– ఆ రెండింటికే నిధులు
– 2021 మార్చి దాకా అంతే..
– ఆదాయాలు పడిపోవడంతో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా కుదేలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలేమీ ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో కరోనా నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించారు. ఇదివరకే ప్రకటించి ఉన్న ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనా (పీఎంజీకేవై), ఆత్మ నిర్భర భారత్‌, తదితర ప్రత్యేక పథకాలకు మినహా మిగిలిన వాటికి నిధుల కేటాయింపు ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే బడ్జెట్‌ ఆమోదంపొంది ఉన్న ఇతర పథకాలకు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నిధులు నిలిపివేస్తున్నట్టు ఆమె తెలిపారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞాపనలు పంపొద్దనీ, అనుమతి లేనిదే వాటిని అనుమతించకూడదని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ విభా గాలకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వ ప్రాధామ్యాలు మారిన క్రమంలో.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనీ, వ్యయాలను తగ్గించుకోవాలని కేంద్రం అన్ని శాఖలకు సూచించింది.

Courtesy Nava Telangana