• అమెరికాలోకి వాళ్లకు నో ఎంట్రీ !
  • వామపక్ష, నిరంకుశ పార్టీల సభ్యులైన విదేశీయులు అమెరికా ప్రవేశానికి అనర్హులు
  • 1952 నాటి చట్టం పటిష్ఠ అమలుకు 
  • తాజాగా విధాన మార్గదర్శకాలు విడుదల

వాషింగ్టన్‌ : అమెరికా అంటే అవకాశాల గడ్డ! ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా ఆ దేశానికి వెళ్లొచ్చు!! కానీ.. షరతులు వర్తిస్తాయి! ఏ దేశానికి చెందినవారైనా సరే.. వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు లేదా నిరంకుశ అధికారం చలాయించే తరహా పార్టీల సభ్యులు అయితే మాత్రం ఇకపై వారికి అమెరికాలో అడుగుపెట్టడానికి దారులు మూసుకుపోయినట్టే. తమదేశంలో ప్రవేశానికి ‘కమ్యూనిస్టు/నిరంకుశ పార్టీల సభ్యత్వమే’ అనర్హతగా పేర్కొంటూ.. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) తాజాగా విధాన మార్గదర్శకాల పత్రాన్ని జారీ చేసింది. నిజానికి, కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ 1952లోనే చట్టం చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని కఠినంగా అమలు చేసేలా విధాన మార్గదర్శకాలను పటిష్ఠం చేశారు. అమెరికా భద్రత కోసమే ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

వాణిజ్యం, హాంకాంగ్‌ భద్రత చట్టం, జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో వీఘర్‌ ముస్లింలపై ఉక్కుపాదం లాంటి అంశాల్లో చైనాతో పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. అమెరికా లక్ష్యం చైనానే అయినా.. దీని ప్రభావం భారత్‌ సహా, ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీ సభ్యులపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాగా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలో చేరినవారికి మినహాయింపు ఉంటుందని 1952 చట్టంలోనే పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడూ కొనసాగిస్తారు.

Courtesy Andhrajyothi