హైదరాబాద్‌ : రాజ్యసభ చరిత్రలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రె్‌సకు ప్రాతినిధ్యం కొరవడనుంది. ప్రస్తుతం ఏపీ నుంచి మహమ్మద్‌ అలీఖాన్‌, టి.సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్‌రావు కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్‌ 9న ముగియనుంది. తాజాగా ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఒక్క నామినేషనూ పడలేదు. అంటే..ప్రస్తుతం ఉన్న ముగ్గురి పదవీ కాలం ముగియగానే ఏపీ, తెలంగాణ నుంచి రాజ్యసభలో కాంగ్రె్‌సకు ప్రాతినిధ్యం ఉండదు. ఇది రాజ్యసభ చరిత్రలోనే మొదటిసారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత అప్పటివరకూ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ ఎంపీలనూ ఏపీ, తెలంగాణకు కేటాయించారు. అయితే, పలువురు సభ్యుల పదవీ కాలం ముగియడం, కొత్తగా రాజ్యసభ సభ్యులను గెలిపించుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సకు ఇరు రాష్ట్రాల్లోనూ లేకపోవడంతో క్రమంగా సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను నామినేషన్‌ను ప్రతిపాదించడానికి కాంగ్రె్‌సకు ఎమ్మెల్యేలే లేరు. తెలంగాణలోనూ నామినేషన్‌ దాఖలు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం లేదు. నామినేషన్‌ను ప్రతిపాదించడానికి పది మంది ఎమ్మెల్యేల అవసరం ఉండగా.. కాంగ్రె్‌సకు ఆరుగురు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలనూ ఇక్కడి ఎమ్మెల్యేల బలంతో రాజ్యసభకు పంపేవారు. అలాంటి పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేని పరిస్థితికి చేరుకోవడం విశేషం.

Courtesy Andhrajyothi