• 16 నెలలుగా కీలక పోస్టు ఖాళీ

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సంస్థ ఎండీ పోస్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 16 నెలలుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సంస్థను నిర్వీర్యం చేసే దురుద్దేశంతోనే ఎండీని నియమించడం లేదని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీలో కీలక పదవులు ఖాళీగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. ఇన్‌చార్జితో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌ అడ్వయిజర్‌ పోస్టులు కీలకం. 2018 జూన్‌ 15 వరకు ఎండీగా రమణరావు ఉన్నారు. నాలుగేళ్ల క్రితమే ఆయన పదవీ విరమణ చేసినా ప్రభుత్వం ఆయననే కొనసాగిస్తూ వచ్చింది. 2018 జూన్‌ తర్వాత ఆయనకు పొడిగింపు ఇవ్వలేదు. దాంతో ఎండీ పోస్టు 16 నెలలుగా ఖాళీగా ఉంది. సాధారణంగా ఆర్టీసీకి ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారిని ఎండీగా నియమిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఐఏఎస్‌, ఐపీఎస్‌ బదిలీలు చేపట్టినా ఆర్టీసీకి మాత్రం ఎండీని నియమించడం లేదు.

ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ ఇన్‌చార్జి ఎండీగా కొనసాగుతున్నారు. ఆయన రవాణా శాఖతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇలా జోడు పదవులు ఉన్న వ్యక్తికే ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా ఆయన ఏ పదవికీ న్యాయం చేయలేని, ఆర్టీసీలో సత్వర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత సమ్మె కాలంలో ఎండీ లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే అధికారి లేకుండాపోయారు. ఆర్టీసీలో మరో కీలకమైన ఆర్థిక సలహాదారు (ఫైనాన్స్‌ అడ్వయిజర్‌) పోస్టు ఖాళీ అయింది. ఈ పోస్టులో ఉన్న స్వర్ణ శంకరన్‌ 2018 అక్టోబరులో రాజీనామా చేశారు. దాంతో రమేష్‌ అనే అధికారి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ పోస్టులో మరో ఆర్థిక నిపుణుడిని నియమించాల్సి ఉంది. రెండు కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆర్టీసీలో పాలన స్తంభిస్తోంది.

Courtesy Andhra Jyothy