– రైల్వేల్లో భారీ ఎత్తున వ్యయ నియంత్రణ
– కొత్తగా పనులు వద్దు… లాభాలు రాని మార్గాలు పక్కకు
-అన్ని జోన్లకు రైల్వేబోర్డు ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ: మోడీసర్కార్‌ రైల్వేశాఖలో భారీ వ్యయ నియంత్రణకు తెరలేపింది. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని, లాభదాయకంగాని రైల్వే మార్గాలను పక్కకు పెట్టాలని అంటూ రైల్వే బోర్డు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని జోన్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆదాయం పెంచుకోవటంపై దృష్టిసారించాలని, కొత్తగా కాంట్రాక్ట్‌ పనులు, వస్తువుల సేకర ణ వంటివి చేపట్టరాదని తన ఆదేశాల్లో ప్రొడక్షన్‌ యూనిట్లకు రైల్వేబోర్డు తెలిపింది. టికెట్‌ కౌంటర్లను సాధ్యమై నంతగా తగ్గించటం, జనరల్‌ మేనేజర్‌, డివిజనల్‌ మేనేజర్ల పర్యటనలు తగ్గించుకోవటం వంటి చర్యలు ఉండబోతున్నా యని సమా చారం. అన్ని విభాగాల్లో సాధ్యమైనంతగా తక్కువ సిబ్బందితో విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధి కారులకు ఆదేశాలు జారీచేశారు. రైల్వే పనుల్లోనూ కోతలకు రంగం సిద్ధం చేశారు. ఆన్‌బోర్డ్‌ హౌస్‌ కీపింగ్‌ సేవలు,స్టేషన్‌ క్లీనింగ్‌, లిఫ్ట్‌లు, ఎస్క్‌లేటర్ల నిర్వహన…మొదలైనవాటిపై సమీక్ష జరపాలని రైల్వే బోర్డు అన్ని జోన్లను ఆదేశించింది. కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు జరపరాదని, పనులు చేపట్టరాదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులను పరిశీలించుకొని కొనసాగుతున్న కాంట్రక్ట్‌ పనులు జరపాలని తెలిపారు.

లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 12వేల ప్యాసింజర్‌ రైళ్లు తిరిగేవి. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా కేవలం 213 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైళ్లను ఆగస్టు 12వరకు రద్దు చేశారు. అప్పటివరకు రాష్ట్రాల డిమాండ్‌మేరకు శ్రామిక్‌ రైళ్లు మాత్రమే నడిచే అవకాశముంది. మే 1 నుంచి ఇప్పటివరకూ 4596 శ్రామిక్‌ రైళ్లు 62.8లక్షలమంది ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చాయని అధికారులు తెలిపారు. కోవిడ్‌-19 కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ముందు ముదు కొన్ని ప్రత్యేకమార్గాల్లో మాత్రమే రైళ్లను నడిపే ఉద్దేశముందని రైల్వే మంత్రిత్వశాఖలో ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు.

Courtesy Nava Telangana