ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్‌ వేసిన యువకుడు
పీఎంకేవీవై కింద శిక్షణ పూర్తిచేసిన అన్నదాత ఆవేదన

‘నాకు తక్షణం డబ్బు అవసరమున్నది. నా కిడ్నీ అమ్ముతాను. అవసరమైనవారు సంప్రదించండి…’ అంటూ ఓ యువ రైతు పోస్టర్‌ వేసి మరీ ప్రచారం చేస్తున్నాడు. దేశంలో అన్నదాతల దయనీయమైన స్థితికి అద్దంపడుతున్న ఈ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. సహరన్‌పూర్‌ జిల్లా చత్తర్‌ సలీ గ్రామ వాసి అయిన రామ్‌కుమార్‌ (30) ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) కింద శిక్షణ పూర్తిచేశాడు. పీఎంకేవీవై సర్టిఫికెట్‌ చూపించినా ఏ బ్యాంకు తనకు రుణం ఇవ్వటంలేదని రామ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకులు లోన్‌ నిరాకరించటంతో పశువులు కొనడానికి, వాటికి షెడ్డువేయటానికి దూరపు బంధువుల నుంచి కొంత అప్పుతీసుకున్నాడు. చిన్నగా వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ, ఇప్పుడు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలంటూ వారు ఒత్తిడిచేస్తున్నారనీ రామ్‌కుమార్‌ చెప్పారు.
మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరిగాననీ.. లాభంలేకపోవటంతో మరో గత్యంతరంలేక కిడ్నీ అమ్మేందుకు సిద్ధపడ్డానని పాడి రైతు వాపోయారు. కొనుగోలుదారుల కోసం పోస్టర్‌ కూడా వేయించినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనను సహరన్‌పూర్‌ డివిజనల్‌ కమిషనర్‌ను సంప్రదించగా.. విషయం తనకు తెలియదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తానని చెప్పారు. అలాగే రామ్‌కుమార్‌కు బ్యాంకులు లోన్‌ ఎందుకు తిరస్కరించిందీ ఆరా తీస్తానని చెప్పారు.

(Courtacy Nava Telangana)