Image result for ‘కైలాసం’ సృష్టిస్తి రామాహరీ.."కొత్త లోకాలే చూపిస్త రామాహరీ..
నిత్యానంద స్వామి సరికొత్త లీల
దక్షిణ అమెరికాలోని ఒక ద్వీపంలో సొంత దేశం ఏర్పాటు
సొంత జెండా, రాజ్యాంగం.. 
10 శాఖలు, ప్రధాని, కేబినెట్‌
అక్కడి నుంచి 11 దిశల్లోకి.. 
14 లోకాలలోకి ఉచిత ప్రవేశం
అందుకు ప్రత్యేక పాస్‌పోర్టు!..
గుర్తింపు కోసం ఐరాసతో చర్చ

స్వయం ప్రకటిత దేవుడు.. రేప్‌ కేసు నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్న స్వామి నిత్యానందగుర్తున్నాడా? ఆయన ఇప్పుడు తన కోసం, తన అమాయక భక్తుల కోసం.. కైలాసపేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్నే సృష్టించుకున్నాడు! దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం కైలాసతరఫున ఆ దేశ (?) న్యాయప్రతినిధులు ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు!! ఆ దేశానికి సంబంధించి ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌ (కైలాస డాట్‌ ఆర్గ్‌) కూడా రూపొందించారు.

న్యూఢిల్లీ: ‘కైలాస.. రివైవింగ్‌ ద ఎన్‌లైటెన్డ్‌ సివిలైజేషన్‌.. ద గ్రేట్‌ హిందూ నేషన్‌’ పేరుతో నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ దేశం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌కు సమీపంలో ఉంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనేసుకున్న నిత్యానంద.. ఆ దీవిలో తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసి, సొంత జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం, రాజ్యాంగం.. ఇలా అన్నింటినీ రూపొందించుకున్నాడు. ఆ దేశానికి ఆయనే రాజు. పాలన కోసం ప్రధానమంత్రిని, మంత్రిమండలిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ‘కైలాస’వాసులు కావాలనుకునేవారికి ఒక బంపర్‌ ఆఫర్‌ ఉంది. అదేంటంటే.. ఆ దేశానికి విరాళాలివ్వడమే! పైసలిస్తే పౌరసత్వ పథకం అన్నమాట!! అలా పైసలిచ్చినవారికి పాస్‌పోర్టులు ఇస్తారు. ఆ దేశ పాస్‌పోర్టు, పౌరసత్వం లేకపోయినంత మాత్రాన దిగులు చెందక్కర్లేదండోయ్‌..! ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. హిందూయిజాన్ని ఆచరించలేకపోతున్న హిందువులైతే చాలు. ఆ దేశ పౌరులేనట. ఆ దేశం.. హద్దులే లేని దేశమట.

రెండు రంగుల పాస్‌పోర్టులు..
మనం ఫలానా దేశ పౌరులం అని ధ్రువీకరించే గుర్తింపు పత్రం.. పాస్‌పోర్టు. మనందరి వద్ద ఉండేది భారత పాస్‌పోర్టు. దాని ప్రయోజనం అంతవరకే. వేరే దేశాలకు వెళ్లాలంటే.. మన పాస్‌పోర్టుతోపాటు, ఆయా దేశాలు ఇచ్చే ‘వీసా’ కావాలి. కానీ.. నిత్యానందుడు తన ‘కైలాస’వాసులకు ఇచ్చే పాస్‌పోర్టుతో 11 డైమెన్షన్లకు, 14 లోకాల్లోకి (అందులో ఏడు అధో లోకాలు: అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళలోకాలు. మరో ఏడు ఊర్థ్వ లోకాలు: భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు) ప్రవేశం ఉచితం!! ఆయా లోకాల వీసాలు గట్రా అక్కర్లేదు!! కానీ, పాస్‌పోర్టుల్లో మాత్రం కించిత్‌ స్థాయీభేదాలున్నాయి. స్థాయిని బట్టి కొందరికి బంగారం రంగులో ఉండే గోల్డెన్‌ పాస్‌పోర్టు, మరికొందరికి ఎర్ర రంగు అట్టతో ఉండే పాస్‌పోర్టు ఇస్తారట. ఏ ‘స్థాయి’ వాళ్లకి ఏ రంగు పాస్‌పార్టు ఇస్తారనే వివరాలను మాత్రం కైలాస అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించలేదు.
సహచరుడే ప్రధాని
తన సొంత దేశానికి ప్రధానిగా.. తన అనుచరుడు, సన్నిహితుడు అయిన ‘మా’ అనే వ్యక్తిని ప్రధానిగా నియమించిన నిత్యానంద.. మంత్రి మండలినీ ఏర్పా టు చేశాడు. సదరు ప్రధాని, మం త్రులతో నిత్యానందుడు నిత్యం చర్చలు, సమావేశాలు కూడా జరుపుతున్నాడట!!
రాజ్యాంగం..
‘కైలాస’ దేశ రాజ్యాంగంలో 547 పేజీలున్నాయి. తమిళం, హిందీ, సంస్కృత భాషల్లో ఆ రాజ్యాంగం ఉం టుంది. తన కైలాస దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ నిత్యానందుడు ఐక్యరాజ్యసమితికి ఒక పిటిషన్‌ సమర్పించాడు. హిందూయిజాన్ని ఆచరిస్తూ, దాని వ్యాప్తికి కృషి చేస్తున్న తన ప్రాణాలకు భారతదేశంలో ముప్పు ఉన్నదని.. ‘కైలాస’ ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనుగోలు చేశానని పేర్కొన్నాడు.
10 విభాగాలు..
‘కైలాస’ దేశంలో 10 ప్రభుత్వ విభాగాలుంటాయట. అందులో ప్రధానమైనది.. దేశాధిపతి అయిన ‘హిజ్‌ డివైన్‌ హోలీనెస్‌ భగవాన్‌ శ్రీ నిత్యానంద పరమశివమ్‌ (పరమపూజ్యులైనట్టి భగవంతుడు శ్రీ నిత్యానంద పరమశివమ్‌)’ కార్యాలయ వ్యవహారాలు చూసే విభాగం. మిగతా తొమ్మిదీ.. ఆ దేశ అంతర్గత వ్యవహారాలు, డిజిటల్‌ ఎంగేజ్‌మెంట్‌, సోషల్‌ మీడియా, హోం, రక్షణ, వాణిజ్య, విద్య వంటి చిన్నచిన్న శాఖలన్నమాట.
జెండాపై బసవన్న..
కైలాస దేశ జెండా.. రిషభధ్వజం. దాని రంగు.. తోపు (మెరూన్‌) రంగు. దాని మీద సాక్షాత్తూ శివుడి రూపంలో చిద్విలాసం గావించే ‘నిత్యానంద’ స్వామి బొమ్మ.. పక్కనే నంది విగ్రహం ఉంటాయి.
నేను కైలాస వాసిని
జోరుగా సభ్యత్వాలు

నిత్యానంద స్వామి చెప్పుకొంటున్న కైలాస దేశంలో ‘‘మేమూ పౌరులం’’ అంటూ ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ విషయాన్ని నెట్‌లో ప్రచారం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ‘థర్డ్‌పార్టీ యాప్‌’ల ద్వారా కైలాసవాసిగా పేర్కొనే ప్రొఫైల్‌ ఫొటోలను సృష్టించుకుంటున్నా రు. వాటిపై.. ‘‘గొప్పదైన నాగరికత ఉన్న దేశం.. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం’’ అనే సందేశాలుంటున్నాయి.

కైలాసదేశ అధికార భాషలు: ఇంగ్లిష్‌, సంస్కృతం, తమిళం.
అధికారిక మతం: సనాతన హిందూ ధర్మం
జాతీయ జంతువు: నంది, జాతీయ పక్షి: శరభం
జాతీయ పుష్పం: పద్మం, జాతీయ వృక్షం: మర్రి చెట్టు

(Courtesy Andhrajyothi)