల 13న ప్రకటించి చివరకు 26న నోటిఫై చేయడం కేంద్రం నిబద్దతకు అద్దం పడుతున్నది. అయితే రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీ లక్ష్యాన్ని జూన్‌ చివరినాటికి చేరుకోవాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకు బ్యాంకులపై కేంద్రం ఒత్తిడిని పెంచుతుండటం గమనార్హం. ఇటు షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ పైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నియంత్రించే అధికారం కలిగి ఉంటుంది.

రుణ సదుపాయాలకు సంబంధించి విధివిధానాలను ఆర్బీఐ నిర్దేశిస్తుంది. కానీ, ఎంఎస్‌ఎంఈలకు రుణ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌(డీఎఫ్‌ఎస్‌) రూపొందించడం ఇదే తొలిసారి. ఆర్బీఐని కాదని కేంద్రం ఇందులో కలుగజేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం కింద ఎంఎస్‌ఎంఈలు రూ.25 కోట్ల వరకు రుణాలతో పాటు అదనంగా 20శాతం రుణాలను పొందొచ్చు. అయితే ఇది ఇప్పటికే ఉన్న ఆర్బీఐ రుణ విధానానికి విరుద్ధం. అంతేకాకుండా వాటిని నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)లుగా పరిగణిస్తారా లేదా అన్నదీ ప్రశ్నార్థకమే. కాగా, దేశంలో ఇప్పటికే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు ఇబ్బందులో ఉన్నాయి. ఈ సమయంలో వాటిపై అత్యవసర రుణ పథకాన్ని రుద్దడం వాటికి తలకు మించిన భారమే.

ఈనెల 23న నిర్వహించిన సమావేశంలో నిర్మల మాట్లాడుతూ.. సీబీఐ, సీవీసీ, కాగ్‌(మూడు ‘సీ’లు)లకు భయపడకుండా అర్హులైనవారికి రుణాలు కల్పించాలంటూ బ్యాంకులను కోరడం గమనించాల్సిన అంశం. అంటే బ్యాంకులపై కేంద్రం ప్రస్తుతం చేస్తున్న పెత్తనం చూస్తే భవిష్యత్తులో ఆర్బీఐ అధికారాలను ఆర్థిక మంత్రిత్వశాఖ బలవంతంగా తీసుకోనుందా? నిర్మల చెప్పిన మూడు ‘సీ’ ల వెనుక మర్మం బ్యాంకులను బెదిరించడమేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై మోడీ సర్కారు చర్యలు మాత్రం ఇలాంటి అనుమానాలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయనీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Courtesy Nava Telangana