ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గం కూర్పులో సామాజిక న్యాయం సమకూర్చినట్లు పెద్దయెత్తున ప్రచారం సాగుతోంది. కానీ, బి.సి.లకు అది దక్కలేదు.

మొత్తం 25 మంది మంత్రులలో బి.సి.లు 8 మంది వున్నారని లెక్కచూపుతోన్నారు. వీరిలో ముస్లిం మైనారిటీలకు కేటాయించిన మంత్రిని గూడా లెక్కలో కలుపుతోన్నారు. ఒక వైపున 5 గురు ఉపముఖ్యమంత్రుల్లో గూడా ఒక మైనారిటీగా లెక్కచూపుతూ, ఆయన్ని మంత్రుల జబితాలో బి.సి.ల్లో కలిపి చూడాలంటూ వాదిస్తోన్నారు. ఇది అంకెల, మాటల గారడీ అవుతుంది.

బి.సి. మంత్రుల జాబితాలో ధర్మాన కృష్ణదాసును, బొత్స సత్యనారాయణలను కలిపారు. వాస్తవానికి, వీరిద్దరి కులాలు ప్రభుత్వ జాబితాలో బి.సి.లుగా పేర్కొని వున్నా, అవి టెక్నికల్ బి.సి.లే తప్ప, కుల వివక్షకు గురైన, నిజమైన బి.సి.కులాలు కాదు. వారి కులాలు పోలినాటి వెలమ, తూర్పు కాపులు ఏనాడూ కుల వృత్తుల కారణంగా సమాజంలో హీనంగా చూడబడినవి కావు. వారిని తమ తమ ప్రాంతాల్లో భూస్వామ్య, వ్యవసాయ కులాలే. బొత్స సత్యనారాయణ కాపుల్ని బి.సి.ల్లో చేర్చాలనే ముద్రగడ పద్మనాభం ఆందోళనను బాహాటంగానే బలపరిచారు. వీరిద్దరిని కూడా మినహాయిస్తే ఇక మిగిలిన బి.సి. మంత్రులు ఐదుగురే.

YS Jagan AP CMసామాజిక న్యాయం అంటే ప్రతి సామాజిక వర్గానికీ వారివారి జనాభా దామాషా ననుసరించి ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రాతినిధ్యాలు, వాటాలు ఒక హక్కుగా దక్కటమే. రాష్ట్రంలో బి.సి.లు 52 శాతం వున్నారని మురళీధరరావు కమిషన్ చెప్పింది. సామాజిక న్యాయం సూత్రం ప్రకారం వారికి కనీసం 13 మంత్రి పదవులు దక్కాలి. కానీ, అందులో సగం కూడా దక్కలేదు. ఐదు మాత్రమే లభించాయి. మరో 8 స్థానాలు రావాల్సి వుంది. అదే సమయంలో 10 శాతం జనాభా గూడాలేని కాపులకు అధికారయుతంగా యిచ్చిన 4తోబాటు బొత్స సత్యనారాయణని గూడా కలుపుకుంటే వారికి 5 మంత్రి పదవులు లభించాయి. ఎక్కువలో ఎక్కువగా జనాభా 20శాతం వున్నారనుకుంటే, ఎస్.సి.లకు గూడా 5 మంత్రి పదవులు లభించాయి. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, 10 శాతంలోపు వున్న కాపులకు 5 స్థానాలు, 20 శాతం వున్న ఎస్.సి.లకు 5 స్థానాలు, కేవలం 5 శాతంగా వున్న రెడ్డి సామాజిక వర్గానికి గూడా ముఖ్యమంత్రి పదవి గూడా కలుపుకుంటే 5 స్థానాలు, 50 శాతం పైగా వున్న బి.సి.లకూ 5 స్థానాలే లభించాయి. ఒక ప్రధానమైన చేతివృత్తి గలిగిన చేనేతలకు మంత్రివర్గంలో స్థానమే లేదు. అలాగే మరి కొన్ని ఎం.బి.సి.లకు గూడా మంత్రి పదవులు లభించలేదు. ఇక మరి బి.సి.లకు సామాజిక న్యాయం లభించినట్లేనా?

Y.K, Senior Advocate
కన్వీనర్సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్
సెల్ : 9849856568,
Email: ykadvocategnt@gmail.com