పాట్నా : తాను, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌  బీహార్‌ రాష్ట్రాన్ని సంక్షేమం, సౌభాగ్యం దిశగా నడిపించగలిగే డబుల్‌ ఇంజన్‌లాంటి వారమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక్కసారి పరిశీలించినట్లైతే అసమర్ధత, నిర్లక్ష్య ధోరణి బాగా కొట్టచ్చినట్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్‌ దీర్ఘకాలంగా దారిద్య్రంతో బాధపడుతుండడంతో పాటు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి మోడీ, నితీష్‌ కుమార్‌లు గత కొన్నేళ్ళుగా గొప్పగా వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు. అయినా రాష్ట్ర పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల ప్రచురించిన డేటా ప్రకారం, బీహార్‌కు మిగులు రెవెన్యూ వుందని, పైగా నిలకడగా అది పెరుగుతూ వస్తోందని, అంటే ఏటికేడాది ఖర్చు పెట్టేదానికన్నా ఆదాయమే ఎక్కువగా వుందని అర్ధం. గతేడాది బీహార్‌ మిగులు రెవెన్యూ ఏకంగా రూ.21,517 కోట్లుగా వుంది. దేశంలో నిరుపేద రాష్ట్రాల్లో బీహార్‌ ఒకటి. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన, క్షుద్భాద, నిరక్షరాస్యత, తీవ్రంగా ప్రబలే వ్యాధులు, పారిశ్రామికీకరణ లేకపోవడం వంటి రుగ్మతలతో బాధపడుతూ వున్నా డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మార్గాలు కనిపించకపోవడం దురదృష్టకరం. దేశంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే రెవెన్యూ మిగులుతో వున్నాయి. ప్రభుత్వ విధానపరమైన లోపాలు, నిర్లక్ష్యం కారణంగా డబ్బు వున్నా కానీ ఖర్చు పెట్టకుండా పోతున్నాయి.

క్షీణించిన పన్ను రెవెన్యూ
మొత్తం రెవెన్యూలో రాష్ట్ర పన్నుల వాటా 2013ా14 నుండి క్షీణిస్తూ రావడం మరో కోణం. 2019లో ఈ వాటా మరింత పడిపోయి కేవలం 20 శాతానికి చేరుకుంది. నితీష్‌ కుమార్‌ 15 ఏళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినపుడు కూడా ఈ వాటా 20 శాతంగానే వుంది. 2013ా14లో ఒక్కసారిగా ఈ వాటా 29 శాతానికి పెరిగినా ఆ తర్వాత నుండి తగ్గుతూనే వస్తోంది. పలు పన్నులు, సుంకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ వస్తుంది. వీటిల్లో వృత్తి పన్ను, ఆస్తి పన్ను(భూమి, స్టాంప్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు), వస్తువులు, సేవలపై పన్న్లులు (ఆమ్మకం పన్ను, ఎక్సైజ్‌, రవాణా, వినోదం, రాష్ట్ర జిఎస్‌టి) వున్నాయి. అదీకాకుండా కేంద్ర పన్నుల నుండి రాష్ట్రాలకు రావాల్సిన చట్టబద్ధమైన పన్ను వాటాలు కూడా వున్నాయి.

2017లో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్‌టి వల్ల చాలా రాష్ట్రాల్లో వాటి పన్ను రెవిన్యూ పడిపోయింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్‌ ద్వారా ఇందులో కొంత భాగం భర్తీ అవుతోంది. కానీ, బీహార్‌లో స్వంత పన్ను ఆదాయమనేది తగ్గిపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. పరిశ్రమలు, ఆధునిక సేవా రంగం లేకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి చాలా తక్కువ. దాంతో పన్నులు కూడా తక్కువగానే వుంటాయి. ఇది ఎప్పుడూ ఒక సమస్యే, కానీ ‘డబుల్‌ ఇంజన్‌’ ఆధ్వర్యంలో ఈ పరిస్థితి గణనీయంగా క్షీణించింది. ఈ పరిస్థితుల్లో, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం రుణాలకు వెళ్ళింది. ఇప్పుడు దాదాపు రు.1.86 లక్షల కోట్ల మేరకు రుణాలు పేరుకుపోయాయి. గత ఐదేళ్ళలో ఈ రుణాలు 71శాతం పెరిగాయి.

భారం ప్రజలపైనే
నిర్వహణాలోపం, జెడియుాబిజెపి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ జోక్యం ఎక్కువగా అవసరమైన కీలక రంగాలు క్షీణిస్తూనే వున్నాయి. మొత్తం రెవెన్యూ వ్యయంలో వైద్య, ప్రజారోగ్య రంగంపై పెట్టే ఖర్చు కేవలం నాలుగు శాతం దగ్గరే నిలిచిపోయింది. దీంతో మొత్తంగా నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులు ప్రస్తుత కరోనాతో మరింత ప్రస్ఫుటమయ్యాయి. ఈ ఎన్నికల ప్రచారంలో నితీష్‌ కుమార్‌ తాజాగా వాగ్దానం చేస్తున్న నీటిసరఫరా, పారిశుధ్యం రంగాలకు 2005లో నితీష్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మొత్తం వ్యయంలో కేవలం ఒకే ఒక్క శాతం నిధులను ఖర్చు పెడుతున్నారు. గత మూడేళ్ళలో మాత్రం ఈ కీలకమైన రంగానికి పెడుతున్న వ్యయం కాస్తంతగా అంటే నాలుగు శాతానికి పెరిగింది.

తీవ్రంగా వెనుకబడిన వర్గాలు (ఇబిసి), మహాదళితులు కోసం పనిచేసే గొప్ప పార్టీగా జెడియుాబిజెపి తనను తాను ప్రదర్శించుకుంటోంది. కానీ దళితులు, ఆదివాసీల సంక్షేమంపై ఖర్చు పెడుతున్న తీరు చూస్తే అసలు విషయం తెలుస్తుంది. మొదటి ఐదేళ్ళలో ఈ ఖర్చు కేవలం ఒకే ఒక్కశాతంగా వుంది. గత ఐదేళ్ళ కాలంలో ఇది సగటున నాలుగు శాతానికి పెరిగింది. తర్వాత ఐదేళ్ళ కాలానికి 2 శాతానికి క్షీణించింది. ఆకలి, పోషకాహార లోపం విస్తృతంగా వ్యాపించడం, పైగా పిల్లల్లో, శిశువుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా వుండడంతో బీహార్‌ ప్రభుత్వం మరికొంత మొత్తాలను అన్నార్తులకు అవసరమైన పోషకాహారాన్ని అందించడానికి ఖర్చుపెడుతుందని అందరూ ఆశిస్తారు కానీ పోషకాహారంపై పెట్టే వ్యయం గత 15 ఏళ్ళ కాలంలో కేవలం 1ా2 శాతం మధ్యనే వుంది. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణి, ఉదాసీనత కారణంగా సుపరిపాలకుడినని గొప్పలు చెప్పుకునే నితీష్‌ కుమార్‌ పూర్తి వైఫల్యం చెందిన వ్యక్తిగా మిగిలిపోయారు. ఈ మొత్తం క్రమంలో బిజెపి కూడా ఆయనతో పాటే అనుసరిస్తూ వచ్చింది.

Courtesy Prajashakti