జార్ఖండ్‌లో మూకదాడికి గురై మరణించిన తబ్రీజ్‌ అన్సారీ కేసులో 11మంది నిందితులపైనా హత్యారోపణలు ఎత్తివేయాలని అక్కడి పోలీసులు నిర్ణయించారు. ఈ 22ఏళ్ళ యువకుడి మరణానికి గుండెపోటు కారణమని తుది మెడికల్ రిపోర్టు నిర్థారించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దాడిచేసిన మందకు తబ్రేజ్‌ను చంపాలన్న ఉద్దేశం లేనందునా, మరోవైపు అతడు గుండెపోటుతో మరణించాడని మెడికల్‌ బోర్డు నిర్థారించినందునా కేసు ఐపీసీ 302 నుంచి 304కు మారింది. ఈ రెండు సెక్షన్ల మధ్యా నిందితులకు పడే శిక్షల్లో హస్తిమశకాంతరం ఉంది మరి.

తబ్రీజ్ దురదృష్టవంతుడు. అదృష్టాన్ని వెతుక్కుంటూ సాగించిన ప్రయాణం అర్థంతరంగానే ముగిసిపోయింది. అమ్మానాన్నను కోల్పోయి, మేనమామల పెంపకంలో పెరుగుతూ గ్యారేజీలో పనిచేసుకొనే ఇతడు ఆ తరువాత పూనేలో బతుకు తెరువు వెతుక్కున్నాడు. నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. ఈ మందకు చిక్కి ఉండకుంటే, మర్నాడే నిక్షేపంగా భార్యతో సహా పూనే వెళ్ళి సుఖంగా ఉండేవాడు. రైలు టిక్కెట్లు ‍కొనుక్కొని, లగేజీ సర్దుకొని, చివరగా తనను పెంచిన తల్లిలాంటి ఆమెకు ఓ మాట చెప్పిపోదామని మిత్రులతో సహా పొరుగూరికి పోవడం, మోటార్‌ సైకిల్‌ దొంగను గాలిస్తున్న ఓ మందచేతికి చిక్కడం తబ్రీజ్‌ జీవితాన్ని అర్థంతరంగా ముగించేసింది. వారు స్తంభానికి కట్టేసి కొడుతున్నప్పుడు, తన మతం తెలిస్తే మరణం ఖాయమని గ్రహించి, మొదట తన పేరు సోను అని చెప్పాడట. అసలు పేరు చెప్పాక మరిన్ని దెబ్బలు తిన్నాడు. జైశ్రీరామ్‌, జై హనుమాన్‌ అని ఎన్నిమార్లు పలికినా ఉపయోగం లేకపోయింది. పన్నెండు గంటలపాటు దెబ్బలు తిని, ఆ తరువాత పోలీసులు మోపిన దొంగతనం నేరంమీద జైల్లో మగ్గి, నాలుగురోజుల తరువాత ఆసుపత్రికి చేరేసరికే అతడి ప్రాణం పోయింది.

తబ్రీజ్‌ మీద దాడి మన ప్రధానిని సైతం కదిలించింది. కాకపోతే ఆయన ఈ ఘటనను విపక్షాలు జార్ఖండ్‌ను ‘లించింగ్‌ స్టేట్‌’ అంటున్నందుకు ఆగ్రహించడానికీ, దేశంలో సాగుతున్న మతోన్మాద, విద్వేషపూరిత మూకహింసనూ కేరళ, బెంగాల్‌ రాష్ట్రాల్లోని రాజకీయ హింసనూ ఒకేగాటన కట్టేయడానికీ వాడుకున్నారు. తబ్రీజ్‌ పేరు, మతం, మూకదాడి వంటి పదాలేమీ వాడకుండా జాగ్రత్తపడుతూ ఏలినవారే ఇటువంటి ఘటనలను సాధారణీకరిస్తే పోలీసులు మాత్రం ఎందుకు ఆయాసపడతారు? ఆ తరువాత పార్లమెంటులో విపక్ష నేతలు ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు అధికారపక్ష సభ్యులు ‘జై శ్రీరామ్‌’ అని నినదించిన అద్భుత దృశ్యాన్ని కూడా దేశం చూసింది. తబ్రీజ్‌కు మరణానంతర న్యాయం కూడా దక్కదన్న అనుమానాలు ఆరంభంనుంచీ ఉన్నవే. తలకు బలమైన దెబ్బతగిలి బ్రెయిన్‌ హెమరేజ్‌తో చనిపోయాడని అటాప్సీ చేసిన వైద్యులు తొలుత నిర్థారించారు. అప్పుడు హత్య కేసుగా నమోదైనప్పటికీ, ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని మెడికల్ బోర్డు తుది నివేదిక అందాల్సిన ఉన్నదని అప్పట్లోనే అన్నారు. మూడునెలల తరువాత ఈ నివేదిక అందిన నేపథ్యంలో సెక్షన్లు తారుమారైనాయి. మెడికల్‌ బోర్డు తేల్చినట్టు నిందితుడు గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చు. కానీ, అది అల్లరి మూక దాడి వల్ల, తీవ్రగాయాల పాలైన మనిషికి సత్వరమే ఆసుపత్రిలో చికిత్స దొరక్క మానసిక ఒత్తిడి వల్ల సంభవించింది కాదా? రక్తం ఓడుతున్న మనిషిని ఆసుపత్రికి బదులు జైలులో కుక్కిన పోలీసులు ఇందుకు బాధ్యులు కారా? దాడికీ, మరణానికీ సంబంధం ఉన్నదని నిర్థారించే ఆధారాలు లేనందునా, దాడికి పాల్పడిన మందకు హత్యచేసే ఉద్దేశం లేనందునా సెక్షన్లు మార్చామని అనడం సమంజసమేనా? హత్యారోపణకు సంబంధించిన కీలకమైన సెక్షన్‌ తొలగించినందున రేపు న్యాయస్థానాల్లో మిగతా సెక్షన్లన్నీ ఒకవేళ నిలిస్తే నిందితులకు మరణశిక్ష బదులు మహా అయితే పదేళ్ళ జైలు శిక్షపడుతుంది. ‘లించింగ్‌ స్టేట్‌’ అంటున్నవారిపై ఎదురుదాడి చేస్తూ, తమకు అండగా నిలుస్తున్న పాలకుల మనోభీష్ఠానికి వ్యతిరేకంగా జార్ఖండ్‌ పోలీసులు వ్యవహరించదల్చుకోలేదు. రాజస్థాన్‌ పాడిరైతు పెహ్లూఖాన్‌ను గోరక్షకులు నడిరోడ్డుమీద కొట్టిచంపిన అమానుష ఘట్టాన్ని దేశమంతా చూసినప్పటికీ, ఇటీవలే ఆళ్వార్‌ న్యాయస్థానం ఆరుగురు నిందితులనూ వదిలేసింది. అతడి ఒంటిమీద ఉన్న గాయాలు ఆవుల్ని ట్రక్కులో ఎక్కిస్తున్నప్పుడు ఏర్పడినవే తప్ప ఎవరో కొట్టినవి కావనీ, పలు రోగాలున్న పెహ్లూఖాన్‌ గుండెపోటుతోనే మరణించాడన్న వాదనలే న్యాయస్థానంలో చివరకు నిలిచాయి. మూకదాడి కేసులన్నీ ఇలా నీరుగారిపోతుంటే ఉన్మాదుల వీరంగానికి అడ్డూఆపూ ఉంటుందా?

(Courtacy Andhrajyothi)