ఎం.వి.రాజీవ్‌ గౌడ
ఆకాష్‌ సత్యవలి

బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సుపరిపాలన, సంక్షేమం గురించి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పదే పదే చెబుతున్న వాటిల్లో నిజమెంత అనేది పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వుంది. బీహార్‌లో నెలకొన్న వాస్తవిక పరిస్థితులు ముఖ్యమంత్రి మాటలను సమర్ధించేలా వున్నాయా? లేక గుజరాత్‌ నమూనా మాదిరిగానే ఇవి కూడా కేవలం ప్రగల్భాలేనా? లేదా ప్రచారార్భాటమేనా? అనేది తేలాల్సి వుంది.

జనతాదళ్‌ (యునైటెడ్‌)-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ పాలనలో బీహార్‌ ఆర్థిక పరిస్థితి చాలా పేలవంగా వుంది. ఇతర రాష్ట్రాల సగటు కన్నా బీహార్‌ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) చాలా తక్కువగా వుంది. 2011-12, 2018-19ల మధ్య రాష్ట్ర సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్‌) 6.16 శాతంగా వుంది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సగటు 7.73 శాతంగా వుంది. ఈ రాష్ట్రానికి వున్న అతి తక్కువ ఆర్థిక పునాది కారణంగా, బీహార్‌ విస్తృతంగా పురోగతి సాధించాల్సి వుంది. కొన్ని సంవత్సరాలు సాధించిన ఆర్థిక పురోగతిని అతిశయోక్తిగా చెప్పుకుంటూ మొత్తంగా పేలవమైన పని తీరును కప్పిపుచ్చుకునేందుకు నితీష్‌ ప్రయత్నిస్తున్నారు.

బీహార్‌ తలసరి ఆదాయం (పిసిఐ) సిఎజిఆర్‌ 2011-12, 2018-19 మధ్య కాలంలో కేవలం 4 శాతంగా వుంది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సగటు 5.61 శాతంగా వుంది. వాస్తవానికి, బీహార్‌ తలసరి ఆదాయం దేశంలోనే అత్యంత తక్కువైనది. 2011-12లో బీహార్‌ తలసరి ఆదాయం మొత్తం సగటులో 26.11 శాతంగా వుంది. 2018-19 నాటికి ఇది 23.48 శాతానికి పడిపోయింది. 2004-05లో నితీష్‌ కుమార్‌ అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు, బీహార్‌ తలసరి ఆదాయం మొత్తం సగటులో 26.48 శాతంగా వుండేది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే నిర్వహించిన వినిమయ వ్యయానికి సంబంధించిన సర్వేను విశ్లేషించి చూడగా, 2011-12, 2017-18 మధ్య కాలంలో బీహార్‌లో దారిద్య్రం 17 పాయింట్లు పెరిగి 50.47 శాతానికి చేరుకుంది. బీహారీలను మరింత నిరుపేదలుగా చేయడమే సంక్షేమమా?
బీహార్‌ రుణ భారం గణనీయంగా పెరిగింది. 2005 నాటి నుండి చూసినట్లైతే 375 శాతం పెరిగింది. జిఎస్‌డిపిలో శాతంగా చూసినట్లైతే, 2014-15 నుండి పేరుకుపోయిన అప్పులు పెరుగుతునే వున్నాయి. ”రుణాలుగా తీసుకున్న మొత్తాల్లో 80 నుండి 85 శాతం తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు తీర్చడానికే సరిపోయింది. దీనివల్ల అభివృద్ధి కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఖర్చు పెట్టింది.” అని బీహార్‌ ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ ఆడిట్‌ నివేదిక వ్యాఖ్యానించింది.

ఉద్యోగాలు కొరతగానే వున్నాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే 2017-18 కాలానికి నిర్వహించిన సర్వే ప్రకారం బీహార్‌లో 87 శాతం మంది కార్మికులకు రెగ్యులర్‌ లేదా నెలవారీ వేతనం అందే ఉద్యోగం లేదని వెల్లడైంది. ఇందుకు సంబంధించి చూసినట్లైతే దేశంలోనే అత్యంత అధ్వాన్నమైన స్థితిలో బీహార్‌ వుందని స్పష్టమవుతోంది. 2019 ఫిబ్రవరి నుండి నిరుద్యోగం రేటు రెండంకెల్లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది మే నాటికి రికార్డు స్థాయిలో 46.6 శాతానికి చేరింది. నిరుద్యోగం వల్ల పాల్పడే ఆత్మహత్యలు 2015 నుండి 438 శాతం పెరిగాయి.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఎపిఎంసి)లను రద్దు చేసి బీహార్‌ ఈ విషయంలో ఆద్యురాలిగా నిలిచింది. వ్యవసాయ రంగమే విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించే రంగం. కానీ, బీహార్‌ మాత్రం వ్యవసాయ కుటుంబానికి వచ్చే సగటు నెలవారీ ఆదాయం (రూ.3,558)లో దేశంలోనే అత్యంత తక్కువ స్థాయిలో వుంది. జాతీయ సగటు రూ.6,426గా వుంది. దేశవ్యాప్తంగా సగటున 63.6 శాతం కుటుంబాలతో పోలిస్తే బీహార్‌లో 86 శాతానికి పైగా వ్యవసాయ కుటుంబాలు రుణ ఉచ్చులో కూరుకుని పోయాయి. 2018-19లో వ్యవసాయాభివృద్ధి రేటు 0.6 శాతానికి పడిపోయింది. పంటలు 3.9 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేశాయి.

నికర ఆదాయం క్షీణిస్తోందని ఎపిఎంసి సంస్కరణల అనంతర కాలంలో నేషనల్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. బీహార్‌ రైతాంగాన్ని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టింది. ధాన్యం సేకరణ సంస్థల అసమర్ధత కారణంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కన్నా చాలా తక్కువగా రైతులకు ధర వస్తోంది. 2015 నుండి 80 శాతానికి పైగా ధాన్యం సేకరణ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ రబీ సీజనులో బీహార్‌లో పండించిన గోధుమల్లో ఒక శాతం కన్నా తక్కువగానే సేకరించారు. ఇది సుపరిపాలన కాదు, సంక్షేమం అంతకంటే కాదు.

ఇకపోతే, సుపరిపాలన అందించామంటూ నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం చేసుకునే ప్రచారాల్లో అత్యంత ముఖ్యమైన అంశం శాంతి భద్రతలను మెరుగుపరిచామని చెప్పుకోవడం. కానీ వాస్తవం పరిశీలించినట్లైతే చాలా తేడా వుంది. 2010-2019 మధ్య కాలంలో బీహార్‌లో నేరాలు దాదాపు రెట్టింపయ్యాయి. హింసాత్మక నేరాల్లో దేశంలోనే బీహార్‌ రెండో స్థానంలో వుంది. 2017-19 మధ్య కాలంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు వరుసగా 26 శాతం, 73 శాతం పెరిగాయి. బాల్య వివాహాల కోసం 12 మందికి పైగా మైనర్లను కిడ్నాప్‌ చేశారు. దేశంలో ఇటువంటి నేరాలు ఇక్కడే ఎక్కువ. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంది.

నేరాల గణాంకాలను చూసినట్లైతే, బాధ్యతాయుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఎవరైనా భావిస్తారు. కానీ దురదృష్టవశాత్తూ, నితీష్‌ ప్రభుత్వం అలా చేయలేదు. 2019 జూన్‌ వరకు, నిర్భయ నిధి కింద వేర్వేరు కార్యక్రమాల కోసం ఒక్క రూపాయి కూడా బీహార్‌ సర్కార్‌ ఖర్చు పెట్టలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, మంజూరైన నిధుల్లో కొద్ది మొత్తం మాత్రమే ఉపయోగించారు. ఇంకా 59 శాతం నిధులను ఖర్చు పెట్టకుండా అలాగే వుంచారు. పైగా, నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. 2005-2019 మధ్య కాలంలో కిడ్నాప్‌లు 39.1 శాతం పెరిగాయి.

ఇక చివరి అంశానికి వచ్చినట్లైతే, ఉద్యోగాలు, జీవన భృతి అవకాశాలు కల్పిస్తామంటూ బీహార్‌ ప్రభుత్వం ఇచ్చిన శుష్క వాగ్దానాలతో…లాక్‌డౌన్‌ అనంతరం బీహార్‌కు తిరిగి వచ్చిన వలస కార్మికులు కలలన్నీ చెల్లాచెదురైపోయాయి. ప్రస్తుతం జాబ్‌ కార్డు వున్నవారికే పని దొరకని పరిస్థితుల్లో…మరిన్ని జాబ్‌ కార్డులు జారీ చేస్తామంటూ ప్రభుత్వం లేనిపోని గొప్పలు చెబుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద బీహార్‌లో రెండున్నర కోట్ల మందికి పైగా కార్మికులు నమోదయ్యారు. కానీ, ఈ చట్టం కింద కేవలం 4,788 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతకు తోడు బీహార్‌ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రజలకు పెను విపత్తుగా మారుతోంది.
సహజంగానే ప్రకృతి వైపరీత్యాలతో బీహార్‌కు వరదలు ఎక్కువ. ఈ ప్రకృతి విపత్తులు, అంటువ్యాధుల కన్నా ఎక్కువగా బీహార్‌లో ఎన్నికైన నాయకత్వం మంచి పాలనను అందించలేక పోవడం వల్లనే ప్రజల సంక్షేమం సుదూర స్వప్నంగా మిగిలిపోయిందని చెప్పక తప్పదు.

(ఎం.వి.రాజీవ్‌ గౌడ మాజీ ఎం.పి, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ రీసెర్చ్‌ విభాగ చైర్మన్‌. ఆకాష్‌ సత్యవలి సమన్వయకర్త)