కాశ్మీర్కు ఇక సమాచార కమిషన్ ఉండదు..

– అక్కడివారు సెకండ్‌ అప్పీల్‌ కోసం ఢిల్లీకి రావాల్సిందే 
– ఆర్టీఐ బిల్లుకు సవరణలను ముక్తకంఠంతో వ్యతిరేకించాలి 
– ఇంటర్వ్యూలో కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ 
బి.వి.యన్‌.పద్మరాజు
జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇక అక్కడ సమాచార కమిషన్‌ అనేదే ఉండబోదని కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు.. సమాచార నిమిత్తం సెకండ్‌ అప్పీల్‌ కోసం ఢిల్లీకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు వీలుగా కేంద్రం ఆమోదించిన సవరణ చట్టాన్ని దేశ ప్రజలందరూ ముక్తం కంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టంలో సవరణలు, వాటి వల్ల నష్టాలు, జమ్మూ కాశ్మీర్‌ విభజన వల్ల అక్కడి ప్రజలకు సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉంటుందా? లేదా? అనే అంశాలపై శ్రీధర్‌… ‘నవతెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు…

1). ఆర్టీఐకి సవరణలు చేయటం వల్ల రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయని చెబుతున్నారు.. నిజమేనా? 
ఏ రాష్ట్రమైనా తమ సమాచార కమిషన్‌ను తామే నియమించుకునే హక్కును కలిగున్నాయి. కమిషన్‌లోని సభ్యుల జీతం, అధికారం, హోదా, పదవీకాలాలను ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. కానీ వీటిని ఇప్పుడు కేంద్రం నిర్ణయించాలని చెబుతున్నారు. ఆర్టీఐ అనేది ప్రాథమిక హక్కులో భాగం. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాలు సరిగ్గా నడుస్తున్నాయో? లేదోననే దాన్ని చూసే (యాక్సెస్‌ టూ రికార్డ్సు) అవకాశం పరిపాలనకు సంబంధించిన అంశం. ఈ రెండూ రాష్ట్రాలన్నింటిలోనూ, కేంద్రంలోనూ ఉంటాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు కొంత సమాన అధికారాలూ ఉంటాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం, వాటిని అమలు చేసే అధికారమూ రాష్ట్రాలకే ఉండాలి. కేంద్ర సమాచార చట్టాన్ని రాష్ట్రాలు కూడా ఆమోదిస్తున్నాయి. ఎందుకంటే 19 (1-ఏ)ను అవి ఆమోదిస్తున్నాయి గనుక. ప్రాథమిక హక్కు అందరికీ సమానమే. కనుక ఆ చట్టాన్ని అమలు చేసే అధికారం రాష్ట్రాలకూ ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర అధికార ప్రాంతాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనూ ఆర్టీఐని అమలు చేయాలని చట్టం చెబుతున్నది. ఇదే సమయంలో రాష్ట్ర సమాచార కమిషన్లను ఆయా రాష్ట్రాలే నియమించుకోవాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం సమాచార కమిషన్‌ను నియమించిన తర్వాత.. సభ్యుల జీతభత్యాలు, హోదా, పదవీకాలాన్ని కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది? ఇది తప్పుకదా..? ఇక్కడే రాష్ట్రాలు తమ అధికారాలను కోల్పోతున్నాయి.
2). సామాన్యులకు ఇది ఏ రకంగా నష్టం..? 
ప్రతీ రాష్ట్రంలో కొన్ని వందల, వేల మందికి పెన్షన్లు, స్కాలర్‌షిప్పులు, కళ్యాణలక్ష్మి, రైతుబంధులాంటి పథకాలు అందుతున్నాయి. వాటిలో లంచం ఇవ్వకపోతే పనులు జరగలేదనుకోండి. అలాంటి పేదలు ఎక్కడికి పోతారు? నాలుగు వేలు, నాలుగొందలు తీసుకునే వారు ఏం లంచం ఇస్తారండీ….? అలాంటి వారికి దిక్కేంటి? వారికి ఆర్టీఐయే దిక్కు. లంచం ఇవ్వకుండా పనులు చేయించుకునే అధికారాన్ని కల్పించింది సమాచార హక్కు చట్టం. ఇప్పుడు సవరణల వల్ల సామాన్యుడు తన హక్కును కోల్పోతున్నాడు.
3). సవరణలు లేనప్పుడు కూడా ఒక్కోసారి పాత్రికేయులు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నా అధికారులు సమాచారం ఇవ్వలేదు..దీనిపై ఏమంటారు?
90 కేసుల్లో సమాచారం ఇస్తున్నారు. 10 శాతం కేసుల్లో మాత్రం నిరాకరిస్తున్నారు. రాజకీయ నాయకుల శక్తో, లంచం ఇవ్వకపోవటంలాంటివో ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి అంశాలు ముందుకొస్తాయి. అలాంటప్పుడు కోర్టుల వరకూ వాటిని తీసుకెళ్లగలగాలి.
4). సవరణలను వ్యతిరేకించాలంటూ కేసీఆర్‌తోపాటు జగన్‌కు, నవీన్‌ పట్నాయక్‌లకూ లేఖల రాశారు కదా..? మీకు అనుకూలంగా వారు వ్యవహరిస్తారని భావించారా? 
లేదు. నేనేమీ అలా ఆశించలేదు. నేను పార్టీలనూ, ప్రభుత్వాలనూ ప్రశ్నిస్తున్నానని తెలియజెప్పటానికే వారికి ఓపెన్‌ లెటర్లు రాశాను. అయితే వారు రాజకీయ కారణాలతో సవరణలకు ఓకే చెప్పారు. రాజకీయ కారణాలతో రాజ్యాంగ విలువలు కోల్పోకూడదన్నది నా అభిప్రాయం.
5). ఇప్పుడు ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారు? 
ఇప్పటికీ సవరణలను వ్యతిరేకించాలని కోరుతున్నా. ఈ సవరణ తప్పని మనం చెబుతున్నాం. కనీసం దాని దుష్ప్రభావం లేకుండానైనా ప్రభుత్వాలు చూడాలి. పాలకులు ఆ పని చేసినా చేయకపోయినా చర్చ మాత్రం జరగాలని నేను కోరుకుంటున్నా. సవరణ చట్టం ఉన్నా లేకపోయినా జనానికి మాత్రం సమాచారం ఇవ్వాల్సిందేనన్నది నా అభిప్రాయం.
6). కాశ్మీర్‌ విభజనపై మీ అభిప్రాయం..? 
కాశ్మీర్‌ను విభజించటం అరాచకం. దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఎలాగూ లేదు. రాష్ట్ర స్థాయి కూడా లేకుండా చేయటం అన్యాయం. ఆర్టికల్‌ 3 ప్రకారం అక్కడి అసెంబ్లీని, అక్కడి ప్రజలను అడక్కుండా విభజించటానికి వీల్లేదు. కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది చాలా తప్పు. ఇలా చేయటం వల్ల కాశ్మీర్‌ ప్రజలు.. దేశంలోని ఇతర ప్రజలతో ఎలా కలిసిపోతారు? ఎట్లా మమేకమవుతారు? బీజేపీ వాళ్లు కాశ్మీర్‌ను విభజించామని, దేశంలో విలీనం, అంతర్భాగమైందని సంబరాలు చేసుకుంటున్నారు? అలాంటప్పుడు మీరు జనాన్ని అడిగారా? వారు ఒప్పుకున్నారా? వారిని విశ్వాసంలోకి తీసుకున్నారా? ఇలాంటి చర్యలు చాలా తప్పు.
7). విభజన నేపథ్యంలో అక్కడ సమాచార కమిషన్‌ పరిస్థితేమిటి? 
కేంద్ర పాలిత ప్రాంతంలో కమిషన్‌ ఉండదు. కేంద్ర సమాచార కమిషన్‌లోనే ఒకరికి దీన్ని అప్పగిస్తారు? అది కూడా అక్కడి ప్రజలకు ఒక పెద్ద నష్టం. ఒక చిన్న సమాచారం కోసం జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రజలు సెకండ్‌ అప్పీల్‌ కోసం ఢిల్లీకి రావాలి? లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాలి? ఇది అత్యంత దుర్మార్గం.

 

(Courtacy Nava Telangana)

Leave a Reply