హైదరాబాద్‌, అక్టోబరు 2: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. 4 వారాల్లోగా సవివరంగా కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి సునీతా కృష్ణన్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. బాలల న్యాయ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలోనూ పిల్లల సంరక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది అన్నారు. రాష్ట్రంలో 23 జిల్లాల్లో బాలల సంరక్షణ కమిటీలు లేవని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది తెలిపారు. ఈ వ్యాజ్యంలో వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.

Courtesy Andhra Jyothy…