– నిత్యానంద ఆశ్రమంపై గుజరాత్‌ దంపతుల ఆరోపణ
అహ్మదాబాద్‌ : వివాదాస్పద బాబా నిత్యానందకు చెందిన ఆశ్రమంలో తమ ఇద్దరు కుమార్తెలను నిర్బంధించి వుంచారనీ, వారిని తమకు అప్పగించాలని కోరుతూ గుజరాత్‌కు చెందిన ఇద్దరు దంపతులు అహ్మదాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జనార్ధన్‌శర్మ, ఆయన భార్య సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు నలుగురు కుమార్తెలు అని, వారిని బెంగళూరులోని నిత్యానందకు చెందిన విద్యా సంస్థలో 2013లో చేర్చామని కోర్టుకు తెలిపారు. వారిని ఈ ఏడాది నిత్యానంద ధ్యానపీఠానికి చెందిన బ్రాంచ్‌ అహ్మదాబాద్‌లోని యోగిని సర్వగ్యపీఠానికి మార్చారన్న విషయం తమకు ఇటీవలనే తెలిసిందని పేర్కొన్నారు. కాగా, తమ బిడ్డలను కలిసేందుకు తాము ప్రయత్నించగా, ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు అనుమతించలేదని ఆరోపించారు. అనంతరం పోలీసుల సహకారంతో ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లగా, తమ ఇద్దరు మైనర్‌ కుమార్తెలను మాత్రమే పంపించారని, మిగతా ఇద్దరిని పంపేందుకు నిరాకరించారని కోర్టుకు తెలిపారు. వారిద్దరినీ కిడ్నాప్‌ చేసి నిత్యానంద ఆశ్రమంలో రెండు వారాల నుంచి అక్రమ నిర్బంధంలో ఉంచారని, ఈ వ్యవహారంపై తాము అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. దీనిపై న్యాయస్థానం కలుగజేసుకొని తమ బిడ్డలను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులు, ఇన్‌స్టిట్యూట్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారిని తమకు అప్ప గించేలా చూడాలని అభ్యర్ధించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. ఒక అత్యాచారం కేసులో నిత్యానందపై కర్నాటక హైకోర్టు గతేడాది జూన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Courtesy Navatelangana…