హైదరాబాద్‌ సిటీ : హేమంతం వేళ భాగ్యనగర వాసులను పలకరించి, అక్షర పలవరింతల్లో ముంచెత్తే మహోత్సవం ‘హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన’. పుస్తక ప్రియులకు ఆ పదిరోజులూ పెద్ద పండుగ. కవులు, రచయితలు, ప్రచురణకర్తలు, సాహితీప్రియుల మేలు కలయిక బుక్‌ ఫెయిర్‌ వేదిక. పుస్తకావిష్కరణ సభలకూ కేరాఫ్‌. నగరంలో జరిగే పుస్తకమహోత్సవానికి చుట్టుపక్క జిల్లాలనుంచీ సందర్శకులు పోటెత్తుతారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు సైతం కొలువుదీరే హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకి దేశంలోనే అతిపెద్ద మూడో బుక్‌ఫెయిర్‌గా పేరు. మొదటి స్థానంలో ఢిల్లీలోని వరల్డ్‌ బుక్‌ఫెయిర్‌, ఆ తర్వాత కోల్‌కతా బుక్‌ ఫెయిర్‌ ఉన్నాయి. 33ఏళ్లుగా నిర్విఘ్నంగా సాగుతోన్న హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కి ఈ ఏడాది బ్రేక్‌ పడనుంది. కొవిడ్‌ కారణంగా బుక్‌ఫెయిర్‌కి ప్రభుత్వ అనుమతి లభించలేదని సమాచారం. బుక్‌ఫెయిర్‌ ప్రాంగణానికి నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు, అందులోనూ చలికాలం కావడంతో కరోనా మరింత ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇలాంటి జనసమ్మర్ధ కార్యక్రమాలకు అనుమతించేందుకూ ప్రభుత్వాధికారులు వెనకాడుతున్నట్లు సమాచారం.

మూడు నెలల ముందే…
ప్రతిఏటా డిసెంబర్‌ వచ్చిందంటే, నగరంలో పుస్తక ప్రియుల సందడి షురూ అవుతుంది. అప్పటికే చాలామంది కవులు, రచయితలూ కొత్త పుస్తకాలను సిద్ధంచేసుకుంటారు. అందులోనూ తమ రచనా వ్యాసంగానికి లాక్‌డౌన్‌ను అనువుగా మలుచుకున్న రచయితలు బోలెడు. బుక్‌ఫెయిర్‌ నాటికి పుస్తకం పూర్తి చేయాలని సంకల్పించేవాళ్లూ చాలామందే. ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌ జాడలేకపోవడంతో రచయితల ఆశలకు గండి పడినట్లైంది. ప్రతిఏటా సుమారు రూ.4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల పుస్తక క్రయవిక్రయాలకు బుక్‌ఫెయిర్‌ కేంద్రం. ఈ ఏడాది అసలే అమ్మకాలు తక్కువ, దానికితోడు పుస్తక ప్రదర్శన కూడా లేకపోవడంతో ప్రచురణ కర్తలు, బుక్‌హౌస్‌ నిర్వాహకుల్లోనూ నిరుత్సాహం ఆవరించింది. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో ప్రతిఏటా దాదాపు 150 ప్రచురణ సంస్థల వరకూ పాల్గొంటాయి. అందులో సుమారు 300పై చిలుకు స్టాళ్లు ఉంటాయి. అంతకు ముందు మూడు నెలల నుంచే అమ్మకందారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, అనుమతి, ఖరారు వంటి పనులు మొదలవుతాయి. అయితే, ఇప్పటివరకూ అలాంటివేవీ మొదలుకాకపోవడం కూడా ఈ ఏడాది బుక్‌ఫెయిర్‌ లేదనడానకి ఒక నిదర్శనం. అయితే, నిర్వహణ కమిటీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రభుత్వం కొవిడ్‌ నూతన మార్గదర్శకాలతో బుక్‌ఫెయిర్‌కు అనుమతి ఇచ్చినా, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మాత్రమే పుస్తక ప్రదర్శన నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మొదలవ్వాల్సిన భువనేశ్వర్‌ పుస్తక ప్రదర్శననూ కొవిడ్‌ కారణంగా రద్దు చేసినట్లు సమాచారం.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మాత్రం…
ఇదిలా ఉండగా, ఎనభై ఏళ్లుగా ప్రతియేటా జనవరి ఒకటిన ప్రారంభమయ్యే నాంపల్లి ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని సొసైటీ ట్రెజరరీ వినయ్‌ చెబుతున్నారు. బెంగళూరులో ఒక అమ్యూస్మెంట్‌ పార్కుతో పాటు ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌కూ కర్ణాటక ప్రభుత్వం కొవిడ్‌ ప్రత్యేక మార్గదర్శకాలతో అనుమతించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ప్రవేశ టికెట్టును పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడం, మాస్కు తప్పనిసరి చేయడం, గంటగంటకూ పరిమిత సంఖ్యలో సందర్శకులను అనుమతించడం, నిత్యం పరిసరాలను శానిటైజ్‌ చేయడం వంటి నిబంధనలున్నాయి. అలాంటి ప్రత్యేక నిబంధనలతో బుక్‌ఫెయిర్‌కూ అనుమతించాలని కొందరు పుస్తకప్రియులు, ప్రచురణకర్తలు కోరుతున్నారు.

Courtesy Andhrajyothi