ఎర్రగడ్డ/హైదరాబాద్‌ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో రవికుమార్‌ అనే యువకుడు సెల్ఫీవీడియో తీసి, ఆ తర్వాత ప్రాణాలొదలడాన్ని మరవక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. తాజాగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో మెకానిక్‌గా పనిచేసే సయ్యద్‌ వసీం అహ్మద్‌ ఈ నెల 26న కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరగా.. సోమవారం ఉదయం 5 గంటలకు మృతిచెందాడు. అతడు చనిపోవడానికి ముందు.. తనను పట్టించుకునేవారెవరూ లేరంటూ ఓ సెల్ఫీ వీడియోను తన భార్యకు పంపాడు. ‘‘ఇక్కడెవరూ లేరు.. (వార్డులోని ఖాళీ బెడ్లను చూపిస్తూ..) చూడు.. నేను తప్ప ఎవరూ లేరు. ఎవరూ లేరురా..! నేను ఒంటరిగా ఉన్నాను. నువ్వే నిర్ణయం తీసుకో. నేనెలా ఉండాలి ఇక్కడ? (జరగరానిది) ఏమైనా జరిగితే?’’ అంటూ ఉర్దూలో అతడి భార్యకు సెల్ఫీ వీడియో పంపాడు. ఆ తర్వాత కాసేపటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సయ్యద్‌కు శ్వాస సమస్యలు తీవ్రమైనా.. వైద్యులెవరూ పట్టించుకోలేదని, ఆక్సిజన్‌ పెట్టి, వదిలేశారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చేరీచేరగానే 10-15 ఇంజక్షన్లు ఎందుకిచ్చారని వైద్యులను ప్రశ్నించారు. మృతదేహాన్ని అప్పగించడంలోనూ తీవ్ర ఆలస్యం చేశారని విమర్శించారు. కాగా.. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం రికార్డులను పూర్తిచేసి, మృతదేహాన్ని అప్పగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. సయ్యద్‌కు ఊపిరితిత్తులతోపాటు గుండెపైనా కరోనా వైరస్‌ ప్రభావం చూపడంతో మృతిచెందాడని వివరించారు.

Courtesy Andhrajyothi