– బీజేపీ-జేడీయూ సంకీర్ణంలో కొనసాగుతున్న ‘జంగల్‌రాజ్‌’
– మూడురేట్లు పెరిగిన మహిళలపై నేరాలు
– ఐదు కేసులకు… ఒక్క దాంట్లో దోషులకు శిక్ష
– న్యాయపోరాటంలో బాధితులకు ప్రభుత్వ సహకారం సున్నా
– 2020నాటికి పెండింగ్‌ కేసులు 81,678

న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), ప్రస్తుత నితీశ్‌ ప్రభుత్వ పాలనకు తేడా ఏమైనా ఉందా? మహిళలపై నేరాలు తగ్గాయా? అంటే లేదనే సమాధానం వస్తోంది. 15ఏండ్ల క్రితంనాటి పరిస్థితులతో పోల్చితే, ప్రస్తుతం బీహార్‌లో నేరాలు, ఘోరాలకు అడ్డుకట్ట పడలేదు. తగ్గుముఖం పట్టలేదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారమే ఇందుకు సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2005-2019 మధ్య నిరాఘాటంగా 15ఏండ్లుగా బీజేపీ-జేడీయూ సంకీర్ణ కూటమి బీహార్‌ను పాలిస్తోంది. ఈ మధ్యకాలంలో మహిళలపై నేరాలు మూడురేట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నేరాల్లో దోషులకు శిక్ష పడటం కూడా చాలా అరుదుగా జరుగుతోంది. ఐదు కేసులకు ఒక్క కేసులో దోషులకు శిక్ష ఖరారు అవుతోందని అక్కడి ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

40శాతం పెరిగిన లైంగికదాడులు
లైంగికదాడి, మహిళల హత్య, వరకట్న హత్యలు, లైంగికదాడులు, వేధింపులు, యాసిడ్‌ దాడులు, కిడ్నాపులు…మొదలైనవి బీహార్‌లో పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత ఐదేండ్లతో పోల్చితే, లైంగికదాడి ఘటనలు 40శాతం పెరిగాయి. బాలికలపై లైంగికదాడుల ఘటనలు 19శాతం పెరిగాయి. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు దిగటం, చివరికి చంపేంత వరకూ వెళ్లటం..వంటి ఘటనలు 2016లో 987 నమోదైతే, 2019లో 1127 ఘటనలు చోటుచేసుకున్నాయి. అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మహిళలపై నేరాల్లో దోషులు పెద్ద సంఖ్యలో శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.

బాధితుల్లో సన్నగిల్లిన ఆశ
ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లతో పోల్చుకుంటే, నేరాల రేటు బీహార్‌లో గణనీయంగా ఉంది. పోలీసులు, చట్టాలు బీహార్‌లో మహిళలపై నేరాల్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అత్యధిక కేసుల్లో పోలీసు విచారణ సుదీర్ఘంగా కొనసాగటం, ఒక పట్టాన కేసు తెమలకపోవటం నిందితులకు ‘బెన్‌ఫీట్‌ ఆఫ్‌ డౌట్‌’ను ఇస్తోంది. దాంతో పోలీసులు, న్యాయవ్యవస్థలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశ బాధితుల్లో సన్నగిల్లింది. నిందితులు బెయిల్‌పై విడుదలై రాజకీయ, ఆర్థిక బలంతో చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాల్ని బెదిరిస్తున్నారు. కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.

బీహార్‌లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, పోలీసుల్ని ఆశ్రయిస్తే న్యాయం జరగదనే అభిప్రాయం బలపడింది. పలు ఘటనల సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసుల్ని ఆశ్రయించడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ పోలీసుల దగ్గరకు వెళ్లినా, బయట తేల్చుకోండంటూ బాధితులకు పోలీసులే సూచిస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరగలేరు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి..అని పోలీసులే బాధితుల్ని బెదిరిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లకుండా బాధితుల్ని భయపెట్టే వ్యవస్థ బీహార్‌లో గట్టిగా పనిచేస్తోంది.

కోర్టుల్లో..
– మహిళలపై నేరాలకు సంబంధించి కేసుల విచారణ బీహార్‌ కోర్టులో నత్తనడక సాగుతున్నాయి. కోర్టుల్లో 74,099కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
– పాత పెండింగ్‌ కేసులకు 2020 ఏడాదిలో కొత్తగా చేరినవి 10,859. దాంతో మొత్తం పెండింగ్‌ కేసుల సంఖ్య 84,958కి పెరిగింది. 2,379 కేసుల్లో విచారణ పూర్తయి…కోర్టు శిక్ష వేసింది.
– మహిళలపై నేరాలు పరిష్కరించడానికి పోలీసులు, రాజకీయ పెద్దలు మధ్యవర్తిత్వం వహించటం పరిపాటిగా మారింది. దాంతో బాధితులపై ఒత్తిడి పెద్ద ఎత్తున నెలకొంటోంది.
– గత ఏడాది మహిళలపై నేరాలకు సంబంధించి 9854 కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ తరహా కేసులు మొత్తం 28,441 పేరుకుపోయాయి.
– పెండింగ్‌ కేసుల్లో…4,175కేసుల్ని (15శాతం) పోలీస్‌ స్థాయిలో మూసేశారు. తప్పుడు కేసులు అని తేల్చేసి..725, సరైన సాక్ష్యాలు లేవని 607 కేసుల్ని మూసేశారు.
– 10,859 కేసుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్‌ నమోదుచేయగా, 13,407 కేసుల్లో విచారణ పెండింగ్‌లో ఉంది.

మహిళలపై నేరాలు శిక్ష ఖరారు రేటు
సంవత్సరం దోషులకు శిక్ష
2015 సమాచారం లేదు
2016 18.6శాతం
2017 18.4శాతం
2018 28శాతం
2019 16శాతం

Courtesy Nava Telangana